I am Ready: తన మంత్రి పదవి పొతే విపక్షాలపై విమర్శల విషయంలో విశ్వరూపం చూస్తారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. ఒక రకంగా మంత్రి పదవి తనకు అడ్డంగా ఉందని, తాను ఏం మాట్లాడినా ప్రభుత్వం తరఫున మాట్లాడినట్లు అవుతుందని, అదే మంత్రి పదవి లేకపోతే ఫ్రీ బర్డ్ ను అవుతానని, అప్పుడు విశ్వరూపం చూస్తారని నాని వెల్లడించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో కొడాలి మీడియాతో మాట్లాడారు. మంత్రి పదవిని కొనసాగించుకోవడం కోసమే, జగన్ దగ్గర మార్కులు సంపాదించడం కోసమే టిడిపిపై ఘాటు విమర్శలు చేస్తున్నారా అంటూ ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు కొడాలి పై విధంగా సమాధానమిచ్చారు.
ఏదో పదవి ఆశించి ఈ పార్టీలోకి రాలేదని, ఎన్టీఆర్ తో పాటు అయన మూడో తరాన్ని కూడా నాశనం చేయాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నారని తీవ్రంగా విమర్శించారు. నందమూరి హరికృష్ణ అభిమానిగా, అయన అనుచరుడిగా, ఎన్టీఆర్ మీద ఉన్న మమకారంతో…. జగన్ అయితేనే బాబు లాంటి వ్యక్తిని రాజకీయంగా సమాధి చేయగలడనే నమ్మకంతోనే, ఏమీ ఆశించకుండా వైసీపీలో చేరానన్నారు. తాను బతికినంతకాలం వైఎస్ జగన్ తోనే ఉంటానని పునరుద్ఘాటించారు.
ఎన్టీఆర్ ఆశలు నెరవేర్చే, అయన ఆఖరి కోరిక తీర్చగలిగే సత్తా జగన్ మోహన్ రెడ్డికే ఉందన్నారు కొడాలి. ఎన్టీఆర్ కుటుంబంలో మూడో రానికి కూడా బాబు చేస్తున్న అరాచకాలు ఎదుర్కోవాలని, ఎన్టీఆర్ వాయిస్ వినిపించాలనే తాను పదే పదే మీడియా ముందుకు వస్తున్నానని పేర్కొన్నారు.
సిఎం వైఎస్ జగన్ దగ్గర ఎలా మార్కులు సంపాదించాలో తెలుసనీ, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాతే తాను తెలుగుదేశం పార్టీపై మాట్లడడంలేదని, గతంలో కూడా విమర్శలు చేశానని చెప్పారు. తనకు ఏ మార్కులూ, పదవులూ అవసరం లేదని స్పష్టం చేశారు.
Also Read : అతిగా మాట్లాడితే తాట తీస్తాం: కొడాలి నాని