కరోనాపై పోరాటంలో విజయం సాధించేందుకు దేశవ్యాప్తంగా టీకా కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరముందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఇందుకోసం టీకాపై ప్రజల్లో నెలకొన్న అపోహలు, అనుమానాలను నివృత్తి చేస్తూ.. వారిలో చైతన్యం తీసుకురావల్సిన అవసరం ఉందన్నారు.
జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా బుధవారం చెన్నైలో ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డా. జార్జి అబ్రహామ్ రాసిన “మై పేషెంట్స్ మై గాడ్ – జర్నీ ఆఫ్ ఏ కిడ్నీ డాక్టర్” పుస్తకం తొలి కాపీని ఉపరాష్ట్రపతికి అందజేశారు. వైద్యునిగా, విద్యావేత్తగా, పరిశోధకునిగా అబ్రహామ్ నాలుగు దశాబ్ధాల ప్రస్థానాన్ని ఈ పుస్తకంలో పొందుపరిచారు.
ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ కరోనా విషయంలో ప్రజల్లో కొన్ని అపోహలున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల్లో నెలకొన్న ఆందోళనలను తొలగించేందుకు మరింత కృషిజరగాలి. టీకా కార్యక్రమాన్ని ఓ ప్రజాఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఉపరాష్ట్రపతి చైతన్య పరిచేందుకు వైద్యరంగంతో అనుసంధానమైన ప్రతి ఒక్కరూ ఇందుకోసం ప్రత్యేకంగా చొరవతీసుకోవాలని సూచించారు.
కరోనా మహమ్మారిపై పోరాటాన్ని ముందుండి నడపడంలో వైద్యులు చూపించిన చొరవను ప్రశంసించిన ఉపరాష్ట్రపతి భారతీయ సమాజాన్ని కరోనా ముప్పు నుంచి కాపాడేందుకు వైద్యులు తమ జీవితాలను పణంగా పెట్టి శ్రమించారన్నారు. మానవాళిని కాపాడేందుకు వారు నిస్వార్థంగా చేసిన త్యాగాలను యావద్భారతం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు. టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేయడంతోపాటు సమర్థవంతంగా అమలుచేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టీమిండియా స్ఫూర్తితో పనిచేయాలని సూచించిన ఉపరాష్ట్రపతి ప్రజల్లో చైతన్య పరిచే కార్యక్రమాల్లో పౌరసమాజం సభ్యులు, సినీనటులు, క్రీడాకారులు, పార్టీలకు అతీతంగా ప్రజా ప్రతినిధులు ముందుకు రావాలని సూచించారు.
కరోనా మహమ్మారి సమయంలో వైద్యసేవల రంగంలోని వారు చేసిన త్యాగాలను గుర్తుచేసిన ఉపరాష్ట్రపతి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లెక్కల ప్రకారం.. దాదాపు 1500 మంది వైద్యులు, వైద్యసిబ్బంది కరోనాకు బలయ్యారన్నారు.
వైద్యులను దైవంతో సమానంగా కీర్తించే ఘనమైన వారసత్వం భారతీయ సమాజంలో ఉందంటూ ‘వైద్యో నారాయణో హరి’ అని పురాణాల్లో పేర్కొన్న అంశాన్ని గుర్తుచేశారు. వైద్యులు కూడా రోగులను పరీక్షించే సమయంలో కాస్త వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు.