Its Nadal: ఫ్రెంచ్ ఓపెన్ -2022 కిరీటం స్పెయిన్ స్టార్ రఫెల్ నాదల్ కే దక్కింది. నేడు జరిగిన ఫైనల్లో నార్వే ఆటగాడు, ఎనిమిదో ర్యాంక్ ఆటగాడు కాస్పర్ రూడ్ పై 6-3; 6-3;6-0 తో గెలుపొందాడు. రఫెల్ అనుభవం ముందు రూడ్ ఆట తేలిపోయింది. మూడు వరుస సెట్లలో విజయం సాధించి సగర్వంగా కప్ అందుకున్నాడు.
ఈ విజయంతో తన కెరీర్ లో 14వ ఫ్రెంచ్ టైటిల్ తన సొంతం చేసుకున్నాడు నాదల్. వరల్డ్ ర్యాంకింగ్స్ లో ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్న నాదల్ ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ ను కూడా గెల్చుకున్న సంగతి విదితమే. కాగా, నాదల్ కు ఇది 22వ గ్రాండ్ స్లామ్ టైటిల్, 14 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ తో పాటు, యూఎస్ ఓపెన్ నాలుగు సార్లు, ఆస్ట్రేలియన్ ఓపెన్- వింబుల్డన్ రెండేసి సార్లు గెల్చు కుని రికార్డు సృష్టించాడు.
ఈ టోర్నమెంట్ లో క్వార్టర్ ఫైనల్లో వరల్డ్ నంబర్ వన్ జకోవిచ్ పై విజయం సాధించాడు, సెమీస్ లో మూడో సీడ్ ఆటగాడు, జెర్మనీ కి చెందిన అలెగ్జాండర్ జ్వరేవ్ కుడికాలి చీలమండ కారణంగా వాకోవర్ కావడంతో నాదల్ ఫైనల్లో ప్రవేశించాడు. సెమీస్ లో మొదటి సెట్ నాదల్ గెల్చుకున్నప్పటికీ జ్వరేవ్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్నాడు.