Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంనిరంతర స్ఫూర్తి నాగసూరి వేణుగోపాల్

నిరంతర స్ఫూర్తి నాగసూరి వేణుగోపాల్

A Perfect Man: సాహిత్యం, జర్నలిజం, విజ్ఞాన తదితర రంగాల్లో తనదైన ముద్ర వేసి..భవిష్యత్ తరాలకు ఆయా అంశాల్లో పాఠ్యగ్రంథాలను అందించిన నిరంతరాన్వేషి..డాక్టర్ నాగసూరి వేణుగోపాల్. ఇదివరకటి అనంతపురం జిల్లా నేటి శ్రీ సత్యసాయి జిల్లాలోని సోమందేపల్లి మండలంలోని కొనతట్టుపల్లి కుగ్రామంలో జన్మించారాయన. కనీస సదుపాయాలు లేని కేవలం 60 ఇల్లు మాత్రమే ఉండే చిన్న ఊరిలో పుట్టి స్వయంకృషి, సమయపాలనలతో నాగసూరి ఎల్లలు దాటి తన బహుముఖ ప్రతిభను చాటారు. ఆకాశవాణిలో కార్యనిర్వాహకుడిగా(Program Executive) మొదలైన నాగసూరి ప్రస్థానం..అప్రతిహతంగా కొనసాగింది. ఆకాశవాణిలో.. శ్రోతలు ఆదరించే ఎన్నో వినూత్న, విలక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రతి ఆకాశవాణి కేంద్రంలో తెలుగు, ఇంగ్లీష్, సామాజిక అంశాలు, ప్రజారోగ్యం, సాహిత్యం, సంగీతం, సైన్స్ వంటి శ్రోతలను ఆకర్షించే మంచి కార్యక్రమాలకు పెద్దపీట వేశారు. పనాజీ(గోవా), ఢిల్లీ, అనంతపురం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కడప, చెన్నై, తిరుపతి వంటి ప్రధాన ఆకాశవాణి కేంద్రాలలో విధులు నిర్వహంచి మరెవరికి సాధ్యం కాని స్థాయిలో వినూత్న కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. నేటికీ వాటి శీర్షికలను కూడా మార్చలేని స్థాయిలో సగర్వంగా నిలబెట్టారు. ఆయా కేంద్రాలలో నాగసూరి వేణుగోపాల్ ద్వారా పురుడుపోసుకున్న కార్యక్రమాలే నేటికీ శ్రోతలను అలరిస్తుండడం చెప్పుకోదగ్గ విషయం.

ఒక్క రేడియో కార్యక్రమాల విషయంలోనే కాదు..కొత్త క్యాజువల్ అనౌన్సర్లకు తర్ఫీదునివ్వడంలో కూడా ఆయన అనుసరించిన విధానం ఆసక్తికరం… అనుసరణీయం. ఆకాశవాణికి ఎంపికైన క్యాజువల్ అనౌన్సర్లు..శిక్షణ సమయంలో ప్రతి రోజూ ఏ ఒక్కరూ మరొకరితో పక్కపక్కనే కూర్చోకుండా జాగ్రత్త వహించిన తీరు నిజంగా అభినందనీయం. దీని ద్వారా అందరిలో స్నేహభావం, కలిసిమెలిసి పని చేసే స్వభావాలను పెంపొందేలా చేయడం ఆయన దూరదృష్టికి ఒక ఉదాహరణ. స్వరం ఒక్కటే బాగుంటే చాలదని వారిలో విశ్వాసాన్ని పెంచేలా , ఏ చిన్న తప్పిదానికి అవకాశం లేని పద్ధతిలో ‘క్యాజువల్ అనౌన్సర్’ ఒక్కరే ట్రాన్స్ మిషన్ మొత్తాన్ని ఒంటి చేత్తో నడిపించే స్థాయిలో వారిని తీర్చిదిద్దడం నాగసూరికే చెల్లు. ఆఫీసు బోయ్ దగ్గరి నుంచి తనకు సంబంధించిన అన్ని విభాగాల్లోనూ ఏ చిన్న ఇబ్బంది వచ్చినా దాని పూర్తి బాధ్యత తానే తీసుకుని ‘తప్పునాదే’ అని పై అధికారులకు చెప్పే నిజాయితీ గల సాహసి నాగసూరి.

ఆకాశవాణి కళాకారులకు చెల్లింపుల విషయంలో జాప్యం లేకుండా చూడడం, ఇంటర్వ్యూకి సంబంధించి ప్రశ్నావళిని సన్నద్ధం చేయడం, శాస్త్రవేత్తలు, సాహితీవేత్తలు, డబ్బింగ్ కళాకారులు, నాటక రంగ ప్రముఖులు, దర్శక, నిర్మాతలు, సంగీత దర్శకులు, గేయ రచయితలను సమన్వయం చేసి సరైన సమయానికి స్వాగతం పలకడం, ఆత్మీయంగా పలకరించడం, మర్యాదతో వారు ఆకాశవాణి గడప దాటే దాకా దగ్గరుండి ప్రతి చిన్న విషయాన్ని చూసుకోవడం, తానెంత ప్రయాస పడినా వారికి…వారి స్థాయికి సముచిత గౌరవిమిచ్చి ఆర్టిస్ట్ లకు మాత్రం కించిత్ ఇబ్బంది కలగకుండా సర్వం సిద్ధం చేయడంలో నాగసూరిని మించిన వారు లేరు. ఆకాశవాణిని రేడియోని ప్రధాన సామాజిక విద్యగా భావించి ఇష్టపడిన పనిలో ఎంతైనా కష్టపడడం నాగసూరికే ఉన్న ప్రత్యేక సుగుణం. తన ఉద్యోగ ప్రస్థానం మొదలుపెట్టిన నాటి నుంచి పదవీ విరమణ వరకూ తన కర్తవ్యాన్ని సమర్థవంతంగా పూర్తి చేయడంలో ఆ సద్గుణమే కీలక పాత్ర పోషించిందినడం అతిశయోక్తి కాదు.

2016-18 కాలంలో ఆల్ ఇండియా రేడియో తిరుపతి కేంద్రంగా నాగసూరి వేణుగోపాల్ డైరెక్టర్ గా ఉన్న సమయంలో సైన్స్ గురించి అవగాహన కల్పించే లక్ష్యంతో అడుగులేశారు. విజ్ఞాన కార్యక్రమాలైన.. రండి చూసొద్దాం తారామండలం , అడగండి తెలుసుకోండి శీర్షికన ప్రశ్న – సమాధానం వంటి విజ్ఞాన కార్యక్రమాల ఆధారంగా శ్రోతల నుండి ఉత్తరాలు/ఫోన్ కాల్‌లు/మెయిల్‌ల ద్వారా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి రూపొందించిన కార్యక్రమాలు కచ్చితంగా మెచ్చుకోదగ్గవి. పుస్తకాలు చదవడమే కాకుండా వాటికి సంబంధించిన నోట్సు , చదివిన పుస్తకాల పేజీ నెంబర్ తో పాటు రాసుకునే అలవాట్లు మా తరం అలవరచుకోవలసినవి. వృత్తి రీత్యా అనేక బదిలీలు ఉన్నప్పటికీ.. అలా రాసుకున్న పుస్తకాలన్నీ ఇప్పటికీ పధిలంగా నిలుపుకోవడం అసాధారణమైన విషయం. నాగసూరి వేణుగోపాల్ గారికి రచయిత కావాలనే కోరిక 9,10 తరగతి చదివే కాలంలోనే మొదలైందంటే ఆయన అభ్యసనం, అధ్యయనాలు ఇప్పటికే స్వర్ణోత్సవాలు జరుపుకున్నట్లు. 62 ఏళ్ల వయసు దాటే సరికి ఆయన ప్రచురించిన పుస్తకాల సంఖ్య 72. వీటిలో ఆయన స్వీయ రచనలే 45 మించి ఉన్నాయంటే ఆయన సమయపాలన ఏపాటిదో అర్థమవకపోదు. ముందు రోజు రాత్రి ఆకాశవాణిలో ప్రకటించిన ప్రసారవిశేషాలనే మరుసటి రోజు ఏ మార్పు చేయకుండా, శ్రోతలను ఏమార్చకుండా నాగసూరిలా శ్రోతలకు అందించడం ప్రస్తుత ప్రతి ఆకాశవాణి కేంద్రానికి పెను సవాలే. రాత్రి వేళల్లో డీటీహెచ్ ద్వారా ఆకాశవాణిలో ఆ రోజు కార్యక్రమాలను తిరిగి రాత్రి మరోసారి ప్రసారం చేసే విధానం హైదరాబాద్ కేంద్రంలో ఆయన ఆధ్వర్యంలోనే సమర్థవంతంగా నడిచింది.

రవికాంచని చోట కవి గాంచునట అనే నానుడిని సార్థకం చేస్తూ నాగసూరి వేణుగోపాల్ ఇతరులు చూడని కోణంలో ప్రతీ విషయాన్ని తరచి చూస్తారు. పరిశీలిస్తారు. పరిశోధిస్తారు. ఎవరికి పాలుపోని అంశాలను సైతం క్షుణ్ణంగా వివరిస్తారు. సమాజం స్పృశించని స్వాతంత్ర సమరయోధులు, దేశ నాయకుల గురించి సవివరంగా తెలియపరుస్తారు. మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా దానికి తగినట్లు నాగసూరి వేణుగోపాల్ తీర్చిదిద్దిన కార్యక్రమాలు ఆయనకు ప్రత్యేక పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. 1995లోనే “రేడియోస్కోపు’ అనే ఆంగ్ల సైన్స్ సంచికా కార్యక్రమం దేశంలో అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమై వారికి మరింత గుర్తింపు తెచ్చింది. అమరజీవి పొట్టిశ్రీరాములు 58 రోజులపాటు నిరాహార దీక్ష చేసి భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు రావడానికి ప్రాణ త్యాగం చేసినప్పటి పరిస్థితులపై ఆయన రాసిన వ్యాసాలు చాలా మంది అపోహలు తొలగించి ఆలోచింపజేశాయి. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేసుకుని ఇటీవల 70 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా గత డిసెంబర్ 15వ తేదీన మద్రాసు నుంచి సుమారు 360 కిలోమీటర్ల దూరంలో ఉండే పడమటి పల్లె గ్రామానికి ప్రముఖ సినీనటుడు సాయిచంద్ కాలినడకన ఒంటరి ప్రయాణాన్ని ప్రధాన మీడియా పట్టించుకోకున్నా దాన్ని వ్యాసంగా రాసి ఈ సమాజాన్ని నాగసూరి తట్టిలేపారు. అరుదైన విషయాలు, ఎవరికీ తెలియని సంగతులను సూటిగా, గంభీరంగా, స్పష్టంగా, క్లుప్తంగా, సూచనగా చెప్పడంలో నాగసూరి వేణుగోపాల్ తర్వాతే ఎవరైనా అనడానికి ఇదో మచ్చుతునక.

1978లో ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రపత్రికలోప్రచురితమైన నాగసూరి వేణుగోపాల్ మొట్టమొదటి రచన ‘ఎన్నికల కోలా (హాలా) హలం’ నుండి వీరి రచనా ప్రయాణం జనరంజక విజ్ఞానం, పర్యావరణం, పత్రికారంగం, టీవీ ఛానళ్ళు, సాహిత్యం, సామాజిక అంశాలు ఇలా అనేక రంగాలకు సంబంధించిన 3 వేలకు పైగా వ్యాసాలతో విస్తరించిందంటే దాని వెనక ఎంత అధ్యయనం, ఆసక్తి, అనురక్తి దాగివున్నాయో అర్ధం చేసుకోవచ్చు. నీతి, నిజాయితీ, కష్టపడే గుణం, తెలివి, సృజనాత్మక సామర్థ్యాలు మాత్రమే ఎక్కడైనా చెల్లుబాటవుతాయని బలంగా విశ్వసించే నాగసూరి వేణుగోపాల్ .. ఎక్కడ ఏ కేంద్రానికి బదిలీ అయినా అక్కడి వాతావరణం, పరిస్థితులు, స్వీయ అనుభవాన్ని బట్టి మరో బదిలీ అయ్యేంత వరకూ ఎంతో బాధ్యతగా పని చేసేవారు. విద్వాన్ విశ్వం, సర్దేశాయి తిరుమలరావు, తాపీ ధర్మారావు, గురజాడ, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, అడివి బాపిరాజు, యద్దనపూడి సులోచనారాణి, పొట్టి శ్రీరాములు, గాంధీజీ వంటివారి గురించిన విమర్శనాత్మక సంకలనాలు ఒక తరహా కాగా; వైజ్ఞానిక కథలు, పర్యావరణ కథలు, మదరాసు బదుకులు, సైన్స్ ఎందుకు రాస్తున్నాం?, తెలుగు భాష, ప్రసార భాషగా తెలుగు వంటి అంశాలకు సంబంధించి ఆయన రాసిన పుస్తకాలు ఆలోచింపజేస్తాయి. అందులో ఆయన ప్రస్తావించి రాసిన విషయాలు అంతే ఆశ్చర్యపరుస్తాయి.

పత్రికా రంగానికి సంబంధించి ఎడిటర్లు ఏమంటున్నారు?, నార్ల బాట, పాత్రికేయపాళి, నవతరానికి నార్ల, మీడియా నాడి, మీడియా స్కాన్, మీడియా వాచ్ ఇలా అనేక పుస్తకాలు రాశారు. పత్రికలు తాము ప్రజల పక్షం అని చెప్పడానికి ప్రయత్నించాలని డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ సుతిమెత్తని విమర్శతో గుర్తు చేస్తుంటారు. ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించి టీవీ ముచ్చట్లు, ఛానళ్ళు విస్తృతి – సీరియళ్ళ వికృతి, వార్తా మాధ్యమాల విశ్వసనీయత, ఛానళ్ళ సందడి – టెక్నాలజీ హడావుడి, సమాచారం బాట – సంచలనాల వేట, బుల్లితెర విశ్వరూపం, ప్రసార భాషగా తెలుగు, ఛానళ్ళ హోరు – భాష తీరు, చర్చనీయాంశాలుగా ఛానళ్ళు, ‘ప్రశ్నార్థకమవుతున్న విశ్వసనీయత’ వంటి అనేక పుస్తకాలలో టీవీ ఛానళ్ళ తీరుతెన్నులను, బాధ్యతారాహిత్యాన్ని నిర్ద్వంద్వంగా ఏకిపారేశారు. జర్నలిజంలో పరిశోధనలు చేయాలనుకునే వారు, అసలేమీ తెలియకుండా వచ్చి జర్నలిజం అంటే ఏంటో తెలుసుకోవాలనుకునే వారికి కూడా ఈ పుస్తకాలు తిరగేస్తే చాలు…జర్నలిజం జీవితానికి కావల్సినంత అనుభవం వస్తుందనడంలో సందేహం లేదు.

కేబుల్ టీవీల రాకతో సినిమా హాళ్ల ప్రాభవం తగ్గలేదు. కంప్యూటర్లు రాకతో నిరుద్యోగ సమస్య పెరగలేదు. పైగా ఉద్యోగావకాశాలు మరింత పెరిగాయ్ కూడా. టేప్ రికార్డర్లు, క్యాసెట్లు వచ్చినపుడు రేడియో అంతరించి పోలేదు. టెలివిజన్ వచ్చినప్పుడూ ఆకాశవాణి మరుగునపడలేదు. నాటి నుంచి నేటి వరకూ ఆకాశవాణి వినే శ్రోతల సంఖ్య తగ్గలేదు రేడియో వినడం ద్వారా బోలెడు సౌలభ్యాలున్నాయని సవివరంగా నాగసూరి వేణుగోపాల్ రాసిన వ్యాసం..’ఆకాశవాణి’ని అభిమానించే శ్రోతలందరికీ ఓ గుండె ధైర్యం.

నాగసూరి వేణుగోపాల్ శ్రీమతి పేరు హంసవర్ధిని. ఆమె ఆయన జీవితంలోనే కాదు సాహిత్య సృజనలో కూడా సగభాగం. ఎప్పుడు కలిసినా నవ్వుతూ పలకరించడం, మాట్లాడుతూనే వంట చేసి స్వయంగా వడ్డించడం, ఏ విషయాన్నైనా నిర్మొహమాటంగా మాట్లాడడం వారింటికి వెళ్లిన ప్రతి సాహితీవేత్తకీ ఓ మంచి జ్ఞాపకం. ఈరోజు ఒక పుస్తకాన్ని విడుదల చేశారన్న సమాచారం తెలుసుకునేలోపే ఎక్కడో ప్రకృతి, ప్రతిష్టాత్మక ఆలయాలు, ప్రాచీనా కట్టడాలు, చేనేతల కళా నైపుణ్యాలను ఆస్వాదిస్తోన్న ఫోటోలు ఫేస్బుక్లో పలకరిస్తుంటాయి. నాగసూరి వేణుగోపాల్ మరొకరిని నొప్పించని విధానంలో మాట్లాడడం, చాలా పొదుపుగా సంభాషించడం అందరికీ తెలిసిన విషయమే. మేం కలిసిన సందర్భాలలో హంసవర్ధినితో నాగసూరి సరదా సంభాషణలు, వాదోపవాదాలు మాత్రం చూడముచ్చటగా ఉంటాయి.

ఎన్నో విభిన్న ప్రక్రియల్లో రచనలు చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి డా. నాగసూరి వేణుగోపాల్. ప్రతిష్టాత్మకమైన “జ్ఞానమద్ది సాహితీ పీఠం” వారి సాహిత్య సేవా పురస్కారం ఈ నెల 29న అందుకోబోతున్న సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ… ఇలాగే మరెన్నో రచనల ద్వారా తెలుగు ప్రజలను మరింత చైతన్య పరచాలని ఆకాంక్షిస్తూ..

-మంచిపగడం దేవదాస్,
9966322423
ఆకాశవాణి క్యాజువల్ అనౌన్సర్ (హైదరాబాద్ కేంద్రం),
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పీఆర్వో

RELATED ARTICLES

Most Popular

న్యూస్