Tuesday, January 28, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఎనిమిది లక్షలు యూ ట్యూబ్ స్వాహా

ఎనిమిది లక్షలు యూ ట్యూబ్ స్వాహా

‘అయ్యయ్యో! చేతిలో డబ్బులు పోయెనే
అయ్యయ్యో! జేబులు ఖాళీ ఆయెనే’– ఇది  ఒకప్పుడు పేకాటలో డబ్బులు పోగొట్టుకునే వారిపై సినిమా పాట. అప్పట్లో పేకాట, తాగుడు మాత్రమే వ్యసనాలుగా ఉండేవి. మరి ఇప్పుడో!

ఏది వ్యసనమో, ఏది కాదో చెప్పలేని పరిస్థితి. ఆరేళ్ళ పిల్లాడి నుంచి అరవై ఏళ్ళ వారివరకు అందరికీ ఒకటే కోరిక. తొందరగా ఫేమస్ అయిపోవాలి. డబ్బులు వచ్చి పడిపోవాలి. చేతిలో ఫోన్ ఉంటే చాలు, ప్రతిదీ రికార్డు చెయ్యడమే. ఆపైన ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్ రీల్స్ లో వేసేసి ఎన్ని వ్యూస్ వచ్చాయా అని చూసుకుంటూ ఉంటారు. ఈ పిచ్చిలో పడి చదువు పాడుచేసుకుంటున్న యువత, సంసారాలు పాడుచేసుకుంటున్న మహిళలు ఉన్నారు. కోతికి కొబ్బరికాయ దొరికినట్లు వీరందరికీ యూ ట్యూబ్ దొరికింది. కాస్త వంటలొస్తే చాలు ఛానల్ పెట్టేసి, అందరినీ సబ్స్క్రయిబ్ చెయ్యమని చంపుతూ ఉంటారు. ఇండియాలోనే 40000 కు పైగా వంటల చానెల్స్ ఉన్నాయి. లక్షల మంది చూస్తారు. నిషా మధులిక యూ ట్యూబ్ ద్వారా అధిక ఆదాయం సంపాదిస్తున్న మహిళ. ఇంకా చాలామంది ఆదాయం పొందుతున్నారు.

అయితే ఈ మాయలో పడి డబ్బులు పోగొట్టుకుంటున్న వారూ ఉన్నారు. తాజాగా నళిని ఉనగర్ అనే మహిళ మూడేళ్ళ పాటు యూ ట్యూబ్ వంటల ఛానల్ నిర్వహించి, ఏ మాత్రం లాభదాయకం కాదని మూసేసింది. పైగా ఈ విషయం తన ఎక్స్ ఖాతాలో పేర్కొంటూ కొన్ని చానెల్స్ కి లబ్ధి చేకూరుస్తుందంటూ యూ ట్యూబ్ పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. మొదట్లో ఇంస్టాగ్రామ్ లో వంటల పేజీ ద్వారా 25000ఫాలోవర్లు ఉండేవారు ఈమెకు. శాకాహారవంటలు, సామాజిక సమస్యలపై అవగాహన తన ఆసక్తులని చెప్పుకొంది. ఆ ఉత్సాహంలో మూడేళ్ళక్రితం ‘నళినీస్ కిచెన్’ అనే యూ ట్యూబ్ ఛానల్ ప్రారంభించింది. మంచి వంటగది, సామాన్లు , షూటింగ్ పరికరాలకోసం సుమారు 8 లక్షల రూపాయలు ఖర్చు చేసింది. సుమారు 250 వీడియోలు చేసింది. అయితే ఛానల్ కి తగినంత ఆదరణ లభించలేదు. రెండువేలపైన సబ్ స్క్రైబర్స్ ఉన్నారంతే. ఈ మధ్యలో శాకాహారం గురించి ప్రముఖ నటి స్వరభాస్కర్ తోనూ వివాదం నడిచింది. స్వర ఆకృతి పైనా కామెంట్ చేసి వివాదం కొని తెచ్చుకుంది. అన్ని జరిగినా ఆదాయం వస్తే బాగుండేదేమో కానీ ఒక్క పైసా రాలేదు. దాంతో విరక్తి పుట్టి ఛానల్ మూసేస్తున్నాను. ఎవరైనా కొనుక్కోండి అని ఎక్స్ లో పెట్టింది. మొత్తం వీడియోలు డిలీట్ చేసింది. తన వైఫల్యానికి కారణమంటూ యూ ట్యూబ్ ని విమర్శించడంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొందరు ఆమె నిర్ణయాన్ని సమర్థిస్తుంటే మరికొందరు ఓదారుస్తున్నారు.

ఏదన్నా ఉద్యోగం చేసుకుంటూ హాబీ గా వీడియోస్ చేసుకోవచ్చుగానీ వాటిపైనే ఆదాయం రావాలంటే ఎలా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. తన ఓటమి ఇంత సంచలనం సృష్టించడం విజయం సాధించినట్టు ఉందని నళిని అభిప్రాయపడింది. అన్నట్టు ఈమె ఛానల్ ను మూడు లక్షలకు కొనడానికి ఆఫర్ కూడా వచ్చిందట. మెరిసేదంతా బంగారం కాదని, వేరే లెక్కలుంటాయని ఇప్పటికయినా యూ ట్యూబ్ పిచ్చోళ్లకు తెలుస్తుందా!

-కె.శోభ

RELATED ARTICLES

Most Popular

న్యూస్