(జూన్ 10 బాలకృష్ణ పుట్టినరోజు, ప్రత్యేక వ్యాసం)
తెలుగు తెరను ఎంతోమంది వారసులు పలకరించారు .. వారిలో టాలెంట్ ఉన్నవారు నిలబడ్డారు .. లేనివారు వెనుదిరిగారు. అలా నందమూరి కుటుంబం నుంచి నటవారసత్వాన్ని అందుకున్న హీరోగా బాలకృష్ణ కనిపిస్తారు. 1974లో ‘తాతమ్మ కల’ సినిమా ద్వారా బాలకృష్ణ పరిచయమయ్యారు. ఆ తరువాత తన తండ్రితో కలిసి ఆయన పర్యవేక్షణలో కొన్ని సినిమాలలో ముఖ్యమైన పాత్రలను చేస్తూ వెళ్లారు. ‘సాహసమే జీవితం’ సినిమాతో హీరోగా ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ‘మంగమ్మగారి మనవడు’ సినిమా ఆయన తొలి హిట్ గా చెప్పుకోవచ్చు.
Nandamuri Balakrishna Birthday Special Article :
80వ దశకంలో బాలకృష్ణ విజయవిహారం చేశారు. ‘ముద్దుల మావయ్య‘ .. ‘సీతారామకల్యాణం’ .. ‘అనసూయమ్మగారి అల్లుడు’ .. ‘ప్రెసిడెంట్ గారి అబ్బాయి’ ఇలా భారీ విజయాలను ఆయన బాక్సాఫీసు దిశగా పరుగులు తీయించారు. ఈ సమయంలోనే ఆయనను అభిమానించేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. గ్రామీణ నేపథ్యంలోని కథలు చేయాలంటే బాలకృష్ణనే చేయాలి అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆయన పంచెకట్టి .. చేత ముల్లుగర్ర పట్టుకుని .. పల్లెటూరి బుల్లోడిగా పొలం గట్లపై నడిచాడంటే ఆ సినిమా హిట్ అనేసి చెప్పుకున్నారు.
బాలకృష్ణ మొదటి నుంచి కూడా మాస్ ఆడియన్స్ కి చేరువవుతూ వెళ్లారు. వాళ్లు ఆశించే అంశాలు తన సినిమాల్లో తప్పకుండా ఉండేలా చూసుకున్నారు. అందులో భాగంగానే బాలకృష్ణ సినిమాల్లో పవర్ఫుల్ డైలాగులు .. మసాలా దట్టించిన మాటలు .. రొమాన్స్ తో కూడిన హుషారైన పాటలు ఎక్కువగానే కనిపిస్తాయి. ఆయన కాస్త బొద్దుగా ఉన్నా చాలా ఫాస్టుగా స్టెప్స్ వేసేవారు .. ఫైట్స్ లో కూడా అదరగొట్టేసేవారు. అలా గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుబాటుదారుడిగా విలన్ల గుండెల్లో అలజడి రేపిన బాలకృష్ణ, ఆ తరువాత సినిమాల్లో ఫ్యాక్షన్ లీడర్లకు కూడా నిద్రలేకుండా చేశారు.
తెలుగు తెరపై ఫ్యాక్షన్ కథలకు బాలకృష్ణ పెద్ద దిక్కుగా నిలిచారు. చాలామంది హీరోలు ఈ జోనర్లో సినిమాలు చేసినప్పటికీ, బాగా సెట్ అయింది మాత్రం బాలకృష్ణకే. ‘సమరసింహారెడ్డి’ .. ‘నరసింహనాయుడు’ వంటి సినిమాలు అందుకు నిలువెత్తు నిదర్శనాలు. ఫ్యాక్షన్ సినిమాలతో బాక్సాఫీస్ కోటపై బాలకృష్ణ తన జెండాను రెపరెపలాడించారు. ‘సింహా’ .. ‘లెజెండ్’ సినిమాలు సక్సెస్ పరంగాను, వసూళ్ల పరంగాను కొత్త రికార్డులను నమోదు చేశాయంటే, ఈ తరహా సినిమాల్లో బాలకృష్ణని ప్రేక్షకులు ఎంతగా ఆదరించారనేది అర్థం చేసుకోవచ్చు.
ఎన్టీఆర్ మాదిరిగానే బాలకృష్ణ కనుముక్కుతీరు చక్కగా ఉంటుంది. అందువలన సాంఘికాలతో పాటు జానపద .. పౌరాణిక చిత్రాలకు కూడా ఆయన రూపం సెట్ అయ్యేది. అందువల్లనే ఆయన ‘భైరవద్వీపం’ .. ‘శ్రీకృష్ణార్జున విజయం’ .. ‘శ్రీరామరాజ్యం’ వంటి సినిమాలు చేయగలిగారు. మరోసారి ప్రేక్షకులకు జానపదాలను .. పౌరాణికాలను రుచి చూపించారు. ‘ఆదిత్య 369’ వంటి సైన్స్ ఫిక్షన్ లోను .. ‘ఊకొడతారా ఉలిక్కిపడతారా’ వంటి హారర్ థ్రిల్లర్ జోనర్లలోను ఆయన ప్రయోగాలు చేశారు. ఇక టాలీవుడ్లో తన సమకాలిక హీరోల్లో ఎక్కువగా ద్విపాత్రాభినయం చేసింది ఆయనే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
Versatile Artist Nandamuri Balakrishna Birthday Special :
కెరియర్ మొదలు పెట్టిన దగ్గర నుంచి బాలకృష్ణ ఎక్కడా గ్యాప్ ఇచ్చిన సందర్భాలు కనిపించవు. తన తాజా చిత్రం ఘన విజయాన్ని సాధించినా .. పరాజయంపాలైనా ఆ తరువాత సినిమా వెంటనే పట్టాలు ఎక్కవలసిందే. సినిమాకి .. సినిమాకి మధ్య ఆయన ఎక్కువ సమయం తీసుకునేవారు కాదు. కథా చర్చల పేరుతో విషయాన్ని నాన్చడం ఆయనకి అలవాటులేని పని. ఒకసారి ఓకే అనేసిన తరువాత ఆయన దర్శకుడికి సంబంధించిన పనుల్లో జోక్యం చేసుకునేవారు కాదు. సెట్లో క్రమశిక్షణతో లేకపోతే సహించేవారు కాదు.
బాలకృష్ణకి భారీ హిట్లు ఇస్తూ ఆయన కెరియర్ ను ప్రభావితం చేసిన దర్శకులుగా రాఘవేంద్రరావు .. కోదండరామిరెడ్డి .. కోడి రామకృష్ణ .. బి.గోపాల్ కనిపిస్తారు. బాలకృష్ణ సినిమాల నుంచి ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారనే విషయాన్ని గ్రహించి, ఆ పల్స్ పట్టుకుని ఆయన స్టార్ డమ్ ను అంతకంతకూ పెంచుతూ వెళ్లారు. క్రమంగా బాలకృష్ణ సినిమా అంటే భారీతనానికి కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయింది. ఆయన పేరు మాస్ ఆడియన్స్ కి మంత్రంలా మారిపోయింది. సీనియర్ డైరెక్టర్లతో మాత్రమే సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపే బాలకృష్ణ, ఇటీవల కాలంలో మాత్రం యువ దర్శకులతో చేయడానికి ఉత్సాహాన్ని చూపుతుండటం విశేషం.
ప్రస్తుతం బాలకృష్ణ .. బోయపాటి దర్శకత్వంలో ‘అఖండ’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పరంగా ముగింపుదశకి చేరుకుంది. దసరాకి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఆ తరువాత గోపీచంద్ మలినేనితో సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక అనిల్ రావిపూడి కూడా లైన్లో ఉన్నాడని అంటున్నారు. ఇలా వరుస సినిమాలను పట్టాలెక్కిస్తున్న బాలకృష్ణ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరెన్నో విజయాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం.
-పెద్దింటి గోపీకృష్ణ