నంద్యాల ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు తప్పక దర్శించాల్సిన క్షేత్రం- నందవరం. కాశీ విశాలాక్షి నడచి వచ్చిన క్షేత్రంగా నందవరానికి శతాబ్దాల, సహస్రాబ్దాల చరిత్ర ఉంది.
నందవరపురాన్ని నందన చక్రవర్తి నందనుడు పాలించే కాలంలో అని ఇక్కడ ప్రస్తావించే కథలో రాజుకు సంబంధించి పురాణాల ప్రకారం ఒక కాలాన్ని సూచిస్తే…చారిత్రకంగా మరో కాలాన్ని సూచిస్తోంది. కాబట్టి ఆ ఆ తారీఖులు, దస్తావేజులు మనకనవసరం.
Youtube : https://www.youtube.com/@dhatritvtelugu
Facebook : https://www.facebook.com/dhatritelugutv
Instagram: https://www.instagram.com/dhatritelugutv/
Twitter :https://x.com/Dhatri_Tv
నందనుడు శ్రీదత్తాత్రేయుడి ఉపాసకుడు. దత్తాత్రేయుడి అనుగ్రహం కోసం తపస్సు చేస్తాడు. తపస్సు ఫలించి దత్తాత్రేయుడు ప్రత్యక్షమయ్యాడు. “స్వామీ! రోజూ గంగలో స్నానం చేసి…విశాలాక్షికి పూజ చెయ్యాలని కోరిక…” అని మనసులో మాట బయటపెట్టాడు. దత్తాత్రేయుడు తథాస్తు అని మంత్రపాదుకలను ఇచ్చాడు. ఆరోజునుండి తెల్లవారుజామున లేచి స్నానం చేసి…మంత్రపాదుకలను తొడుక్కోగానే…కాశీ గంగ తీరానికి చేరేవాడు. అక్కడ గంగలో మునిగి…విశాలాక్షికి పూజ చేసి…తెల్లవారకముందే నందవరపురానికి వచ్చేసేవాడు.
రోజూ ఉదయాన్నే నందనుడు ఎక్కడికో వెళుతున్నాడన్న అనుమానంతో భార్య నిలదీసింది. విషయమిదని చెప్పాడు. తనను కూడా అలాగే తీసుకెళ్ళమని పట్టుబట్టింది. సరే అన్నాడు. తీరా వెళ్ళిన మొదటిరోజే నందనుడి భార్య విధి నిషేధాలను పాటించకపోవడంవల్ల మంత్రపాదుకలు ప్రభావం కోల్పోయాయి. తిరిగి నందవరపురం వెళ్ళలేక బాధపడుతున్నవేళ అక్కడ తపస్సు చేసుకుంటున్నవారు కరుణించి మంత్రపాదుకలకు మళ్ళీ మహిమను కలిగించారు. ఆపదలో ఆదుకున్న మీకేమి ఇచ్చి రుణం తీర్చుకోగలను? అని నందనుడు వారిని అడిగాడు. సమయమొచ్చినప్పుడు మేమే అడుగుతామన్నారు వారు. చక్రవర్తి సరేనన్నాడు. కాలం గడిచింది.
కాశీలో ఎప్పుడూ లేనిది కరువు ఛాయలు అలముకున్నాయి. నందవరపురం చేరి…తపసులు నందనుడి సహాయం అర్థించారు. ఆడిన మాటను గుర్తు చేశారు. చక్రవర్తి గతం గుర్తు లేనట్లు నటించాడు. నేనన్నమాటకు సాక్ష్యమేమిటని? ఎదురు ప్రశ్నించాడు. తపసులు సాక్ష్యంగా కాశీ విశాలాక్షినే నందవరపురానికి తీసుకొచ్చారు. తప్పు ఒప్పుకుని నందనుడు విశాలాక్షి కాళ్ళమీద పడ్డాడు. ఇంతదూరం వచ్చావు…ఇక్కడే ఉండి…మమ్మల్ను రక్షించు తల్లీ! అని ప్రాధేయపడ్డాడు. విశాలాక్షి కరుణించి…చౌడేశ్వరిగా నందవరంలో ఉండిపోయింది.
కాశీ నుండి అమ్మవారు నందవరానికి నడచి వచ్చిన సొరంగ మార్గం ఇప్పటికీ ఆలయప్రాంగణంలో ఉంది. సొరంగ మార్గం మొదట్లో విశాలాక్షి కొలువై ఉంది. సాక్ష్యం చెప్పడానికి వచ్చినప్పుడు ఇక్కడ అమ్మవారి చీరకొంగు కవిలిచెట్టుకు తగిలి ఆగిన చోటు సంతానం లేనివారికి సంతానం ప్రసాదించే స్థలంగా ప్రసిద్ధికెక్కింది. ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే అమ్మవారు సంతానాన్ని ప్రసాదిస్తుందని అనాదిగా భక్తుల నమ్మకం.
చౌడేశ్వరికి పూజ చేసి…భూ గృహంలో విశాలాక్షికి మొక్కుకుని…సంతానంలేనివారికి సంతానాన్ని ప్రసాదించమని కవిలిచెట్టుకు ప్రదక్షిణలు చేసి…రాత్రికి నంద్యాల చేరుకున్నాము.
Youtube : https://www.youtube.com/@MahathiBhakthi
Facebook : https://www.facebook.com/mahathibhakthi
Instagram: https://www.instagram.com/mahathibhakthi/
Twitter : https://x.com/Dhatri_Tv
రేపు- నంద్యాల సీమ-3
“అహోబిల నారసింహుడు”
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు