Sunday, September 8, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఅదిగో లేపాక్షి-8

అదిగో లేపాక్షి-8

Basavaiah:
“లేపాక్షి బసవయ్య లేచిరావయ్య ;

కైలాస శిఖరిలా కదలిరావయ్య ;
హుంకరించిన దెసలు ఊగిపోయేను;
ఖురముతో దువ్వితే కులగిరులె వణికేను ;
ఆకాశగంగకై
అర్రెత్తిచూస్తేను ;
పొంగేటి పాల్కడలి గంగడోలాడేను ;
నందిపర్వతజాత
నవపినాకినీ జలము ;
నీ స్నాన సంస్పర్శ నిలువునా పులకించె ;
ఒంగోలు భూమిలో పెనుగొండ సీమలో ;
నీ వంశమీనాడు నిలిచింది గర్వాన”

ప్రఖ్యాత తెలుగు రచయిత, చిత్రకారుడు, భావుకుడు అడవి బాపిరాజు(1885-1952) బహుశా 1935 లేదా 1937 ప్రాంతాల్లో లేపాక్షిని సందర్శించినప్పుడు... లేపాక్షి బసవయ్యను చూసిన పరవశంలో…ఆ బసవణ్ణ ముందు ఆశువుగా అల్లి, పాడిన గేయ కవిత ఇది.

అంతటి నందీశ్వరుడు తన గురించి తనే నోరు తెరిచి చెప్పుకుంటే ఏం మర్యాద? మనకే తలవంపులు. ఆ లోటును తీర్చడానికి దాదాపు అయిదు వందల ఏళ్లు పట్టింది. ఎక్కడో పశ్చిమ గోదావరీ తీరం నుండి ఒకానొక భావుకుడు అడవి బాపిరాజు వచ్చి అక్షరమక్షరాన్ని పువ్వుగా గుచ్చి ఒక గేయకవితా హారాన్ని మెడలో వేసే వరకు…నంది మెడలో హారం వేయించుకోలేదు. అడవి బాపిరాజు ఈ అక్షర హారంతో నందిని అలంకరించిన తరువాత…ఇంకెవ్వరూ హారాన్ని అల్లడానికి సాహసించనూ లేదు. లేచి నిలుచోవడానికి సిద్ధమవుతున్నట్లున్న లేపాక్షి నంది అందచందాలను పదచిత్రాల్లో బంధించడానికి అడవి బాపిరాజులే దిగిరావాలి మరి.

15 అడుగుల ఎత్తు, 22 అడుగుల పొడవుతో లేపాక్షి నంది ప్రధాన ఆలయానికి కొద్ది దూరంలో ఉంటుంది. ఏడు ప్రాకారాల లేపాక్షిలో నాలుగు ప్రాకారాలు ఊళ్లో కలసిపోయాయి కాబట్టి…నంది గుడి నుండి వేరయినట్లు అనిపిస్తుంది కానీ…నిజానికి ఆలయంలో పెద్ద ఏడు పడగల నాగలింగనికి అభిముఖంగా…ఆగమశాస్త్ర విధి విధానాల ప్రకారమే నందిని చెక్కారు.

నందికి శిల్పులు రాతిలో దిద్ది తీర్చిన పట్టు వస్త్రాలు, ముత్యాల హారాలు, నల్ల తాళ్లు, కాసుల పేర్లు, గంటల హారాల అందమే అందం. నంది చెవికి వేలాడదీసిన చెవి పోగులు గాలికి వేలాడుతున్నట్టు చెక్కారంటే ఎంత సునిశితంగా నందికి ప్రాణం పోశారో! అనిపిస్తుంది. నంది కాలి గిట్టల పైన వెండి కడియం, గజ్జెల దాకా ఆణువణువూ చూసి తరించాల్సిన సోయగమే. మెడలో లాకెట్టుగా పెద్ద గంట ఉంది. పెద్ద పెద్ద ఏనుగులను కూడా తన్నుకు పోగల గద్ద జాతి గండభేరుండ పక్షిని మరో హారానికి కొలికి పూస- లాకెట్టుగా అమర్చారు అంటే…ఈ మహా నంది స్థాయిని శిల్పి చెప్పకనే చెబుతున్నాడు.

ఉలితో విజయనగర శిల్పులు రాతికి ప్రాణం పోసి...దీర్ఘాయుస్సు ప్రసాదించారన్న పుట్టపర్తి నారాయణాచార్యుల వారి మాటకు ఈ నంది నిలువెత్తు నిదర్శనం.

అడవి బాపిరాజు అన్నట్లు-
లేపాక్షి బసవయ్య హుంకరించి చూస్తే…దిక్కులు ఊగిపోవాలి.
ఒక్కసారి తల అటు ఇటు కదిలిస్తే కులగిరులు కదిలిపోవాలి.
ఈ నంది మామూలు నీళ్లు ఎందుకు తాగుతుంది?
ఆకాశగంగ కోసం తల ఎత్తి చూస్తే…దాని గంగడోలు పాలసముద్రం అలలా ఎగసిపడాలి.
పక్కన నంది హిల్స్ లో పుట్టిన పెన్నా నది లేపాక్షి బసవడి స్నానంతో పునీతమయ్యింది. ఒంగోలు భూమిలో, పెనుగొండ సీమలో ఒంగోలు గిత్తల రూపంలో ఉన్నది అక్షరాలా లేపాక్షి నందే.

మేము చిన్నప్పుడు పదేళ్లదాకా లేపాక్షి నంది మూపురం మీద ఎక్కి ఆడుకున్నాము. నందిమీద స్వారి చేస్తున్నట్లు, నంది కాలి గిట్టల మీద, తోక మీద తీసుకున్న బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు మా బసవ పురాణంలో మధురమయిన జ్ఞాపకాలు. పురావస్తు శాఖవారి చేతిలోకి వెళ్ళాక నంది మీద ఎక్కడాన్ని నిషేధించారు.

శివానుగ్రహం కావాలంటే శివ పూజల దాకా ఎందుకు?
ఒకసారి లేపాక్షి నంది ముందు మొక్కుకుని రండి. నంది చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి…రండి. నందితో ఒక ఫోటోనో, సెల్ఫీనో దిగి…అపురూపంగా దాచుకోండి. మన ప్రార్థనను శివుడికి నందే సందు చూసి చెప్పి…మన పని చేసిపెడతాడు.

రేపు:-అదిగో లేపాక్షి-9
“లేపాక్షి చిత్ర కళ”

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్