Saturday, November 23, 2024
Homeసినిమానాని... మన పక్కింటబ్బాయ్

నాని… మన పక్కింటబ్బాయ్

Natural Star:  నాని .. చూడటానికి చాలా సింపుల్ గా కనిపిస్తాడు. మన పక్కింటి కుర్రాడిలా .. మన కాలనీ అబ్బాయ్ గా అనిపిస్తాడు. ఆయన సినిమాలను థియేటర్లలో కాకుండా అరుగులపై కూర్చుని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆయన నటనను తెరపై కాకుండా మన కళ్లెదురుగా చూస్తున్నట్టుగా ఉంటుంది. అంతగా తన సహజమైన నటనతో ఆయన ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. అందువల్లనే అంతా కలిసి ఆయనను నేచురల్ స్టార్ అని పిలుచుకుంటూ ఉంటారు.

నాని తన కథలు ఆకాశంలో నుంచి ఊడిపడేలా ఉండాలని కోరుకోడు. తెరపై అద్భుతాలు చేయాలని ఆశపడడు. సగటు ప్రేక్షకుడు తనలో అతనిని చూసుకునే పాత్రలనే ఆయన ఎక్కువగా ఎంచుకుంటాడు. ఆయన కథల్లో కథానాయకుడు జీవితాల్లో నుంచి పుడతాడు. ఒక సాధారణ యువకుడికి కలిగే ఆశలు .. ఎదురయ్యే అనుభవాలు .. పడే ఆవేశాలే ఆయన కథల్లో ఉంటాయి. అందువల్లనే ఆయన సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ కి వెంటనే కనెక్ట్ అవుతుంటాయి.

Nani

‘అష్టా చమ్మా’ సినిమాతో నాని కెరియర్ మొదలైంది. కుర్రాడు సాదా సీదాగా ఉన్నప్పటికీ చాలా బాగా చేశాడని అనుకున్నారు తప్ప, ఎవరూ కూడా ఆయన ఈ స్థాయిలో స్టార్ హీరోగా ఎదుగుతాడని అనుకోలేదు. ఇంతకాలం నిలబడతాడని ఊహించలేదు. నాని తన కెరియర్ ను మొదలుపెట్టేసి అప్పుడే పుష్కర కాలం దాటిపోయింది. ఈ 12 ఏళ్లలో ఆయన ఎన్నో విభిన్నమైన కథలను ఎంచుకున్నాడు. విలక్షణమైన పాత్రలతో మెప్పించాడు .. విజయాలను అందుకున్నాడు.

నాని కథలను ఎంచుకునే తీరు పట్ల మిగతా స్టార్ హీరోలు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. అంతగా ఆయన కథల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాడు. తాను ఏ సినిమా చేసినా యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్స్ కి వచ్చేలా చూసుకుంటాడు. అలాగే యాక్షన్ విషయానికి వచ్చేసరికి మాస్ టచ్ ఇస్తూ వాళ్లని కూడా మెప్పిస్తూ ఉంటాడు. ఒకానొక సమయంలో వరుసగా రెండు హ్యాట్రిక్ హిట్లు అందుకున్న ఘనతను ఆయన సొంతం చేసుకున్నాడు. ఇది నిజంగా విశేషంగానే చెప్పుకోవాలి.

‘భలే భలే మగాడివోయ్’ .. ‘నేను లోకల్’ .. ‘జెర్సీ’ వంటి సినిమాలు చూస్తే, నటనలో నాని ప్రత్యేక్షత ఏమిటనేది అర్థమవుతుంది. ఇక ఆయన కెరియర్లో ద్విపాత్రాభినయాలు కనిపిస్తాయి .. ‘దేవదాస్’ వంటి మల్టీ స్టారర్ లు కనిపిస్తాయి .. నెగెటివ్ రోల్స్ తో మెప్పించిన వైనాలు కనిపిస్తాయి. ఒక వైపున హీరోగా చాలా బ్యాలెన్స్డ్ గా ముందుకు వెళుతూనే, మరో వైపున నిర్మాతగా కూడా ఆయన సక్సెస్ లను అందుకుంటూ ఉండటం విశేషం. తన సినిమాలతో కొత్త దర్శకులకు .. తాను నిర్మించే సినిమాలతో కొత్త హీరోలకు అవకాశాలు ఇవ్వడం కూడా నాని ప్రత్యేకతగా అనిపిస్తుంది.

బలమైన సినిమా నేపథ్యం నుంచి వస్తున్న వారసుల తాకిడి ఎక్కువవుతున్నప్పటికీ, మిగతా యంగ్ హీరోల జోరు గట్టి పోటీ ఇస్తున్నప్పటికీ నాని తట్టుకుని నిలబడుతున్నాడు. తనపై .. తాను ఎంచుకున్న కథలపై గల నమ్మకంతో ముందుకు వెళుతున్నాడు. ‘శ్యామ్ సింగ రాయ్‘ వంటి ప్రయోగాలతో విజయాలను విస్తరిస్తున్నాడు. అభిమానుల నుంచి పెద్దగా గ్యాప్ రాకుండా చాలా పద్ధతిగా తన సినిమాలను థియేటర్లకు దిగుమతి చేస్తున్నాడు.

నాని నుంచి ‘అంటే .. సుందరానికీ‘ .. ‘దసరా’ అనే రెండు సినిమాలు ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా వైవిధ్యభరితమైనవే కావడం విశేషం. ఇప్పటికే ఈ సినిమాల నుంచి వచ్చిన అప్ డేట్స్ వాటిపై అందరిలో ఆసక్తిని పెంచుతున్నాయి. వాళ్లంతా కూడా ఇప్పుడు ఈ సినిమాల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కొత్తదనానికి కేరాఫ్ అడ్రెస్ గా కనిపించే నాని పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు అందజేస్తూ, మరిన్ని విజయాలను అందుకోవాలని మనసారా కోరుకుందాం.

( నాని బర్త్ డే స్పెషల్)

— పెద్దింటి గోపీకృష్ణ

RELATED ARTICLES

Most Popular

న్యూస్