Nara Lokesh Ultimatum To Government On Aided Education Institutions Go :
వారంరోజుల్లోగా ఎయిడెడ్ జీవోను రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ ప్రభుత్వానికి ఆల్టిమేటం జారీచేశారు. లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని…. ముఖ్యమంత్రి, మంత్రులను అసెంబ్లీకి వెళ్ళనీయబోమని హెచ్చరించారు. సిఎం ఇంటి తలుపు తడతా అని శపథం చేశారు.
లోకేష్ నేడు అనంతపురం జిల్లాలో పర్యటించారు. పోలీసుల దాడిలో గాయపడిన అనంతపురం ఎస్‍ఎస్‍బీఎన్ ఎయిడెడ్ కళాశాల విద్యార్థులను పరామర్శించి వారితో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లోకేష్ తో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, జిల్లాకు చెందిన టిడిపి నాయకులు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లోకేష్ మట్లాడుతూ విద్యార్ధులపై పోలీసుల దాడులు దారుణమన్నారు. విద్యార్ధులపై దాడి చేసి ఇప్పుడు మాట మారుస్తున్నారని, వారిని ఈడ్చుకుంటూ తీసుకెళ్లారని, అసలు కాలేజీ ఆవరణలోకి పోలీసులు ఎందుకు వెళ్ళారో చెప్పాలని అయన డిమాండ్ చేశారు. ఎయిడెడ్ విద్యాసంస్థల భూములపై సిఎం జగన్ కన్నేశారని, అందుకే ఈ జీవో తీసుకువచ్చారని ఆరోపించారు. విద్యార్ధులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఎయిడెడ్ విద్యాసంస్థల నిర్వాహకులతో… ఎవరితో చర్చలు జరపకుండా ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు.
విద్యార్ధులపై జరిగినవి కూడా స్టేట్ స్పాన్సర్డ్ దాడులే అని, విద్యార్ధులపై పడిన ఒక్కో లాఠీ దెబ్బకి జగన్ ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదని స్పష్టం చేశారు. ఎస్ఎస్‌బీఎన్ కళాశాలే కాదు..రాష్ట్రంలో ఏ ఒక్క ఎయిడెడ్ విద్యాసంస్థను ప్రైవేటు కానివ్వం అని లోకేష్ తేల్చి చెప్పారు. ఈ ఉద్యమం అన్ స్టాపబుల్ అని తెలుగుదేశం పార్టీ ముందుండి దీన్ని నడిపిస్తుందని భరోసా ప్రకటించారు. లాఠీలతో వస్తారో…లారీలతో వస్తారో ఎలా వచ్చినా కాలేజీలను కాపాడుకుందాం.. స్కూళ్లను రక్షించుకుందాం.. అని విద్యార్థులకు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
Also read : ఎయిడెడ్ పై రాజకీయం బాధాకరం: సిఎం
Also Read : ఒక్క విద్యార్ధికి నష్టం జరిగినా ఊరుకోం: లోకేష్