I will show: తన తల్లిని, తమ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘించి తమను ఇబ్బంది పెట్టిన అధికారులకు, తన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలకు సినిమా మొదలవుతుందంటూ వ్యాఖ్యానించారు. మిమ్మల్ని ఎవరూ కాపాడలేరని… ‘అమెరికా వెళ్ళినా, ఐవరీ కోస్ట్ కు వెళ్ళినా నేను మటుకు మిమ్మల్ని వెంటాడుతానని ఈ సభాముఖంగా వారికి తెలియ జేస్తున్నా’ అంటూ లోకేష్ ప్రతిజ్ఞ చేశారు. ఎవరి రికమండేషన్ తో వచ్చినా వదిలి పెట్టబోనని హెచ్చరించారు. వైసీపీ నేతలు అసెంబ్లీ సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు తన తల్లి ఎంతో మనోవేదనకు గురయ్యారని లోకేష్ అవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ దేవుడు, చంద్రబాబు రాముడు, ఈ లోకేష్ మూర్ఖుడు అని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా మంగళగిరిలో జరిగిన సభలో లోకేష్ ప్రసంగించారు.
తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏ పార్టీ కార్యకర్త అయినా తన వద్దకు రాగానే ‘మీపై ఎన్ని కేసులు ఉన్నాయి’ అని అడుగుతానని, కనీసం 12 పైగా కేసులు ఉంటేనే వారితో మాట్లాడతానని లోకేష్ అన్నారు. 12 కేసుల కంటే తక్కువ ఉంటే వారు పోరాటాలు చేయనట్లేనన్నారు. ఎన్ని ఇబ్బందులెదురైనా కేసులకు భయపడకుండా ప్రజల్లోకి వెళ్లి పోరాటాలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రభుత్వానికి మూడేళ్లపాటు సమయం ఇచ్చామని, ఇకపై రెండేళ్లపాటు అలుపెరగని పోరాటం చేస్తామని ప్రకటించారు. పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలు తీర్చాలని, అండగా నిలబడాలని అంటూ ‘సమయం లేదు మిత్రమా’ అంటూ కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు.
1985లో మాత్రమే మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించిందని, ఆ తర్వాత ఎప్పుడూ గెలవలేదని, 2024లో ఇక్కడ టిడిపిని గెలిపించి బాబుకు కానుక ఇవ్వాలని పిలుపు ఇచ్చారు. సంక్షేమం అంటే ఏమిటో, అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానని భరోసా ఇచ్చారు.
Also Read :ఎక్కడున్నా వదిలిపెట్టను: లోకేష్ హెచ్చరిక