Sunday, September 8, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంలోక కల్యాణ కారకం .. నృసింహ అవతారం

లోక కల్యాణ కారకం .. నృసింహ అవతారం

(నృసింహస్వామి జయంతి ప్రత్యేకం)

లోక కల్యాణం కోసం శ్రీమహావిష్ణువు ధరించిన దశావతారాలలో నాల్గొవ అవతారం .. నరసింహస్వామి అవతారం. లోక కంటకుడైన హిరణ్యకశిపుడిని శిక్షించడం కోసం … తన భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించడం కోసం శ్రీమహావిష్ణువు .. నరసింహస్వామిగా ఆవిర్భవించాడు. ముందుగా ఎలాంటి వ్యూహ రచన లేకుండా సంకల్ప మాత్రం చేత అప్పటికప్పుడు శ్రీమన్నారాయణుడు .. నరసింహస్వామిగా ఆవిర్భవించడం ఈ అవతారం యొక్క ప్రత్యేకత. భగవంతుడు ఉన్నాడనీ .. ఆపదలో ఉన్న తన భక్తులను ఆదుకుంటాడని సమస్త మానవాళికి స్వామి స్పష్టం చేయడమే ఈ అవతారం యొక్క విశిష్టత.

బ్రహ్మ మానస పుత్రులైన సనక సనందాదులు ఒకసారి శ్రీమహావిష్ణువు దర్శనం కోసం వైకుంఠానికి వెళతారు. అయితే వారికి స్వామివారి దర్శన భాగ్యం కలగకుండా ద్వారపాలకులైన జయవిజయులు అడ్డుకుంటారు. సనకసనందాదుల పట్ల అవమానకరంగా ప్రవర్తిస్తారు. దాంతో భూలోకాన రాక్షసులుగా జన్మించమని వాళ్లు శపిస్తారు. తమ తప్పు తెలుసుకున్న జయవిజయులు క్షమించమని వేడుకుంటారు. శాపవిమోచనం చెప్పమని కోరతారు. శ్రీహరి భక్తులై ఏడు జన్మల తరువాత ఆయన సన్నిధికి చేరుకుంటారా?  ఆ స్వామికి విరోధులై మూడు జన్మల తరువాత వైకుంఠానికి చేరుకుంటారా? అని వారిని సనక సనందాదులు అడుగుతారు.

శ్రీహరి పాదాలను విడిచి తాము ఎక్కువ కాలం ఉండలేమనీ, ఆయనతో విరోధాన్నైనా భరించి మూడు జన్మలలోనే ఆ స్వామి సన్నిధికి చేరుకోవాలని ఉందనే మనసులోని మాటను వాళ్లు బయటపెడతారు. అందుకు సనక సనందాదులు తథాస్తు అంటారు. అలా జయవిజయులు హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా, రావణ కుంభకర్ణులుగా, శిశుపాల దంతవక్త్రులుగా జన్మిస్తారు. ‘దితి’ గర్భాన అసురులుగా జన్మించిన హిరణ్యాక్షుడు .. హిరణ్య కశిపులు, తమ అసుర లక్షణాలతో సాధుసజ్జనుల నుంచి ఇంద్రాది దేవతల వరకూ అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తుంటారు.

హిరణ్యాక్షుడు భూమండలాన్ని తన అధీనంలో పెట్టుకోవాలనే స్వార్థచింతనతో ప్రయత్నిస్తాడు. అతనిని సంహరించడం కోసమే శ్రీమన్నారాయణుడు ‘వరాహ అవతారం’ ధరిస్తాడు. తన సోదరుడిని హతమార్చిన శ్రీమన్నారాయణుడిపై హిరణ్య కశిపుడు పగతో రగిలిపోతుంటాడు. బ్రహ్మదేవుడి కటాక్షం కోసం కఠోర తపస్సు చేసి ఆయన సాక్షాత్కారం పొందుతాడు. నేలపైగానీ .. నింగిలోగాని .. అగ్నివలనగాని .. నీటివలన గాని తనకి మరణం సంభవించకూడదు. మానవులు .. వానరులు … అసురులు .. దేవతలు .. జంతువులు .. ఆయుధముల వలన తనకి మృత్యువు కలుగకూడదు. లోపలగానీ .. వెలుపలగాని .. పగలుగానీ .. రాత్రి వేళలోగాని మరణం తన దరిచేరకుండా వరాన్ని పొందుతాడు.

వరబల గర్వితుడైన హిరణ్యకశిపుడు … ఇంద్రాది దేవతలకు సైతం నిద్ర లేకుండా చేస్తుంటాడు. తన రాజ్యంలో ఎవరూ కూడా యజ్ఞయాగాలు చేయకూడదనీ .. శ్రీహరిని పూజించకూడదని శాసనం చేస్తాడు. తన నామాన్ని మాత్రమే స్మరించాలని ఆదేశిస్తాడు. తన సోదరుడిని హతమార్చిన శ్రీహరిని అంతమొందించే సమయం కోసం ఎదురుచూస్తుంటాడు. అలాంటి పరిస్థితుల్లోనే హిరణ్యకశిపుడి భార్య ‘ప్రహ్లాదుడు’కి జన్మనిస్తుంది. బాల్యంలోనే ప్రహ్లాదుడు హరి నామస్మరణం చేయడం హిరణ్యకశిపుడికి అసహనాన్ని కలిగిస్తుంది .. అవమానంగా అనిపిస్తుంది. దాంతో ప్రహ్లాదుడిలో మార్పు వచ్చేంతవరకూ దండించమని సైన్యాధిపతిని ఆదేశిస్తాడు.

హిరణ్యకశిపుడి ఆదేశం ప్రకారం భటులు ప్రహ్లాదుడిని చీకటిగదిలో బంధిస్తారు. అవయవాలను ఖండించడానికి ప్రయత్నిస్తారు. భయంకరమైన విష సర్పాలతో కరిపిస్తారు .. మదపుటేనులతో తొక్కించే శిక్షను అమలు జరుపుతారు. అగ్నిగుండంలో .. అగాధంలో .. సముద్రంలో పడదోస్తారు. హరి నామస్మరణ చేస్తూ అన్నిరకాల శిక్షలను ప్రహ్లాదుడు ఆనందంగా భరిస్తాడు. ప్రహ్లాదుడిని ఏ శిక్షా ఏమీ చేయలేకపోవడం హిరణ్యకశిపుడికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఏ శక్తి అతణ్ణి  రక్షిస్తుందని కుమారుడిని అడుగుతాడు. అంతటా నిండివున్న ఆ శ్రీమన్నానారాయణుడే తనని కాపాడుతున్నాడని  ప్రహ్లాదుడు సమాధానమిస్తాడు.

మాటకు మరింత ఆగ్రహావేశాలకు లోనైన హిరణ్యకశిపుడు, తన సభాభవనంలోని ఒక స్తంభాన్ని చూపిస్తూ, “ఇందులో ఉంటాడా .. శ్రీహరి” అని అడుగుతాడు. “అలా ఉంటే ఆయనను సంహరిస్తాను .. లేదంటే నిన్ను హతమారుస్తాను” .. అంటూ తన ‘గద’తో ఆ స్తంభంపై బలంగా మొదుతాడు. అంతే .. భయంకరమైన గర్జనలు చేస్తూ ఆ స్తంభంలో నుంచి నరసింహస్వామి బయటికి వస్తాడు. హిరణ్యకశిపుడికి బ్రహ్మదేవుడు ఇచ్చిన వరానికి భంగం కలగనీయకుండా, నరుడు .. మృగము కలిసిన రూపంలో స్వామి అవతారిస్తాడు.

పగలు .. రాత్రి కాని సమయంలో, లోపల .. బయట కాకుండా ద్వారం మధ్యలో గడపపై కూర్చుని, నేలపై .. నింగిలో కాకుండా తన తొడలపై పడేసి .. ఎలాంటి ఆయుధాలు ఉపయోగించకుండా పొడవైన తన చేతి గోళ్లతో హిరణ్యకశిపుడి వక్షస్థలాన్ని చీల్చేస్తాడు. ఆ తరువాత కూడా ఉగ్రత్వంతో ఊగిపోతున్న స్వామివారిని ప్రహ్లాదుడు అనేక విధాలుగా స్తుతిస్తూ శాంతిపజేస్తాడు. లక్ష్మీదేవితో పాటు ఇంద్రాది దేవతల సేవలతో చల్లబడిన స్వామి, మహర్షుల కోరిక మేరకు అనేక పుణ్య ప్రదేశాల్లో ఆవిర్భవిస్తాడు. అలాంటివాటిలో .. సింహాచలం .. అంతర్వేది … అహోబిలం .. మంగళగిరి .. కోరుకొండ .. కదిరి .. పెంచలకోన .. వేదాద్రి … యాదాద్రి .. నవనారసింహ క్షేత్రాలుగా కనిపిస్తాయి.

నరసింహస్వామి ఆవిర్భవించిన ప్రదేశాలు దివ్యక్షేత్రాలుగా .. మహిమాన్విత తీర్థాలుగా వెలుగొందుతున్నాయి. ఆ క్షేత్రాల్లో స్వామి జయంతి రోజైన ‘వైశాఖ శుద్ధ చతుర్దశి’నాడు ప్రత్యేక పూజలు .. సేవలు జరుగుతూ ఉంటాయి. ఆ స్వామి క్షేత్రాల్లో అడుగుపెట్టినంతనే దుష్టగ్రహ బాధలు .. దుష్టశక్తుల పీడలు దూరమవుతాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ఈ రోజున స్వామివారిని పూజించి .. సేవించినవారి సమస్త పాపాలు .. దోషాలు తొలగిపోయి, సకల శుభాలు కలుగుతాయనేది మహర్షుల మాట.

— పెద్దింటి గోపీకృష్ణ

RELATED ARTICLES

Most Popular

న్యూస్