దక్షిణాఫ్రికాలో ఒక యూనివర్సిటీ ప్రవేశ ద్వారం వద్ద ఇలా రాసిన పెద్ద బోర్డు ఉంటుంది:-
ఒక దేశాన్ని నాశనం చెయ్యాలంటే మిస్సైల్స్ కానీ ఆటమ్ బాంబులు కాని అవసరం లేదు. నాసిరకం విద్య, విద్యార్థుల్ని పరీక్షల్లో కాపీ కొట్టనివ్వడం లాంటి విధానాన్ని ప్రోత్సహిస్తే భవిష్యత్తులో ఆ దేశం దానంతట అదే నాశనం అవుతుంది.
- అలా చదివిన డాక్టర్స్ చేతిలో రోగులు చనిపోతారు.
- అలా చదివిన ఇంజనీర్ల చేతిలో కట్టడాలు కూలిపోతాయి.
- అలా చదివిన ఆర్థికవేత్తల చేతిలో ఆర్థిక వ్యవస్థ పతనమవుతుంది.
- అలా చదివిన సంఘ సంస్కర్తల చేతిలో మానవత్వం మంటగలుస్తుంది.
- అలా చదివిన న్యాయమూర్తుల చేతిలో న్యాయం అన్యాయంగా మారిపోతుంది.
ఏ దేశంలో విద్య నాశనం అవుతుందో… ఆదేశం పతనావస్థకు చేరుకుంటుంది. విద్య విజ్ఞానం కోసమే కానీ…వ్యాపారం కోసం కాదు”
ఆమధ్య త్రిబుల్ ఆర్ సినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చింది. తెలుగు పాటకు తొలిసారి ఆస్కార్ అవార్డు రావడం వరకు సంతోషించదగ్గ విషయమే కానీ…తెలుగులో ఇప్పటిదాకా వచ్చిన వేనవేల పాటలు ఆస్కార్ అవార్డు స్థాయిలో లేవని చెప్పడానికి మాత్రం వీల్లేదు. దేనికైనా సమయం, సందర్భం కలిసి రావాలి.
నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చినట్లే నీటు నీటు పాట్లకు కూడా ఆస్కార్ అవార్డు రావాల్సిన సందర్భమిది. వైద్య విద్య ప్రవేశానికి అర్హత పరీక్ష నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్- నీట్ దేశవ్యాప్తంగా కేంద్రప్రభుత్వం నిర్వహించే పరీక్ష. ఇదివరకు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రవేశ పరీక్ష నిర్వహించుకునేవి. రాష్ట్ర ప్రభుత్వాలనుండి ఆ పనిని కేంద్రం లాగేసుకోవడం మీద తమిళనాడు లాంటి రాష్ట్రాలు ఇప్పటికీ పోరాడుతున్నాయి. ఆ చర్చ ఇక్కడ అనవసరం.
ఈసారి దాదాపు 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు నీటుగా ఉండాల్సింది నాటుగా తయారయ్యింది. నీట్ పేపర్ నీట్ గా కొన్ని రాష్ట్రాల్లో లీక్ అయ్యిందన్నారు. ఎంపిక చేసిన రాష్ట్రాల్లోనే లీక్ అయ్యిందన్నారు. ఎన్నికల ఫలితాల తరువాత కేంద్రంలో ఏర్పడ్డ సంకీర్ణ ప్రభుత్వం అసలు లీక్ కానే లేదని మొదట అని…తరువాత రెండు కేంద్రాల్లోనే లీక్ అయినట్లుందని...అశ్వత్థామ హతః కుంజరః అన్నట్లు రెండును లోగొంతుకతో ఎవరికీ వినపడకుండా చెప్పింది. పరీక్ష రాసిన అభ్యర్థులు సుప్రీం కోర్ట్ తలుపు తట్టారు. చూడబోతే నీట్ లో ఏవేవో ఘాటు విషయాలు దాగున్నాయి…తప్పు జరిగి ఉంటే…ఒప్పుకోండి…అని సుప్రీం కోర్టు కేంద్రానికి చెప్పింది. పేపర్ లీక్ ద్వారానో, కాపీ కొట్టో దొంగదారిలో డాక్టర్ అయిన వారిచేతిలో మన ప్రాణాలను పెట్టగలమా అని సుప్రీం కోర్ట్ గుండెలు బాదుకుంది.
ఈనేపథ్యంలో నాటు నాటు పాటకు-
“మెడలో స్టెతస్కోపు వేసి సర్జరీకి దూకినట్లు
ఆపరేషన్ థియేటర్లో పూనకాలు వచ్చినట్లు
వైటు కోటు వేసుకుని సిరంజులు గుచ్చినట్లు
ఎంసెట్టులు వదిలి నీటుచెట్టు చేరినట్లు
బ్లడ్డు టెస్టు లేకుండా రగతం లాగినట్లు
నా నీటు సూడు నా నీటు సూడు
నా నీటు సూడు
నీటు నీటు నీటు నీటు నీటు నీటు
వీర నీటు
నీటు నీటు నీటు నీటు నీటు నీటు
క్రూర నీటు
నీటు నీటు నీటు
పిచ్చ పరీక్షలాగ పచ్చి నీటు
నీటు నీటు నీటు
మొండి కత్తిలాగ వెర్రి నీటు
గుండెలు బాదుకునేలా దండగమారి ఖర్చయినట్లు
సెవులు సిల్లు పడేలా లీకు వార్తలొచ్చినట్లు
యేలకేలు పోసేలా యవ్వారం సాగినట్లు
కాలు నిలువనీయక దుమారం రేగినట్లు
ఒల్లు సెమటపట్టి స్పృహదప్పి పడినట్లు
నా నీటు సూడు నా నీటు సూడు
నా నీటు సూడు
నీటు నీటు నీటు నీటు నీటు నీటు
వీర నీటు
నీటు నీటు నీటు నీటు నీటు నీటు
క్రూర నీటు
నీటు నీటు నీటు ఉక్కపోతలాగ తిక్క నీటు
భూమి దద్దరిల్లేలా ఒంటిలోని నాడులన్ని ఎగిరి గంతులేసేట్లు
పాడుకోరా ఎకాయెకి నీటు నీటు నీటో…
కర్మ ఖర్మ కాలేలా గ్రహచారం గతితప్పేలా
లోపలున్న అనుమానాలన్నీ పైకి పైకి ఉబికేలా…పాడేయ్ రా సరాసరి నీటు నీటు నీటో “
అని అభ్యర్థులు ఆర్తిగా…గుండె మంటలారేలా…విషాదం బరువు మరిచిపోయేలా పేరడీ పాటలు పాడుకోవడం తప్ప చేయగలిగింది లేదు!
(ఆస్కార్ అకాడెమీ విజేతలు కీరవాణి, చంద్రబోస్ లకు క్షమాపణలతో)
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు