అమరావతి లోక్‌సభ ఎంపీ, సినీ నటి నవనీత్ కౌర్ రాణాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమె కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది.
ఈ నెల 8న బాంబే హైకోర్టు నవనీత్ కౌర్ కుల ధ్రువీకరణ పత్రం రద్దు చేయడంతో పాటు నకిలీ పత్రాలు సమర్పించినందుకు గాను ఆమెకు రూ.2లక్షల జరిమానా విధించిన విషయం తెలిసిందే. అయితే, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ నవనీత్ కౌర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఆమె దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిపిన జస్టిస్ వినీత్ శరన్, జస్టిస్ దినేశ్ మహేశ్వరి నేతృత్వంలోని వెకేషన్ బెంచ్.. మహారాష్ట్రతో పాటు ఆమెపై న్యాయస్థానంలో పిటిషన్ వేసిన ఆనంద్‌రావ్ అద్సులేకు నోటీసులు జారీచేసింది.
గత ఎన్నికల్లో అమ్రావతి లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన నవనీత్ కౌర్‌పై పోటీకి దిగిన శివసేన నేత ఆనంద్‌రావ్ అద్సులే ఓటమిపాలయ్యారు. అయితే, ఆమె తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించారని, ఎన్నిక చెల్లదంటూ అద్సులే దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 8న బాంబే హైకోర్టు విచారించింది. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఉద్దేశంతోనే నవనీత్ కౌర్ నకిలీ పత్రాలు సమర్పించి ఈ మోసానికి పాల్పడ్డారని, వాటిలో పేర్కొన్నట్లు ఆమెది మోచి సామాజిక వర్గం కాదని హైకోర్టు పేర్కొంది. ఆ పత్రాలను ఆరు వారాల్లోగా తమకు అప్పగించాలని, జరిమానాను రెండు వారాల్లోపు మహారాష్ట్ర న్యాయ సేవల సంస్థకు చెల్లించాలని కూడా ఆదేశించింది.
నవనీత్ కుల ధ్రువీకరణ పత్రాలకు సంబంధించి ఆనంద్‌రావ్ తొలుత ముంబయి జిల్లా కుల ధ్రువీకరణ నిర్ధరణ కమిటీలో ఫిర్యాదు చేశారు. అయితే ఆ కమిటీ నవనీత్ కౌర్‌కే అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. దీంతో ఆనంద్‌రావ్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆమె ఎంపీ పదవిని కోల్పోయే ప్రమాదం ఉందంటూ వార్తలు వచ్చాయి. అయితే, బాంబే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది.