Friday, March 29, 2024
Homeసినిమాఅనూహ్యమైన మలుపులతో సాగే 'నేత్రికన్'

అనూహ్యమైన మలుపులతో సాగే ‘నేత్రికన్’

(డిస్నీ హాట్ స్టార్ రిలీజ్)

నాయిక ప్రధానమైన కథలను ఎంచుకోవడం .. అసమానమైన తన అభినయంతో ఆశ్చర్యచకితులను చేయడం నయనతారకి అలవాటు. తమిళనాట లేడీ ఓరియెంటెడ్ కథలు దాదాపు ఆమెను దృష్టిలో పెట్టుకునే తయారవుతాయనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. ఆమె చేసిన ఈ తరహా సినిమాలు అక్కడ స్టార్ హీరోల సినిమాలతో సమానమైన వసూళ్లను రాబట్టిన సందర్భాలు ఉన్నాయి. పాత్ర ఏదైనా అందులో పూర్తిగా ఒదిగిపోవడం .. పసిడి ఉంగరంలో పగడంలా ఇమిడిపోవడం నయనతారకి మాత్రమే సాధ్యమని చెప్పొచ్చు.

అలాంటి నయనతార ఈ సారి ‘నేత్రికన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘గృహం’ వంటి హారర్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మిలింద్ రావ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. విఘ్నేశ్ శివన్ నిర్మించిన ఈ సినిమా ఇటీవలే ‘డిస్నీ హాట్ స్టార్’ ద్వారా రిలీజ్ అయింది. అంధురాలి పాత్రలో నయనతార నటించిన ఈ సినిమా, ప్రేక్షకులకు ఎంతవరకూ కనెక్ట్ అయిందనేది ఇప్పుడు చూద్దాం.

దుర్గ(నయనతార) చిన్నతనం నుంచే ఎవరూ లేని ఒక అనాథ. అక్కడ పరిచయమైన ‘ఆదిత్య’ అనే కుర్రాడిని తన తమ్ముడిగా భావిస్తూ ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. ఆ తరువాత ఆమె కష్టపడి చదువుకుని సీబీఐ ఆఫీసర్ అవుతుంది .. ఆదిత్యను కూడా ఒక మంచి పొజీషన్ లో చూడాలనుకుంటుంది. కానీ ఒక ప్రమాదం కారణంగా దుర్గ తన చూపును కోల్పోతుంది .. ఆదిత్య తన ప్రాణాలను కోల్పోతాడు. అప్పటి నుంచి ఆమె తన పెంపుడు కుక్కతో కలిసి ఒంటరిగానే ఉంటూ ఉంటుంది.

ఇక ‘దిన’ అనే ఒక సైకో వరుసగా అమ్మాయిలను కిడ్నాప్ చేసి .. అఘాయిత్యం చేసి .. వాళ్లను బంధించి హింసిస్తూ ఉంటాడు. అలా అమ్మాయిల వేటలో ఉన్న ‘దిన’కి ఒక రాత్రివేళ ‘దుర్గ’ కనిస్తుంది. ఆమెను తన ఉచ్చులో పడేయడానికి ప్రయత్నిస్తాడుగానీ, చివరి నిమిషంలో ఆమె తప్పించుకుంటుంది. అతనిపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కి వెళుతుంది. తానేంటనేది నిరూపించుకోవాలనే కసితో ఉన్న పోలీస్ ఆఫీసర్ ‘మణికంఠ’ ఆమెకు సాయపడాలనుకుంటాడు. ఈ విషయంలోనే సాక్షిగా ‘గౌతమ్’ అనే డెలివరీ బాయ్ వీరితో జాయిన్ అవుతాడు. కథ అంతా కూడా ఈ నాలుగు పాత్రల మధ్యనే జరుగుతుంది .. వాళ్ల చుట్టూనే తిరుగుతుంది.

నగరంలో వరుసగా అమ్మాయిలను కిడ్నాప్ చేస్తున్నవాడే తనని కూడా కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడని గ్రహించిన దుర్గ, ఎలాగైనా వాడిని చట్టానికి పట్టించాలనుకుంటుంది. అంధురాలైన ఆమెను ఎలాగైనా అనుభవించాలనే పట్టుదలతో ‘దిన’ తానా వేట మొదలు పెడతాడు. ‘దిన’ సైకోలా మారడానికి కారణం ఏమిటి? అంధురాలైన దుర్గ వాడి బారి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి కష్టాలు పడుతుంది? ఉత్కంఠభరితమైన మలుపులతో సాగే ఈ కథకు ముగింపు ఏమిటి? అనేది తెలియాలంటే సినిమా చూడవలసిందే.

చూపు లేదు .. తోడు లేదు .. ఏ క్షణంలో సైకో ఏ వైపు నుంచి దాడి చేస్తాడో తెలియదు. అయినా తనలాంటి ఆడపిల్లలను వాడి చెర నుంచి విడిపించాలనే ఒక ఉన్నతమైన లక్ష్యంతో పోరాడే యువతిగా నయనతార నటన ఈ సినిమాకి హైలైట్. అంధురాలి పాత్రలో ఆమె జీవించిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం. తప్పకుండా ఆమె కెరియర్లో ఇది చెప్పుకోదగిన సినిమా అవుతుంది. ఇక అజ్మల్ పాత్ర విషయానికొస్తే ఆయన సైకో పాత్రను సరిగ్గా డిజైన్ చేయకపోవడం వలన అంత ఎఫెక్టివ్ ఏమీ అనిపించదు. డెలివరీ బాయ్ గా చేసిన కుర్రాడు మాత్రం చాలా నేచురల్ గా చేశాడు.

మిలింద్ రావ్ ఈ సినిమాను చాలా ఆసక్తికరంగా తెరకెక్కించాడు. కాకపోతే అక్కడక్కడా కొన్ని లోపాలు కనిపిస్తాయి. మెట్రో ట్రైన్ లో ‘దుర్గ’ను సైకో ఫాలో అయ్యే సీన్ ను, శరణాయంలో ఉన్న దుర్గపై సైకో దాడి చేసే సీన్ ను  .. అతణ్ణి పట్టుకోవడానికి ఆమెనే నేరుగా రంగంలోకి దిగే సీన్ ను చాలా ఉత్కంఠభరితంగా చిత్రీకరించాడు. అయితే సైకో ఎవరనే విషయాన్ని ముందుగానే చెప్పేయడం .. సైకోగా మారడానికి తగిన కారణాన్ని బలంగా చెప్పలేకపోవడం ఆయన వైపు నుంచి జరిగిన పొరపాట్లుగా కనిపిస్తాయి. ఎంత రాత్రి అయినా మెట్రో స్టేషన్లో దుర్గ – దిన తప్ప వేరెవరూ లేకపోవడం, అంధురాలైన నాయిక లంకంత ఇంట్లో ఒంటరిగా ఉండటం వాస్తవానికి కాస్త దూరంగా అనిపిస్తాయి.

సైకో పాత్రను మిలింద్ రావ్ డిఫరెంట్ గా డిజైన్ చేసి ఉంటే, ఆ పాత్రను కీలకమైన సందర్భంలో రివీల్ చేసి ఉంటే, ఆయన ఫ్లాష్ బ్యాక్ లో పట్టు ఉంటే, సినిమా మరో స్థాయిలో ఉండేది. గిరీశ్ గోపాలకృష్ణన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి అదనపు బలంగా నిలిచిందనే చెప్పాలి. ఇక ఆర్.డి.రాజశేఖర్ కెమెరా పనితనం కూడా గొప్పగా ఉంది. నైట్ ఎఫెక్ట్ .. రెయిన్ ఎఫెక్ట్ సన్నివేశాలను ఆయన చిత్రీకరించిన తీరు ఆకట్టుకుంటుంది. పాత్ర పరంగా తనకి చూపు లేకపోయినా, ఆడియన్స్ దృష్టిని తనవైపు నుంచి తిప్పుకోకుండా చేయగలిగిన నయనతార కోసం ఈ సినిమా చూడొచ్చు.

— పెద్దింటి గోపీకృష్ణ

RELATED ARTICLES

Most Popular

న్యూస్