జగన్ ప్రభుత్వ హయంలోనే బిసిలకు న్యాయం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. బాబు ఏనాడూ చిత్తశుద్దితో బిసిల సంక్షేమం కోసం కృషి చేయలేదని, అంతా రాజకీయమే చేశారని విమర్శించారు. ఆలయాల పాలక మండళ్ళలో నాయీ బ్రాహ్మణులకు చోటు కల్పించడంపై వారు హర్షం వ్యక్తం చేస్తూ సిఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. తాడేపల్లిలో జరిగిన నాయీ బ్రాహ్మణుల కృతజ్ఞతా సభలో సజ్జల, డిప్యూటీ సిఎం కొట్టు సత్యనారాయణ, మంత్రులు చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ, జోగి రమేష్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ చంద్రబాబు కనీసం తాను చదువుకున్న స్కూల్ ను కూడా పట్టించుకోలేదని, తాము నాడు-నేడుతో ప్రభుత్వ స్కూళ్ళలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. చద్రబాబు తన హయంలో టిడ్కో ఇళ్ళను పూర్తి చేయకుండా సగంలోనే వదిలేస్తే జగన్ వాటిని పూర్తి చేశారని వివరించారు. లోకేష్ నోరు తెరిస్తే పీకుడు భాష మాట్లాడుతున్నారని, బహుశా చంద్రబాబు ఆ పీకుడు పదం తప్ప వేరేది నేర్పలేదేమో అంటూఎద్దేవా చేశారు.
చంద్రబాబు చీకటికి ప్రతినిధి అయితే- జగన్ వెలుగుకు ప్రతినిధి అని సజ్జల అభివర్ణించారు. బాబుకు మీడియా బలం తప్ప ప్రజాబలం లేదన్నారు. నాయీ బ్రాహ్మణులకు చట్టసభల్లో తప్పకుండా చోటు లభిస్తుందని హామీ ఇచ్చిన సజ్జల, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని భూస్తాపితం చేయాలని, 175 సీతల్లలో గెలుపే లక్ష్యంగా పని చేయాలని పిపులు ఇచ్చారు.