లోక్ సభలో అవిశ్వాస తీర్మానం వేళ ప్రధాని మోదీకి షాక్ తగిలింది. కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి ఇండియా (INDIA) ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి ఎన్డీయే (NDA) భాగస్వామ్య పార్టీ అయిన మిజో నేషనల్ ఫ్రంట్ (MNF) మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఎంఎన్‌ఎఫ్ ఎంపీ సి.లాల్రోసంగా తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పొరుగున ఉన్న మణిపూర్ లో అల్లర్ల ఘటన తమను తీవ్రంగా కలచివేసిందన్నారు.
‘నేను విపక్షాల అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తాను. మణిపూర్‌లో చెలరేగిన హింసాకాండను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అయితే, ఇలా చేయడం ద్వారా నేను కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నానని కానీ, బీజేపీని వ్యతిరేకిస్తున్నానని కానీ భావించరాదు. ప్రభుత్వాలు, మరీ ముఖ్యంగా మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దడంలో విఫలమైంది. ఆ రాష్ట్రంలోని ప్రజల పరిస్థితి మమ్మల్ని తీవ్రంగా కలవరపరుస్తోంది. ఈ సమస్యపై నేను మా పార్టీ అధ్యక్షుడు, మిజోరాం ముఖ్యమంత్రి జొరాంతంగతో మాట్లాడాను. మా పార్టీ నేతలంతా అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వడంపై ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే నేను అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటు వేస్తున్నాను’ అని ఎంపీ వివరించారు.