Plenary Success: రెండ్రోజులపాటు జరిగిన ప్లీనరీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపిందని వైఎస్సార్సీపీ అనుబంధ సంఘాల ఇన్ ఛార్జ్, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఇంత పెద్దఎత్తున ఈ వేడుకను విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. కోవిడ్ వల్ల మూడేళ్ళుగా ఎలాంటి పార్టీ సమావేశాలు నిర్వహించలేక పోయామని… ఇటీవల చేపట్టిన నిర్వహించిన గడప గడపకు ప్రభుత్వం, జాబ్ మేళాలు, సామాజిక భేరి బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని, ఇప్పుడు ఈ ప్లీనరీ కార్యకర్తల్లో మరింత ఉత్తేజం నింపిందని, ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారని వివరించారు. రాష్ట్ర ప్రజలు, వారి ప్రయోజనాలే లక్ష్యంగా ప్లీనరీ జరిగిందన్నారు విజయసాయి. సామాజిక, రాజకీయ, ఆర్ధిక, మహిళా సాధికారతే లక్ష్యంగా సాగుతున్న తమ పాలనపై సమావేశాల్లో చర్చించామన్నారు.
ప్రపంచమంతా తమ విధానాలపై ప్రశంశలు కురిపిస్తుంటే చంద్రబాబు ఒక్కరే విమర్శలు చేస్తున్నారని, ఇది అయన భావ దారిద్ర్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ఒకవైపు వాన కురుస్తున్నా, చెక్కు చెదరని విశ్వాసంతో సిఎం జగన్ ప్రసగం విన్నారని తెలిపారు. నిన్న ప్లీనరీకి దాదాపు 9 లక్షల మంది వరకూ వచ్చి ఉంటారని అంచనా వేస్తున్నామన్నారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబును… నాలుగు పదుల వయసు ఉన్న జగన్ ను…. పరిపాలనలోగానీ, ప్రజల శ్రేయస్సు కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లోగానీ, ఆలోచనా విధానంలో అయినా ఎదుర్కోవాలని విజయసాయి సవాల్ విసిరారు.
విజయమ్మ తన రాజీనామా గురించి చాలా స్పష్టంగా చెప్పారని, ఒకేసారి రెండు పార్టీల్లో పదవుల్లో ఉండటం సరికాదని, తెలంగాణలో షర్మిలమ్మ కు అండగా నిలవాల్సిన అవసరం ఉందని, అక్కడ తన అవసరం ఉందని వెళుతున్నట్లు చెపినా కూడా దీనికి రాజకీయ రంగు పులమడం అనేది చంద్రబాబుకే సాధ్యమన్నారు. వైఎస్ జగన్ జీవితకాల అధ్యక్షులుగా పార్టీ ప్లీనరీలో, పార్టీ ప్రతినిధులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా, ఏకగ్రీవంగా జరిగిందని వెల్లడించారు. నవరత్నాలను విమర్శించేవారు, నవ సందేహాలను వ్యక్తం చేసేవారు… మా పార్టీ ప్లీనరీ సమావేశాల్లో వచ్చిన ప్రజా స్పందనను చూసి నవ రంధ్రాలను మూసుకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ప్లీనరీకి హాజరైన మా పార్టీ కార్యకర్త, వేమూరు నియోజకవర్గానికి చెందిన దినేష్ పేవ్‌మెంట్ మీద నడుస్తూ ప్రమాదవశాత్తూ కాలు స్లిప్ అయ్యి బస్సుకింద పడి చనిపోయారని, పార్టీ పరంగా ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్ధిక సాయాన్ని మంత్రి మేరుగ నాగార్జున అందజేస్తున్నామని తెలిపారు.