నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండవుతూ యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన 72 సీటర్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 72 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో ఎయిర్‌క్రాఫ్ట్‌లో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. ఎయిర్‌క్రాఫ్ట్ కూలిన వెంటనే పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో దానిలో ఉన్న అందరూ మంటల్లో కాలి ప్రాణాలు కోల్పోయారు.
నేపాల్ విమాన ప్రమాదం.. జానపద గాయని మృతి
నేపాల్‌లో ఆదివారం జరిగిన విమాన ప్రమాదం పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఘటనలో నేపాల్ ప్రముఖ జానపద గాయని నీరా ఛాంత్యల్ ప్రాణాలు కోల్పోయింది. విమాన ప్రమాదంలో నీరా చనిపోయిందనే విషయాన్ని ఆమె సోదరి హీరా ఛాంత్యల్ షెర్చాన్ ధ్రువీకరించింది. పోఖారకు విమానంలో బయలుదేరిన నీరా మరణించింది. ఆమె మాఘ్ సంక్రాంతి సందర్భంగా పోఖారలో నిర్వహిస్తున్న ఒక ఈవెంట్‌లో పాల్గొనడం కోసం వెళ్లింది. అంతకుముందు నీరా.. అభిమానులకు మాఘ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టింది. అందులో రేపు పొఖారలో చాలా ఎంజాయ్ చేస్తాను అంటూ రాసుకొచ్చింది.