Wednesday, June 26, 2024
HomeTrending Newsమహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలు

మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలు

మహారాష్ట్రలో మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల ముందు వరకు ఏకతాటి మీద ఉన్న పార్టీలు ఇప్పుడు అసమ్మతి గళం వినిపిస్తున్నాయి. అటు మహాయుతి (ఎన్డీయే)లో, ఇటు మహావికాస్‌ అఘాడీ(ఇండియా కూటమి)లో విభేదాలు మొదలయ్యాయి. కేంద్రమంత్రి పదవుల కేటాయింపులు మహాయుతిలో చిచ్చు పెట్టగా, ఎమ్మెల్సీ ఎన్నికల సీట్ల పంపకం మహావికాస్‌ అఘాడీలో మంటలు రాజేసింది.

మహారాష్ట్రలో ఆశించిన లోక్‌సభ స్థానాలు దక్కకపోవడంతో మహాయుతి కూటమిలో విభేదాలు మొదలయ్యాయి. ఓటమికి మీరంటే మీరే కారణమంటూ పరస్పరం నిందలు వేసుకుంటున్నారు. పోటీ చేసిన నాలుగు స్థానాల్లో మూడింట ఎన్సీపీ(అజిత్‌ పవార్‌)వర్గం ఓడిపోయింది. బీజేపీ సరిగ్గా పని చేయకపోవడమే ఇందుకు కారణమని అజిత్‌ పవార్‌ ఆరోపించారు. రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ నేతలు వ్యాఖ్యానించడం తమకు నష్టం చేసిందని బాహాటంగానే విమర్శించారు.

దీనికి తోడు ఎన్సీపీకి కేంద్ర క్యాబినెట్‌లో చోటు దక్కలేదు. ఆ పార్టీ సీనియర్‌ నేత ప్రఫుల్‌ పటేల్‌కు సహాయ మంత్రి పదవి ఇస్తామని బీజేపీ ప్రతిపాదించగా ఎన్సీపీ తిరస్కరించింది. మరోవైపు ఒకే ఒక్క సహాయ మంత్రి పదవి ఇవ్వడం పట్ల శివసేన(ఏక్‌నాథ్‌ షిండే) వర్గం బీజేపీపై అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. బీజేపీ కంటే తామే మంచి ఫలితాలు సాధించామని, తాము 15 సీట్లలో పోటీ చేసి ఏడు గెలిస్తే, బీజేపీ 28 సీట్లలో పోటీ చేసి కేవలం 9 మాత్రమే గెలిచిందని ఆ పార్టీ చీఫ్‌ విప్‌ శ్రీరంగ్‌ బర్నే అన్నారు. తమ కన్నా తక్కువ ఎంపి సీట్లు గెలిచిన పార్టీలకు మంత్రి పదవులలో ప్రాధాన్యం ఇచ్చారని శివసేన, ఎన్సిపి  అసంతృప్తిగా ఉన్నాయి.

లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన మహావికాస్‌ అఘాడీలో (ఎంవీఏ)లోనూ విభేదాలు మొదలయ్యాయి. శాసనమండలి ఎన్నికలు కాంగ్రెస్‌, శివసేన(ఉద్ధవ్‌ ఠాక్రే) మధ్య చిచ్చు రేపాయి. ప్రస్తుతం నాలుగు పట్టభద్రులు, ఉపాధ్యాయ కోటా శాసనమండలి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో రెండు స్థానాలకు తాము పోటీ చేసి, మరో రెండింటిని శివసేన(ఉద్ధవ్‌ ఠాక్రే)కు ఇవ్వాలని కాంగ్రెస్‌ భావించింది. మొత్తం నాలుగు స్థానాలకు తామే పోటీ చేస్తామని ఉద్ధవ్‌ ఠాక్రే ప్రకటించారు. దీనిని పీసీసీ చీఫ్‌ నానా పటోలే తప్పుపట్టారు. తమను సంప్రదించకుండానే ఠాక్రే ఈ ప్రకటన చేశారని ఆరోపించారు. తర్వాత కూడా దీనిపై స్పందించడం లేదని పేర్కొన్నారు. దీంతో రెండు పార్టీల మధ్య విభేదాలు బయటపడ్డాయి.

కూటమి నుంచి బయటకు వచ్చి బిజెపితో జత కట్టేందుకే ఉద్ధవ్‌ ఠాక్రే పెడసరిగా మాట్లాడుతున్నారని కూటమి నేతలు అనుమానిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత ఉద్ధవ్‌ ఠాక్రే వ్యూహంలో మార్పు కనిపిస్తోంది. శాసనసభ ఎన్నికల్లో ఒంటరిగా బరిలో నిలవాలని యోచిస్తున్నట్టు సమాచారం. లోక్ సభ ఎన్నికల్లో బలాబలాలు మారటంతో రెండు కూటములలో విభేదాలు మొదలవుతున్నాయి. అక్టోబర్ లో జరిగే శాసనసభ ఎన్నికల నాటికి మహారాష్ట్రలో కొత్త కూటములు ఏర్పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్