సిరిసాల అశ్విని ప్రొడక్షన్స్ ప్రారంభం

New Production House: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం వస్తున్న సినిమాలు యువతను పెడదోవ పట్టిస్తున్నాయని, మంచి చిత్రాల నిర్మాణం జరిగితే పరిశ్రమ కళకళలాడుతుందని ఎల్.బి.నగర్ ఏసీపీ పి. శ్రీధర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ లో జరిగిన సిరిసాల అశ్విని ప్రొడక్షన్స్ ప్రై.లిమిటెడ్ బ్యానర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న అయన మాట్లాడుతూ..  తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఉత్తమ చిత్రాల నిర్మాణమే ధ్యేయంగా సిరిసాల అశ్విని ప్రొడక్షన్స్ మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.

సిరిసాల అశ్విని ప్రొడక్షన్స్ అధినేత, నిర్మాత సిరిసాల యాదగిరి మాట్లాడుతూ… తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఉత్తమ విలువలతో కూడిన కుటుంబ కథా చిత్రాలను నిర్మించాలన్న లక్ష్యంతోనే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టామని, ఆ దిశగా చక్కటి చిత్రాలను నిర్మించి మంచి పేరు తెచ్చుకుంటామన్నగట్టి నమ్మకం మాకు ఉందని అన్నారు. ప్రస్తుతం తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కుటుంబంతో కలిసి హాయిగా సినిమాలు చూసే పరిస్థితి కొరవడుతుందని, మంచి సినిమాలను హృదయానికి హత్తుకునేలా నిర్మించినప్పుడే చిత్ర పరిశ్రమ పచ్చగా వర్ధిల్లుతుందని అన్నారు.

చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అన్న తేడా లేకుండా వినోదమే ప్రధానంగా చిత్రాలను నిర్మించి పరిశ్రమలో సిరిసాల అశ్విని ప్రొడక్షన్స్ అంటే ఉత్తమ  ప్రొడక్షన్స్ అనేలా పేరు తెచ్చుకుంటామని, ఈ సిరిసాల అశ్విని ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించబోయే తొలి చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు అతి త్వరలో వెల్లడిస్తామని, ఇప్పటి వరకు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో వెలుగు చూడని కథలే మా బ్యానర్లో పురుడు పోసుకుంటాయని, అలాంటి.. ఇలాంటి సాదాసీదా  కథలు కాకుండా, వైవిధ్యమైన కథలే మా చిత్రాలకు ఇతివృత్తాలని ఈ సందర్బంగా నిర్మాత సిరిసాల యాదగిరి తెలిపారు.

ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు శ్రీనివాస్ నేదునూరి, గడ్డిఅన్నారం కార్పొరేటర్ బద్ధం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, ప్రముఖ  నిర్మాత డా. సి.వి రత్నకుమార్, దర్శకుడు ముప్పిడి సత్యం, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్  చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ పక్షాన కిరణ్, వంశీగౌడ్, విష్ణు, నటుడు ఆకెళ్ళ గోపాల కృష్ణ,  హయత్ నగర్ కో – ఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్ ముత్యాల రాజాశేఖర్, పొనుగోటి కరుణాకర్ రావు తదితరులు హాజరయ్యారు. ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి శుభాకాంక్షలు అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *