భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం…ఏకత్వంలో భిన్నత్వం.అనేక భాషలు, సంస్కృతులు, భౌగోళిక పరిస్థితులు.. అయినా ఒక భారతీయ ఆత్మ దేశాన్ని కలిపి ఉంచుతున్నదని మనం గొప్పగా చెప్పుకొంటున్నాము.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత.. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు జరిగింది, పరిపాలనా సౌలభ్యం కోసం కొన్ని రాష్ట్రాల విభజన జరిగింది. స్వతంత్రం వచ్చిన ఐదున్నర దశాబ్దాల తరువాత అప్పటి బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల పరస్పర సమ్మతితో ఓ మూడు రాష్ట్రాలను ఆరు రాష్ట్రాలను చేసింది.
ఇక ఉమ్మడి రాష్ట్రంలో మాకు అన్యాయం జరుగుతోందని, ఆంధ్రోళ్ళు మా నీళ్ళు, నిధులు, నియామకాలు (ఉద్యోగాలు) దోచేసుకొంటున్నారని, మా ప్రాంతానికి స్వయం పరిపాలన కావాలని పట్టు బట్టి తెలంగాణను విడదీయించి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసుకొన్నారు తెలంగాణ నాయకులు.
“విభజించి” రెండు చోట్లా “పాలిద్దామని” కలలుగన్న కాంగ్రెస్ పార్టీని ..
“ప్రత్యేక మత్తు”లో ఉన్న తెలంగాణ ప్రజలు, “పనికిరాని వారిగా పరిగణింప బడ్డామన్న భావనలో” ఆంధ్ర ప్రజలు కాలదన్నారు.
తెలంగాణ ప్రజల ప్రాంతీయ అభిమానమే పునాదిగా, ప్రజల భావోద్వేగాలే పెట్టుబడిగా పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తెలంగాణను అప్రతిహతంగా పాలిస్తోంది.
ఇక ఆ ప్రాంతీయ తత్త్వాన్ని సజీవంగా ఉంచడంలోనే తమ క్షేమం, సౌఖ్యం ఉన్నాయని ఆ పార్టీ, నాయకులు భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు తెరాస నాయకులు సరికొత్త ప్రాంతీయ తత్వాన్ని తెరమీదకు తెస్తున్నారు. “దేశానికి తెలంగాణ పన్నులక్రింద ఎంత చెల్లిస్తోంది.. బదులుగా కేంద్రం నుంచి ఎంత పొందుతోంది” అనే కొత్త వాదన తరచూ తెరమీదకు తెస్తున్నారు.
ఒక ప్రతిపాదిక ప్రకారం ఒకరి తరువాత ఒకరు తెలంగాణ నాయకులు కేంద్రానికి తెలంగాణ లక్షల కోట్లు పన్నులు కడుతుంటే, కేవలం నామ మాత్రం నిధులు తెలంగాణకు ఇస్తోందని, ఇది తెలంగాణకు అన్యాయం చేయడమేనని ప్రచారం మొదలు పెట్టారు. కేంద్ర ప్రభుత్వం పన్నుల రూపంలో సేకరించిన నిధులను దేశ రక్షణకు, వెనుక బడిన రాష్ట్రాల అభివృద్ధికి ఇంకా రాజ్యాంగం ప్రకారం కేంద్రం నిర్వహించ వలసిన అనేక విధుల నిర్వహణకు ఉపయోగిస్తుంది.
రాష్ట్రాలకు కేంద్ర పన్నులలో ఎంత భాగం పంచాలి, ఆ పంచే భాగంలో ఏ రాష్ట్రపు వాటా ఎంతో రాజ్యాంగ బద్ధంగా నియమించిన ఫైనాన్స్ కమిటీ నిర్ణయిస్తుంది.
ఇక మిగిలిన నిధులలో కేంద్రం తన ఖర్చులన్నీ పెట్టుకొని, సరిపోక పోతే ఏడా, పెడా అప్పులు చేస్తూ ఉంటుంది. అయితే “బంతిలో చివరన కూర్చున్నా మనవాడే వడ్డిస్తుంటే ఢోకా లేదన్నట్లు” అప్పుడప్పుడు కేంద్ర నిధులలో కేంద్రంలో అధికారంలో ఉన్న నాయకుల అస్మదీయ రాష్ట్రాలకు అధిక నిధులు వెళ్తాయనేది సత్యమే అయినప్పటికి ఇది కేంద్ర పన్నులలో వాటాగా కాక, వివిధ కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలలో వాటా గానో, లేదా కేంద్రం గ్రాంట్ గా ఇచ్చే నిధుల విషయంలోనో ఉంటుంది.
అయితే కేంద్రం తెలంగాణ ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులు ఇతర రాష్ట్రాల అభివృద్ధికి ఉపయోగిస్తున్నదని, ఇది తెలంగాణకు అన్యాయం చేయడమేనని తెరాస నాయకుల ఆరోపణ.అయితే ఈ తరహా ఆరోపణలు పదేపదే చేయడం వల్ల ప్రజలు కూడా, నిజమే కేంద్రం ఇతర రాష్ట్రాల అభివృద్ధి కోసం మనకు అన్యాయం చేస్తుందనే భావన బలపడుతుంది.
మనం కష్ట పడుతుంటే ఇతరులు సుఖపడుతున్నారనే భావనకు బలం చేకూరుస్తుంది.
ఇది క్రమంగా ఇతర రాష్ట్రాల ప్రజలపై ద్వేషంగా మారుతుంది.
ఇక ఈ దేశంలో ఉంటే మనకు ఇలానే అన్యాయం జరుగుతుందని పిస్తుంది.
ప్రత్యేక దేశంగా విడిపోతే బాగుండు అనిపిస్తుంది.
ఆ మధ్య ఎప్పుడో కల్వకుంట్ల తారకరామ రావు గారు ఇలానే పన్నుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదని డైరెక్ట్ నిర్మలా సీతారామన్ గారికి ట్వీట్ చేసి, విమర్శలు ఎక్కువ అవడం తో “I am not demanding that states be devolved every penny we pay to government of India” అంటూ నాలుక కరుచుకొన్నారు.
అయితే అడపాదడపా ఆయన అనుచరులు ఈ తరహా ప్రకటనలు చేస్తూనే ఉన్నారు.
రాష్ట్రానికి హక్కుగా రావాల్సినవి, అదనంగా అడిగి తెచ్చుకోవాల్సిన విషయాలు వేరు. అనుమానాలు, విద్వేషాలు సృష్టించి పబ్బం గడుపుకోవడం వేరు. ఒక విలన్ ను చూపించి లబ్ధి పొందాలనుకోవడం ఏ సమాజాయినికయినా ఆరోగ్యకరం కాదు.
-శ్రీ వెంకట సూర్య ఫణి తేజ
Also Read:
Also Read:
Also Read: