Friday, November 22, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంనయా ట్రెండ్: డిజిటల్ గోల్డ్, కృత్రిమ వజ్రాలు

నయా ట్రెండ్: డిజిటల్ గోల్డ్, కృత్రిమ వజ్రాలు

వజ్రాలంటే మోజులేనిది ఎవరికి. డైమండ్స్‌ ఆర్‌ విమెన్స్‌ బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అంటారు. మగువ మనసు దోచే వజ్రాభరణాలకు అన్ని దేశాల్లో డిమాండ్ ఉంది. కానీ వాటి ధరే.. సామాన్యులకు అందుబాటులో ఉండదు. అరుదుగా వజ్రాలు లభ్యమవడమే దానికి కారణం. దీంతో కృత్రిమంగా వజ్రాలను తయారు చేసే సాంకేతికతను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.

అన్ని రంగాల మాదిరిగానే వజ్రాల మార్కెట్ లోను చైనా వాటా మెజారిటీగా ఉంది. ఆ తర్వాత భారత్, అమెరికా, సింగపూర్, రష్యా ఉన్నాయి. దక్షిణ కొరియాకు చెందిన పరిశోధకులు ఓ సరికొత్త పద్ధతి అభివృద్ధి చేశారు. ప్రత్యేకమైన ద్రవ లోహ మిశ్రమంతో కేవలం 150 నిమిషాల్లోనే వజ్రాలను తయారు చేసే పద్ధతి రూపొందించారు.

2023 సెప్టెంబర్ లో మూడు రోజుల పర్యటన కోసం అమెరికాకు వెళ్లిన ప్రధాని మోడీ.. యుఎస్‌ ఫస్ట్‌ లేడీ జిల్‌ బైడెన్‌కు 7.5 క్యారట్ల విలువైన ఆకుపచ్చని వజ్రాన్ని బహూకరించారు. జిల్ బిడెన్ మనసు దోచుకున్న అది కృత్రిమ వజ్రమైనా పర్యావరణ అనుకూలమైనది కావటం గమనార్హం.

భారత్‌లో తయారుచేసే వజ్రాలకు అమెరికాలో భారీ గిరాకీ ఉంది. 2023లో ఆరు నెలల కాలంలోనే 130 కోట్ల డాలర్ల విలువైన వజ్రాలను విక్రయించారంటే అమెరికన్లకు భారతీయ వజ్రాలంటే ఎంత మోజు పెరిగిందో అర్థంచేసుకోవచ్చు. భవిష్యత్తులో 700 కోట్ల డాలర్ల నుంచి 800 కోట్ల డాలర్ల వజ్రాల విక్రయాలే లక్ష్యంగా మార్కెట్‌ పుంజుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

బ్రిటన్‌, అస్ట్రేలియా వంటి దేశాల మార్కెట్లలోనూ డిమాండ్‌ పెరుగుతున్నా అవి అమెరికా తరువాతే. మన దేశంలో కృత్రిమ వజ్రాల మార్కెట్ 120 శాతం పెరిగిందని లైం లైట్ డైమండ్స్ యజమాని పూజ సేథ్ ప్రకటించారు. డిమాండ్ కు అనుగుణంగా మార్కెట్ విస్తరణపై దృష్టి సారించామని వెల్లడించారు.

గుజరాత్‌లోని సూరత్‌, ముంబైలో వజ్రాల పరిశ్రమలున్నాయి. పదిహేనేళ్ల క్రితం ఒక క్యారట్‌ సింథటిక్‌ డైమాండ్‌ తయారీకి మూడు లక్షలు ఖర్చయ్యేదట. ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తరువాత కేవలం 22వేల నుంచి 36 వేల రూపాయలు మాత్రమే ఖర్చవుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. దీంతో వజ్రాల ధర కూడా గణనీయంగా తగ్గింది. ఉంగరాల్లో వాడే ఒక క్యారట్ వజ్రం రెండు లక్షల వరకు విలువ చేసేవి. కృత్రిమ వజ్రాల పుణ్యమా అని  80 వేలకు పడిపోయాయి. అదే సహజమైన వజ్రం ఐదు లక్షలు పలుకుతోంది.

మరోవైపు డిజిటల్ గోల్డ్ మార్కెట్ అంతకంతకు పుంజుకుంటోంది. లోహ రూపంలో కొనుగోలు చేయలేని వారు డిజిటల్ గోల్డ్ లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. కలకత్తా నగరాన్ని తీసుకుంటే ఈ రంగంలో 2022లో 1.5 కిలోల బంగారంపై పెట్టుబడులు పెట్టగా.. 2023లో 4. 7 కిలోలకు పెరిగింది. డిజిటల్ గోల్డ్ మార్కెట్ ప్రతి ఏడాది 50 నుంచి 60 శాతం పెరుగుతోందని మార్కెట్ నిపుణులు చెపుతున్నారు.

మనదేశంలో ఇప్పటికే బంగారం స్థానంలో 1 గ్రాం గోల్డ్ మార్కెట్ ఏలుతోంది. అదే రీతిలో కృత్రిమ వజ్రాలు, డిజిటల్ గోల్డ్ వినియోగదారులను ఆకట్టుకుంటూ మార్కెట్ ను ఆక్రమించుకుంటున్నాయి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్