దీపావళి పండగకు అగ్రరాజ్యం అమెరికాలో అరుదైన గుర్తింపు లభించింది. న్యూయార్క్‌లో దీపావళి పండగను సెలవురోజుగా ప్రకటించారు నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది దీపావళి పండగ నుంచే ఈ సెలవును అమల్లోకి తీసుకొస్తామన్నారు. న్యూయార్క్ సిటీ పరిధిలో ఉన్న అన్ని విద్యాసంస్థలు, పాఠశాలలు, కళాశాలలకు సెలవు వర్తిస్తుందని తెలిపారు.
న్యూయార్క్‌లో నివాసం ఉండే సుమారు ఆరు లక్షల మంది ఇకపై దీపావళి పండుగ జరుపుకొంటారని ఆయన స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన బిల్లు సభామోదం పొందిందని వివరించారు. బిల్లు ఆమోదం పొందడాన్ని- 60వ దశాబ్దంలో నల్లజాతీయులు పొందిన పౌర హక్కుల విజయాలతో సమానంగా అభివర్ణవించారు మేయర్. అమెరికన్లు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, జాతిపిత మహాత్మా గాంధీని స్ఫూర్తిగా తీసుకున్నారని వ్యాఖ్యానించారు.
కాగా దీపావళి పండగ రోజున ఫెడరల్ హాలిడే ప్రకటించాలంటూ యూఎస్ హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్.. ఓ బిల్లును ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దివాళీ డే యాక్ట్ పేరుతో రూపొందించిన ఈ బిల్లును డెమొక్రటిక్ పార్టీకి చెందిన సభ్యురాలు గ్రేస్ మెంగ్ ఇటీవలే సభలో ప్రవేశపెట్టారు. న్యూయార్క్ ఆరవ కాంగ్రెస్సోనియల్ డిస్ట్రిక్ట్‌కు ఆమె ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు.
అమెరికాలో ప్రస్తుతం 11 ఫెడరల్ హాలిడేలు అమలులో ఉన్నాయి. జనవరి 1- న్యూ ఇయర్ డే, జనవరి 16- మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ డే, ఫిబ్రవరి 20- ప్రెసిడెంట్స్ డే, మే 29- మెమోరియల్ డే, జూన్ 19- జునెటెంత్ డే, జులై 4- ఇండిపెండెన్స్ డే, సెప్టెంబర్ 4, లేబర్ డే, అక్టోబర్ 9- కొలంబస్ డే, ఇండిజీనస్ పీపుల్స్ డే, నవంబర్ 11- వెటరన్స్ డే, నవంబర్ 23- థ్యాంక్స్ గివింగ్, డిసెంబర్ 25- క్రిస్మస్..ను ఫెడరల్ హాలిడేగా జరుపుకొంటారు అమెరికన్లు.