ఆస్ట్రేలియాలో జరుగుతోన్న టి 20 వరల్డ్ కప్ సూపర్ 12 పోరు తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు ఆతిథ్య ఆసీస్ పై 89పరుగులతో ఘన విజయం సాధించింది. కివీస్ ఓపెనర్ డెవాన్ కాన్వే 58 బంతుల్లో 7ఫోర్లు, 2 సిక్సర్లతో 92 (నాటౌట్); ఓపెనర్ ఫిన్ అలెన్ 16 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 42 ; నీషమ్ 13 బంతుల్లో 2 సిక్సర్లతో 26 పరుగులతో రాణించడంతో 200 భారీ లక్ష్యాన్ని ఆసీస్ ముందుంచింది.
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కివీస్ బ్యాట్స్ మెన్ తొలి ఓవర్ నుంచే పరుగుల వరద పారించారు. తొలి వికెట్ (ఫిన్ అలెన్-42)కు 4.1 ఓవర్లలోనే 56 పరుగులు చేశారు. కెప్టెన్ విలియమ్సన్-23; గ్లెన్ ఫిలిప్స్-12 పరుగులు చేసి ఔటయ్యారు. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది.
ఆసీస్ బౌలర్లలో హాజెల్ వుడ్ రెండు; జంపా ఒక వికెట్ పడగొట్టారు.
భారీ లక్ష్య సాధనలో ఆసీస్ 5 పరుగుల వద్ద రెండో ఓవర్లోనే తొలి వికెట్ (డేవిడ్ వార్నర్-5) కోల్పోయింది. కివీస్ బౌలర్ల చక్కని లైన్ అండ్ లెంగ్త్ తో పాటు, ఆటగాళ్ళ అద్భుత ఫీల్డింగ్ దెబ్బకు ఆసీస్ వరుస వికెట్లు సమర్పించుకుంది. జట్టులో గ్లెన్ మాక్స్ వెల్-28; కమ్మిన్స్-21 మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. 17.1 ఓవర్లలో 111 పరుగులకు ఆసీస్ ఆలౌట్ అయ్యింది.
న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ శాంట్నర్, సౌతీ చెరో మూడు; బౌల్ట్ రెండు; ఫెర్గ్యూసన్, సోది చెరో వికెట్ పడగొట్టారు.
డెవాన్ కాన్వేకు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది .
Also Read : ICC Men’s T20 World Cup 2022: సూపర్ 12కు జింబాబ్వే