Thursday, April 18, 2024
Homeఅంతర్జాతీయంట్విట్టర్ పై బ్యాన్ ఎత్తివేసిన నైజీరియా

ట్విట్టర్ పై బ్యాన్ ఎత్తివేసిన నైజీరియా

lift ban on twitter: నైజీరియాలో ట్విట్టర్ పై ఏడు నెలలుగా కొనసాగుతున్న నిషేధం ముగిసింది. గత ఏడాది జూన్ లో నైజీరియా అధ్యక్షుడు ముహమ్మదు బుహారీ చేసిన ఓ ట్వీట్ ను ట్విట్టర్ యాజమాన్యం తొలగించింది. దీనిపై ఆగ్రహం చెందిన నైజీరియా ప్రభుత్వం ట్విట్టర్ పై నిషేధం విధించింది.  అప్పటి నుంచి ట్విట్టర్ యాజమాన్యానికీ, నైజీరియా ప్రభుత్వానికీ మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి. నైజీరియా చర్య భావ ప్రకటనా స్వేచ్ఛను హరించే విధంగా ఉందంటూ స్వదేశంతో పాటు అంతర్జాతీయంగా పలువురు ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అమెరికా, యూరోపియన్ యూనియన్, కెనడాతో పాటు పలు ఇతర దేశాలు కూడా నైజీరియా తీసుకున్న చర్యను ఖండించాయి. ఈ వాదనకు రోజురోజుకూ బలం పెరుగుతుండడంతో దీనికి ఓ ముగింపు పలకాలని నైజీరియా నిర్ణయించింది. ట్విట్టర్ కంపెనీ నైజీరియాలో కూడా తమ ఆపరేషన్స్ కొనసాగించాలని షరతు విధించి నిషేధాన్ని ఎత్తివేసింది ప్రభుత్వం.

‘ట్విట్టర్ పై కొనసాగుతున్న నిషేధాన్ని అధ్యక్షుడు బుహారీ తొలగించారు, ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిందిగా ప్రభుత్వం నాకు సూచించింది. ఈ అర్ధరాత్రి నుంచే ట్విట్టర్ దేశ ప్రజలకు అందుబాటులో ఉంటుంది’ అని ఆ దేశ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఏజెన్సీ అధికారి ఒకరు వెల్లడించారు.

నైజీరియాలో పలు ప్రజా ఉద్యమాల్లో ట్విట్టర్ కీలక పాత్ర పోషించింది. 2014లో ఇస్లామిక్ తీవ్రవాదుల గ్రూప్ బోకో హారమ్ చిబోక్  స్కూలు విద్యార్ధినుల కిడ్నాప్ సమయంలో ‘బ్రింగ్ బ్యాక్ అవర్ గాళ్స్’ …;  నైజీరియా పోలీసు విభాగం స్పెషల్ యాంటీ రాబరీ స్క్వాడ్ దమన కాండకు నిరసనగా ‘ఎండ్ సార్స్’ ఉద్యమాలకు ట్విట్టర్ ఎంతగానో తోడ్పడింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్