Tuesday, April 16, 2024
HomeTrending Newsపాలకుల పాపం.. సామాన్యులకు శాపం... నిమ్స్

పాలకుల పాపం.. సామాన్యులకు శాపం… నిమ్స్

Nims : నేనూ రాను బిడ్డో సర్కారు దవాఖానకు….అవును ఈ మధ్య ఒక వార్త అందరి దృష్టిని ఆకర్షించింది.అంత పెద్ద వార్త ఏంటా ఏమి మిస్సయ్యాం..అనుకుంటున్నారా.. అదేనండి “నిమ్స్ డైరెక్టర్ కి గుండె పోటు” దీంట్లో విశేషం ఏమిటి. నిమ్స్ డైరెక్టర్ కు హార్ట్ఎటాక్ వచ్చిందా అని నిట్టూర్పు విడిచి ఊరుకుంటాం. అయితే. “నిమ్స్ డైరెక్టర్ కు గుండె పోటు- అపోలోలో చేరిక” అంటూ హెడ్డింగ్ రావడమే అందరినీ ఆకర్షించింది. ఆయనగారేమో హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మక ప్రభుత్వ వైద్య పరిశోధన సంస్థ నిమ్స్ కు డైరెక్టర్, మరి ఆయన అపోలోలో చికిత్స కోసం చేరడం ఏంటన్నది ఈ వార్త చూసిన ప్రతి సామాన్యుడికి అదే పనిగా వచ్చిన సందేహం. ఇంటి దగ్గర వున్నప్పుడు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్ కు హార్ట్ఎటాక్ వచ్చి వుండవచ్చు.. ఇంటికి దగ్గరలో ఉన్న అపోలో ఆస్పత్రికి తీసుకొని వెళ్లి వుండవచ్చు లేక ఆయన ఇంట్లో వాళ్ళు అపోలోలో పని చేస్తున్నారు అందుకే అక్కడికి తీసుకెళ్లారని ఇంకొక వెర్షన్. ఏదైయితేనేం నిమ్స్ డైరెక్టర్ అయినా మనమైనా గుండె నొప్పి వస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాల్సిందే. దానిలో తేడా ఏమీ లేదు. కాకపోతే నిమ్స్ డైరెక్టర్ అయివుండి నేరుగా నిమ్స్ కే వెళ్లి చికిత్స కోసం అడ్మిట్ కాకుండా వేరే ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం చేరడమే వార్త కు మూలమైంది.

నిజానికి తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరం నడిబొడ్డున వున్న నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ( NIMS) ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ప్రతిష్టాత్మక వైద్య సంస్థ , తెలంగాణ సర్కారు కూడా నిమ్స్ అభివృద్ధి కి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. గుండె మార్పిడి వైద్యం నుంచి రోబోటిక్ వైద్యం దాకా దీనిలో అందుబాటులో ఉన్నాయి. అనుభవజ్ఞులైన డాక్టర్లు, పోటీ పడి చేసే వైద్యం , రోజూ వందల సంఖ్యలో పేద రోగులు ఈ ఆసుపత్రిలో చికిత్స కోసం పడిగాపులు కాస్తుంటారు. అయితే దీనికి వున్న మైనస్ పాయింట్ ఇది ప్రభుత్వ పెద్దాసుపత్రి కావడమే. వైద్యం ఎలావున్నా నిర్వహణ విషయంలో ఎంతైనా ప్రభుత్వ ఆసుపత్రి కదా.

ఇంతకూ తాజాఉదంతంలో నిమ్స్ పరువు బజారున పడటానికి కారణం ఆ సంస్థ డైరక్టరే మరో ఆసుపత్రిలో చికిత్స పొందడమేనా, కానేకాదు ప్రభుత్వ ఆసుపత్రి అనగానే అందరికీ చులకన భావమే కారణం. ఇందుకు బాధ్యత వహించాల్సింది ఎవరు? నిక్కచ్చిగా చెప్పాలంటే మన పాలకులే. ముఖ్యమంత్రి కి కొద్దిగా నలతగా వుంటే పెద్ద కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు జరుగుతాయి. అంతెందుకు ఎమ్మెల్యే అయినా ఆఖరికి కార్పొరేటర్ అయినా ప్రభుత్వ ఆసుపత్రి మెట్లెక్కడానికి భయపడతారు.

” నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు ” అంటూ ఎప్పుడో ఒక సినీ గేయ రచయిత ప్రభుత్వ ఆసుపత్రుల దీనావస్థ ను చెప్పకనే చెప్పాడు. సామాన్యుడి కి సర్కారు ఆసుపత్రులపై వున్న అభిప్రాయం తెలిపాడు. అయినా మన పాలకులలో మార్పు రాదు.మార్పు ఆశించడం కూడా తప్పు అవుతుందేమో. అటు ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేసే వైద్యులు , సిబ్బంది తీరు మారదు. అక్కడ పనిచేసే వారందరినీ ఒకే గాడీన కట్టడం కూడా తప్పే అవుతుంది.కానీ వారందరూ అనుకుంటే మార్పు సాధ్యమేనా అంటే సాధ్యమనే చెప్పాలి.

ప్రభుత్వాలు, పాలకులు వైద్యరంగంపై దృష్టి పెడితే, సర్కారీ ఆసుపత్రుల రూపురేఖలు మారతాయనడంలో సందేహం లేదు. మంత్రులు , అధికారులు ఆర్భాటంగా అప్పుడప్పుడు ఆసుపత్రులను తనిఖీ చేయడం, చాలా బాగున్నాయని వారికి వారే సర్టిఫికెట్ ఇచ్చుకోవడం పరిపాటే. అయితే సామాన్యులలో వున్న అభిప్రాయం ఏంటి? ప్రభుత్వం నుంచి ఏమి కోరుకుంటున్నారు? అన్నదానిని ఒకసారి చూస్తే మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో తమకు కావాల్సిన వైద్యం పొందినప్పుడే, సామాన్యుడికీ ప్రభుత్వ ఆసుపత్రులపై విశ్వాసం పెరుగుతుంది. ఆటోమేటిక్ గా ఆసుపత్రుల పనితీరు మెరుగుపడుతుంది. సిబ్బంది పనితీరు బాగుపడుతుంది. అది మొక్కుబడి గా జరిగితే సరిపోదు. సర్కార్ దవాఖానా లో మంచి వైద్యం అందుతుందన్న అభిప్రాయం అందరిలో పెరగాలి. గవర్నర్ గా నరసింహన్ వున్నప్పుడు వ్యక్తిగత వైద్యపరీక్షలు గాంధీ ఆసుపత్రిలో, నిమ్స్ లో చేయించుకొని పాలకులకు ఆదర్శంగా నిలిచారు. అందరూ అదే బాటలో నడిస్తే సర్కారీ ఆసుపత్రుల తీరు మారుతుందేమో.. నిమ్స్ డైరెక్టర్ వేరే ఆసుపత్రిలో చేరినా అలాంటిది వార్త కాదేమో. ఒక్క ఆసుపత్రులే కాదు ప్రభుత్వ పాఠశాలలదీ అదే పరిస్థితి. ఏ ఐఎఎస్ అధికారో తమ పిల్లలను సర్కారు బడి కి పంపితే అది పెద్ద వార్తై కూచునే దుస్థితి మారాలి. పాలకులూ ప్రభుత్వ సంస్థ లపై ఒక కన్నేసి వుంచండి.

వెలది . కృష్ణ కుమార్

RELATED ARTICLES

Most Popular

న్యూస్