Saturday, January 18, 2025
HomeTrending Newsఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ అరుదైన రికార్డు

ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ అరుదైన రికార్డు

కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో నిర్మలా సీతారామన్ అరుదైన రికార్డు సృష్టించారు. వరుసగా ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టి చరిత్రలో నిలిచారు. వరుసగా ఏడుసార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన భారత మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ఘనత సాధించారు. మాజీ ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్‌ని రికార్డును దాటేశారు. మొరార్జీ మొత్తం 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ.. వరుసగా 6 సార్లు మాత్రమే పార్లమెంటులో పద్దు సమర్పించారు. ఇప్పుడు నిర్మలా సీతారామన్ ఆయనను అధిగమించారు.

గతంలో భారత మొట్టమొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూతో పాటు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో ఆర్థిక మంత్రిగా మొరార్జీ దేశాయ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2019లో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో NDA కూటమి వరుసగా రెండోసారి అధికారం చేపట్టగా.. దేశంలో మొదటి మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టారు. అప్పటినుంచి వరుసగా 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో 2024 మధ్యంతర బడ్జెట్ కూడా ఉంది.

సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం కూడా నిర్మల పేరిట నమోదైంది. 2020 బడ్జెట్ సమయంలో ఏకంగా 2 గంటల 40 నిమిషాల సేపు మాట్లాడారు. మధ్యంతర బడ్జెట్ సమయంలో తక్కువ సమయమే మాట్లాడారు. ఈసారి కూడా ట్యాబ్ ద్వారానే బడ్జెట్ ప్రవేశపెట్టారు.

వరుసగా కాకుండా బడ్జెట్‌ ఎక్కువసార్లు సమర్పించిన ఆర్థిక మంత్రులుగా మొరార్జీ దేశాయ్‌కి రికార్డు ఉండగా.. యూపీఏ హయాంలో మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం 9 సార్లు, ప్రణబ్ ముఖర్జీ 8 సార్లు, సీడీ దేశ్‌ముఖ్, యశ్వంత్ సిన్హా 7 సార్లు చొప్పున బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇప్పుడు నిర్మలా సీతారామన్ ఏడుసార్లు సమర్పించి వీరి సరసన నిలిచారు. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 5 సార్లు, అరుణ్ జైట్లీ కూడా 5 సార్లు పార్లమెంటులో పద్దు ప్రవేశపెట్టారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్