Sunday, November 24, 2024
HomeTrending NewsCM-Niti Aayog: ఏపీకి సాయం అందిస్తాం

CM-Niti Aayog: ఏపీకి సాయం అందిస్తాం

నగరీకరణ, పారిశ్రామికీకరణ అంశాల్లో దేశంలో ఎంపిక చేసిన 4 నగరాల్లో విశాఖకు చోటు కల్పించడం శుభపరిణామమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.  భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్, ఎయిర్‌పోర్ట్‌ – సీపోర్ట్‌ కనెక్టివిటీ రోడ్, ఆదానీ డేటా సెంటర్, మూలపేట పోర్టు, ఇనార్బిట్‌ మాల్, సబ్‌మెరైన్‌ మ్యూజియం ఇలా అనేక విధాలుగా విశాఖపట్నాన్ని అభివృద్ది చేసి అంతర్జాతీయంగా, ప్రపంచ పటంలో పెట్టే ప్రయత్నాన్ని తమ ప్రభుత్వం చేస్తుందని సిఎం వెల్లడించారు. నీతి ఆయోగ్‌ అదనపు కార్యదర్శి వి. రాధ, ప్రతినిధుల బృందం పార్ధసారధి రెడ్డి, నేహా శ్రీవాత్సవ, అభిషేక్‌ లు తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో సిఎం జగన్ ను కలుసుకున్నారు.

ఏపీలో జరుగుతున్న అభివృద్ది, సంక్షేమం గురించి నీతి ఆయోగ్‌ ప్రతినిధులతో  సిఎం చర్చించారు. ఏపీలో నూతనంగా నిర్మిస్తున్న సీపోర్టులు, వ్యవసాయం, వైద్య ఆరోగ్యరంగం, విద్యారంగం, నాడు నేడు, నవరత్నాలు, ఆర్బీకేలు, గ్రామ, వార్డు సచివాలయాలు ఇలా ప్రతి విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, వాటి ఫలితాలపై కూడా సిఎం వారికి వివరించారు.

ఏపీలో జరుగుతున్న అభివృద్ది, ప్రభుత్వ పనితీరును  నీతి ఆయోగ్‌ బృందం అభినందించారు. ఇదంతా కూడా డాక్యుమెంటరీ రూపంలో తమకు అందజేయాలని సీఎంను కోరారు. ఏపీకి అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు తాము సిద్దంగా ఉన్నామని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో  ఆర్ధిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, రాష్ట్ర ప్రణాళికా శాఖ కార్యదర్శి గిరిజా శంకర్‌ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్