Saturday, January 18, 2025
HomeTrending Newsనిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ జీవనం ఆసక్తికరం

నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ జీవనం ఆసక్తికరం

ప్రపంచంలో అత్యంత ధనవంతులైన రాజుల్లో నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఒకరు. నిజాం రాష్ట్రాన్నిమొత్తం ఏడుగురు నిజాంలు పాలించినప్పటికీ చివరి నవాబైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ జీవితం మొత్తం అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. నిజాం రాష్ట్రం విలీనానికి ముందు దేశంలో దాదాపు 600 సంస్థానాలుండేవి. వీటిలో వైశాల్యం పరంగానూ, ఆర్దికపరంగానూ నిజాం రాష్ట్రానికి ప్రత్యేక స్థానం ఉంది. ఆనాటి సమకాలీన రాజుల్లోనూ, సంస్థానాదీశుల్లో ఉస్మాన్ అలీ ఖాన్ ఆధునిక భావాలున్న వారీగా పరిగణించవచ్చు.

ఈయన కాలంలోనే నిజాం రాష్ట్రంలో విద్య, వైద్య, నీటిపారుదల, పరిపాలనా. శాస్త్ర సాంకేతిక, విజ్ఞాన తదితర రంగాల్లో అభివృద్ధి, సంస్కరణలు జరిగాయి.. ఆసియా ఖండంలోనే నాడు మేటిగా నిజాం రాజ్యం ఉండేది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధిలో నాడు నైజాం ప్రభుత్వం దేశంలో మొదటి స్థానంలో ఉందని చెప్పటంలో ఎలాంటి అతియోశక్తి లేదు. నిజాం రాష్ట్రంలో నాడు సొంత రైల్వే, అంతర్జాతీయంగా సంబంధాలను కలిపే సొంత విమానయానరంగం.. తపాలా, అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో విదేశాంగ ప్రతినిధులు కలిగి నాడు ఐరోపా దేశాలకు దీటుగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటిగా నిజాం రాష్ట్రం ఉండేది.

ఎప్పుడైతే కాశిం రిజ్వి రజాకార్ ఉద్యమానికి నాయకత్వాన్ని చేపట్టాడో అప్పటి నుండి ఉస్మాన్ అలీ ఖాన్ అప్పటిదాకా చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, సేవలు కనుమరుగై పోయి ఆయన ఒక కరుడు గట్టిన మత చాంధస వాదిగా ప్రజల దృష్టిలో మారడం ప్రారంభమైంది. ఇదే సమయంలో నిజాంను ఒక దుర్మార్గుడిగా, మతమౌఢ్యుడిగా సృష్టించడంలో పరాయి రాష్ట్ర నాయకుల చెప్పుచేతల్లో ఉన్న కొన్ని పార్టీలు విజయం సాధించాయి.

ఇక్కడ నిజాం మంచివాడా, క్రూరుడా, మత చాందసవాదా..  అనే అంశాలను పక్కనబెడితే, ఆయన జీవితంలో ఎన్నో ఆసక్తికర సంఘటనలు ఉన్నాయి. వీటిలో కొన్ని సిల్లీ గా కనిపించినప్పటికీ ఆయన జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించేవిగా ఉన్నాయి..మంచి లావిష్ జీవితాన్ని గడిపిన ఉస్మాన్ అలీ ఖాన్ 1948 సెప్టెంబర్ పోలీస్ యాక్షన్ తర్వాత సాధారణ జీవితాన్ని గడిపాడు. ఒక విధంగా చెప్పాలంటే 1947కు ముందు తర్వాత అనేదిగా ఆయన జీవితం ఉంటుంది.

ఉస్మాన్ అలీ ఖాన్ తన రాజరిక ప్రారంభంలో మంచి ఖరీదైన దుస్తులతో విలువైన ఆభరణాలను ధరించేవాడు. ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు జాన్ బర్టన్ అనే పాశ్చాత్య దర్జీ బట్టలు కుట్టేవాడు. అయితే తన బట్టలను కుట్టేందుకు ఉస్మాన్ అలీ ఖాన్ కొలతలు తీసుకునేందుకు తనను తాకేందుకు బర్దన్ ను నిరాకరించేవారు. కేవలం అందాదాతో జాన్ బర్టన్ నిజాంకు బట్టలు కుట్టేవాడు.

1965లో భారత చైనాల మధ్య యుద్ధం సందర్బంగా తనకు నెలకు వచ్చే కోటి రూపాయల ఆదాయంలో మూడవ వంతు అంటే, 75 లక్షల రూపాయల విలువైన విరాళాన్నిభారత ప్రభుత్వానికి ప్రకటించారు. 5 వేల కిలోల బంగారాన్ని జాతీయ రక్షణ నిధికి విరాళంగా ఇచ్చారు. ప్రస్తుతం మార్కెట్ విలువలో దాదాపు రెండు వేలకోట్ల రూపాయాల విలువ ఉండే ఈ బంగారాన్ని ప్రత్యేకంగా తయారు చేసిన ఇనుప బాక్సులలో న్యూఢిల్లీకి పంపారు. అయితే, న్యూఢిల్లీకి పంపినది కేవలం బంగారమే కాని అవి ఉన్న ఇనుప బాక్సులు తిరిగి వాపసు చేయాలని కోరడం విచిత్రంగా ఉంటుంది.

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన ఉస్మాన్ అలీ ఖాన్ కు బహుమానాలు ‘నజర్’ స్వీకరించే అలవాటు ఉండేది. మొగల్ ల నుండి వచ్చిన ఈ సంప్రదాయం చివరి నిజాం కాలంలో ఎక్కువైంది. పుట్టిన రోజు, ఈద్ ల సందర్బంగా ఈ నజరాణాలను స్వీకరించేవాడు. ఈ నజర్ ల కోసమై ప్రత్యేకంగా దర్బారులు కూడా నిర్వహించేవారు. నజర్ సమర్పించే వ్యక్తి ముందుకు వచ్చి వంగి నిలబడి, ఒక అరచేతిపై మరో అరచేతిని తెరచి ఉంచి, ఆచేతిపై శుభ్రమైన ఎంబ్రాయిడరీతో ఉన్నవస్త్రంపై అష్రఫీ అని పిలిచే బంగారు నాణాన్ని, నాలుగు రూపాయలను పెట్టి నిజాంకు సమర్పిస్తారు. నజర్ సమర్పించే వ్యక్తి హోదాను బట్టి ఈ మొత్తం ఉంటుంది. ఈ నజర్ లను స్వీకరించేందుకై తన కుర్చీకి ఇరువైపులా ఉంచిన సంచుల్లో ఒకదానిలో బంగారు నాణాలు, మరో వైపు సంచిలో రూపాయి నాణాలు వేసేవాడు. తనను చూడడానికి వచ్చే అమీరులు, అధికారులు నుండి నజర్ లను ఆశించే వాడు. అయితే, ఈ నజర్ లను స్వీకరించే పద్దతిని మానుకోవాలని రెసిడెంట్ లేఖ రాశారు. దీనితో నజర్ లను పరిమితం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

సరోజినీ నాయుడుకి నిజాం కుటుంబంతో సన్నిహిత మిత్రుత్వం ఉంది. ఒకసారి సరోజినీ నాయుడితో…నాకు, మా నాన్నగారైన మీరు మహబూబ్ అలీ ఖాన్ కు తేడా ఏమిటని మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రశ్నించారు. ఇందుకు… ‘ఘనత వహించిన మీ తండ్రి గారికి హృదయం ఉంది. మీకు మేధస్సు ఉంది’ అని తడుముకోకుండా సమాధాన మిచ్చిందట సరోజినీ నాయుడు. ఆ సమాదానానికి ఉస్మాన్ అలీఖాన్ గట్టిగా నవ్వాడట.

సందర్భానికి అనుగుణంగా నడుచుకునే తత్వం ఉస్మాన్ అలీ కి ఉండేది. ఔరంగాబాద్ పర్యటన సందర్బంగా అక్కడే ఉన్న ఔరంగజేబ్ సమాధిని అత్యంత సాదా సీదా పౌరుడిగా దర్శించుకున్నాడు. తానూ కేవలం దక్కన్ గవర్నర్ కుటుంబానికి చెందిన వాడనని, తానూ దర్శించుకున్న సమాధి మొఘల్ చక్రవర్తిదనే విషయాన్ని చాటి చెప్పడానికే సుబేదార్ దుస్తులను ధరించాడు. మసీదులు, ప్రార్థనాలయాలు, దర్గాలను సందర్శించినప్పుడు చాలా సాదా సీదాగా, ఏవిధమైన హంగు ఆర్భాటాలు లేకుండా వెళ్ళేవాడు.

ఉస్మాన్ అలీ ఖాన్ తన చివరి రోజుల్లో పరమలోభిగా బతికాడు. తనకోసం, తన సన్నిహితుల కోసం అతి జాగ్రత్తగా ఖర్చు చేసేవాడు. అతని నివాసం కింగ్ కోఠి నిర్వహణ కూడా సక్రమంగా ఉండేది కాదు. భవనానికి రంగులు కానీ సున్నాలు కానీ వేసేవారు కారు. అసలు ఆ భవనం ఒక రాజప్రసాదం అని ఎవరైనా చెప్పేంత వరకు తెలిసేది కాదు.

క్రమ క్రమంగా ఉస్మాన్ అలీ ఖాన్ లో జీవితంపై ఉత్సాహం కొరవడింది. రాను రాను సరైన దుస్తులు కూడా ధరించే వాడు కాదు. కేవలం అధికారిక కార్యక్రమాలకు మాత్రమే దుస్తులు మార్చుకునేవారు. ఆతని షేర్వాణీ, పైజామాలను ఇస్త్రీ చేయించేవాడు కాదు. ఒకే రకమైన టర్కిష్ టోపీ వాడుతుండడంతో ఆ టోపీ అంచులకు నూనె, చెమట మరకలు ఉండేవి. స్థానికంగా తయారయ్యే చార్మినార్ సిగరెట్ ను మాత్రమే తాగేవారు. నిత్యం సందర్శకులను వరండాలోనే కలిసేవారు. ఆ వరండాలో ఒక పురాతన కుర్చీలో కూర్చునేవాడు. ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన నిజామ్ కు.. తన భవనంలో కనీసం రేడియో కూడా ఉండేది కాదట.

కవితలు రాసే ఉస్మాన్ అలీ ఖాన్ తన కవితలను చిత్తు కాగితాలపై రెండు పక్కలా రాసేవాడు. ఆ సమయంలో పేపర్ దొరకనప్పుడు సిగరెట్ పెట్టె అట్టలపై కూడా రాసేవాడు. ఏడవ నిజాంరాసిన ఈ కవితలను తన ఆస్థానంలోని జలీల్ అనే ప్రసిద్ధ కవి సరిచేయడం లేదా కొన్ని కలిపి నిజాంకు ఇచ్చేవాడు.
పురాన హవేలీలో ఉంటున్న తన తల్లిని పరామర్శించడానికి, నిజాం ప్రతిరోజూ మధ్యాహ్నం కారులో పాతబస్తీకి వెళ్లి వస్తుండేవాడు. తల్లి తండ్రులపట్ల నిరాధరన చూపే వారికి తన ఈ చర్య ద్వారా ఆదర్శంగా నిలిచేవారు.

నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ తన అనంతరం తన కుటుంబ సభ్యుల ఆలనా, పాలనా తదితర వ్యవహారాలూ చూసుకునేందుకై 47 ట్రస్టులను ఏర్పాటు చేశారు. వీటిలో తన ఐదారుగురు కొడుకులకు, ఇద్దరు కూతుళ్ళకు, మనుమలు, సవతి సోదరుడు బసాల్ట్ జా కు ట్రస్టులేర్పాటు చేశారు. ‘హెచ్.ఇ.హెచ్. నిజాం స్ ఫామిలీ పాకెట్ మనీ ట్రస్టునొకదానిని ఏర్పాటుచేశారు. సవతి అక్కచెల్లలకు మొత్తం కుటుంబానికి ట్రస్టు ఏర్పాటుచేశారు. మతపరమైన దాన ధర్మాలకు, పవిత్ర పురావస్తువులకు, తీర్థయాత్రలకు, ఆభరణాలను మంచిస్థితిలో నిర్వహించడానికి ట్రస్టులు ఏర్పాటు చేశారు.

తన తల్లి స్మృత్యర్థం ఒక ట్రస్టును, తన మనుమలు, మనుమరాళ్ళ పెళ్లిలో వారికి కానుకలివ్వడానికి ఒక ట్రస్టును ఏర్పాటు చేశారు. చివరగా ఐదు కోట్ల రూపాయలతో ఒక చారిటీ ట్రస్టు నేర్పరిచారు. నిజాం ఉర్దూ, పెర్షియన్ భాషాల్లో రచించిన తన రచనలను, కవితలను ప్రచురించడానికి లక్షా ఇరవై ఐదు వేల రూపాయలతో ప్రత్యేక ట్రస్టు స్థాపించాడు. అన్ని ట్రస్టులలోని మొత్తం రూ. 29 నుంచి 30 కోట్లుగా ఉంది. ఆభరణాలు, పవిత్రమైన పురాతన వస్తువులు దీనికి అదనం.

ప్రపంచంలోనే అత్యంత ధనికుల్లో ఒకరు, హైదరాబాద్ లో ఉస్మానియా తదితర ఆధునిక ఆసుపత్రుల నిర్మాణం చేసిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏవిధమైన ఆధునిక చికిత్స పొందకుండానే మరణించారనేది ఎంతమందికి తెలుసు. 1967 ఫిబ్రవరిలో నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. యునానీ వైద్యాన్ని అనుసరించే ఉస్మాన్ అలీ ఖాన్ కు ఎప్పట్లాగే యునాని వైద్యుడు చికిత్స చేసాడు. వ్యాధి మరింత తీవ్రమైంది. నిజాం అల్లోపతి చికిత్స తీసుకోలేదు. అయినా, ఆయన కూతురు షహజాదీ పాషా తన తండ్రికి ఆధునిక వైద్యానికి సంబందించిన వైద్యులెవరినీ పరీక్షించనివ్వలేదు. ఫిబ్రవరీ 20వ తేదీన తప్పని పరిస్థితుల్లో ముగ్గురు అల్లోపతిక్ డాక్టర్లను పిలిపించారు.

పరిస్థితులు మరింత విషమించచడంతో లండన్ నుండి తన మనుమడు, వారసుడైన ముకర్రం జా కూడా హైదరాబాద్ వచ్చాడు. 1967 ఫిబ్రవరి 24 మధ్యాహ్నం 1.22 గంటలకు మరణించాడు. మరణించిన తర్వాత 3 గంటలకు బీరార్ రాకుమారుడు ఆజాం జా వచ్చాడు. నిజాం రెండవ కుమారుడు తన రాత్రి కార్యకలాపాల అలసట తీర్చుకోవడానికి ఇంకా నిద్రనుండి లేవవలేదు. నిజాం మరణ వార్తను నౌకరు తెలిపినప్పుడు ‘ఇంతపొద్దున్నే ఇటువంటి దుర్వార్తలు తేవద్దు’ అని గుణుగుకుంటూ లేచివెళ్లాడాడట.

80 ఏళ్ల పది నెలల 22 రోజుల వయస్సులో మరణించిన చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అంతిమ యాత్రలో రికార్డు స్థాయిలో దాదాపు రెండు లక్షల మంది పాల్గొన్నారు. ఉస్మాన్ అలీ ఖాన్ భౌతిక కాయాన్ని కింగ్ కోఠి లోని జుడి మస్జీద్ లోని తన ప్రియ మాతృమూర్తి, తన కుమారుడు జువాద్ సమాధుల పక్కన ఖననం చేశారు.

నరేంద్ర లూథర్ రాసిన హైదరాబాద్ చరిత్ర, మరికొన్ని పుస్తకాల ఆధారంగా… 

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్