No Courtesy:పోనీలే. ఆలస్యమయినా…కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయమే తీసుకుంది. ఇకపై పెళ్లిళ్లలాంటి శుభ కార్యాల్లో సినిమా పాటలు వాడుకుంటే కాపీరైట్ చట్టం వర్తించకుండా చట్టాన్ని సవరించారు. అలాగే అధికారిక కార్యక్రమాల్లో, ఆధ్యాత్మిక, సాహిత్య, మతపరమైన సాంస్కృతిక కార్యక్రమాల్లో సినిమా పాటలు వాడుకున్నా కాపీ రైట్ గొడవలు లేకుండా మినహాయింపు ఇచ్చారు.
ఈరోజుల్లో పెళ్లిలో మంగళసూత్రం కట్టడం మరచిపోయినా పెద్ద సమస్య కాదు. పెళ్లికి ముందు సంగీత్ లో సినిమా పాటలకు నడకరాని పిల్లల నుండి ఎనభై ఏళ్ల పండు ముసలి వరకు డ్యాన్సులు చెయ్యకపోతే ఆ పెళ్లి పెళ్లే కాదు. ఆ లోకోత్తర పరమ పవిత్ర తప్పనిసరి ఆచారమయిన సంగీత్ వీడియోను లోకం చూడ్డం కోసం యూ ట్యూబులో అప్ లోడ్ చేయకపోతే రౌరవాది మహానరకాల్లో పడతాం కాబట్టి…సామాజిక మాధ్యమాల్లో పెట్టుకుంటాం. వెంటనే కాపీ రైట్ హక్కుల ఉల్లంఘన కింద ఆ పాట సొంతదారు మన సంగీతానంద పరవశ తాండవ వీడియోను బ్లాక్ చేయించవచ్చు. డిలిట్ చేయించవచ్చు. లేదా మన నుండి నష్టపరిహారం న్యాయపరంగా డిమాండ్ చేయవచ్చు. ఇన్నాళ్లుగా ఉన్న కాపీ రైట్ చట్టం ప్రకారమయితే ఆ పాటను వాడుకున్నందుకు మనమే పద్ధతిగా తెలియజేసి తగిన రాయల్టీ మొత్తం చెల్లించాలి. ఇందులో ఉన్న మెలికను పట్టుకునే ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా అంతటి బాలసుబ్రహ్మణ్యాన్ని కూడా బజారుకు లాగారు. వారి విషయంలో కమర్షియల్ కోణం ఉందనుకోండి- అది వేరే సంగతి.
ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో నడిరేయి ‘ఏ జాములో స్వామి నిను చేర దిగివచ్చునో?’ అన్న భక్తి పాటను సౌండ్ బాక్స్ లో ప్లే చేశారని అనుకుందాం. ఆ కార్యక్రమం ఎక్కడన్నా ప్రత్యక్ష ప్రసారమో, రికార్డెడ్ వీడియో తరువాత ప్రసారమో అయ్యిందని అనుకుందాం. ఆ పాట ఓనర్ మనల్ను కోర్టుకు లాగి కాపీ రైట్ హక్కు కింద మన నుండి పరిహారం లాక్కోవచ్చు.
చిట్టి బాబు సంప్రదాయ వీణాగానం ఉంది. ఒక ప్రభుత్వ అధికారిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో శుభసూచకంగా నేపథ్యంలో ఆ వీణాగానాన్ని ప్లే చేశారు. ఆ కార్యక్రమం ప్రసారం చేసిన అందరూ కాపీ రైట్ చట్టాన్ని ఉల్లంఘించినట్లే.
ఇలా అనేక సమస్యలు ఎదుర్కొన్న జనం సినిమా పాటలు, సంగీతం విషయాల్లో కమర్షియల్ కోణం లేనప్పుడు మినహాయింపు ఇవ్వాలని అడుగుతున్నారు. ఇన్నాళ్లకు కేంద్ర ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి సవరణలు చేసింది.
హమ్మయ్య!
ఇక మనం ఇంటిల్లిపాది నిర్భయంగా- అమలాపురంలో- అ; ఇచ్చాపురంలో- ఇ; ఉంగాపురంలో- ఉ; ఊగాపురంలో- ఊ; ఎత్తుపురంలో- ఎ; పాలకొల్లు పైటజారుడులో- పా; కుర్రకులానికి గాలం వేసిన- గా; చీరకట్టు జారిన- చీ ఛీ పాటలు పాడుకుంటూ ఈలలు వేసుకుని అలుపు సొలుపు లేకుండా ఎగరవచ్చు.
విజిలెయ్యకుండానే వినపడిన ఆంధ్రా సోడా బుడ్డీ జార్చిన మిడ్డీ విశాఖ ఉక్కు కడ్డీ అంత్యప్రాసలను కాపీరైట్ వడ్డీ మీద వడ్డీ కట్టాల్సిన అవసరం లేకుండానే నడ్డి విరిగేదాకా నాట్యాలకు వాడుకోవచ్చు.
మరి కొన్ని ఘడియల్లో తాళి కట్టించుకోబోతూ-
కోక కడితె కొరకొరమంటు చూస్తారు…పొట్టి పొట్టి గౌనే వేస్తే…పట్టి పట్టి చూస్తారు…కోకా కాదు గౌను కాదు…కట్టులోన ఏముంది? మీ కళ్ళల్లోనే అంతా ఉంది…మీ మగ బుద్ధే వంకర బుద్ధి… ఊ అంటావా ఉడ్ బీ? ఊ ఊ అంటావా కుడ్ నాట్ బీ? అని పెళ్లి కూతుళ్లు కాపీ రైట్ గొడవల్లేక నిస్సంకోచంగా ప్రశ్నిస్తే… పెళ్లి కొడుకులు సమాధానాలు చెప్పలేక తలలు దించుకుని…బుగ్గల్లో సిగ్గుల మొగ్గలు పూయించుకోవచ్చు.
తినడానికి పిడికెడు మెతుకులు లేకపోయినా పరవాలేదు. పాడుకోవడానికి పాట ఉంటే చాలు.
“సాపాటు ఎటూ లేదు…
పాటయినా పాడు బ్రదర్!
రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే బ్రదర్!
స్వతంత్ర దేశంలో పాటే పెళ్లిలాంటిది బ్రదర్!”
(కార్యక్రమాల్లో పాటలను వాడుకోవడం వరకే మినహాయింపు ఉంటుంది కానీ…అవి మీడియాలో ప్రసారమయితే కొన్ని షరతులు వర్తిస్తాయన్న విషయం మీద ఇంకా స్పష్టత రావాల్సి ఉంది )
-పమిడికాల్వ మధుసూదన్
[email protected]