ఈ బులెటిన్ను సమర్పిస్తున్నవారు తాలిబాన్లు అని ఆఫ్ఘనిస్థాన్ లో టీ వీ స్టూడియోల న్యూస్ రీడర్లు చెప్పాల్సిన పని లేదు. లైవ్ లో తెర మీద న్యూస్ రీడర్ వెనుక ముగ్గురు, నలుగురు సాయుధ తాలిబాన్లు పద్ధతిగా నిలుచుని ఉంటారు. రీడర్ మాట తూలితే…రీడర్ నుదుటి మీద తూటా దించడానికి సాయుధులు ట్రిగ్గర్ మీద వేలు పెట్టి సిద్ధంగా ఉంటారు.
కాబుల్ లో ఒక టీ వీ స్టూడియోలో న్యూస్ రీడర్ వార్తలు చదువుతుండగా తాలిబాన్లు ప్రవేశించి తమకు అనుకూలంగా వార్తలు చదవాలని తుపాకులతో బెదిరించారు. ప్రాణభయంతో వణికి పోతూ ఆ న్యూస్ రీడర్ వారు చెప్పినట్లే చదివి…ఆ పూటకు ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యింది.
అది కాబూల్ కాబట్టి తుపాకులతో భయపెట్టి తమకు అనుకూలంగా వార్తలు చెప్పించుకున్నారు. మన దగ్గర ఆ తుపాకుల అవసరమే లేకుండా ఎవరికి ఇష్టమొచ్చిన వార్తలు వారు చదివింపచేసుకుంటారు. ఎప్పటికి నేర్చుకుంటారో తాలిబాన్లు!