No Words Are Enough :
ఒక గొప్ప హీరో నటించిన
గొప్ప సినిమాలో
గొప్ప పాట
గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేయగా
గొప్ప గాయకులు
గొప్పగా పాడగా
గొప్ప లిరికల్ విడుదల అయిన గొప్పల కుప్పను యూ ట్యూబ్ లో ఒక బాధ్యత కలిగిన ఐ పి ఎస్ అధికారి విధిలేక చూడాల్సి వచ్చిందట. దాంతో ఆయన మనసు ఏమి గాయపడిందో! ఏమో? ఏమిటది? చివరకు పొగిడే మాటల్లేక…లేక హుందాగా పొగడ్డం రాక ఇలా రాస్తున్నారు? అంటూ బాధ పడ్డాడు. నామీద తుపాకీ ఎక్కుపెట్టి దీని మీద ఏదన్నా రాస్తావా? రాయవా? అని ప్రేమగా బెదిరించాడు. ఆయన తెలుగు సాహితీ పిపాసి. మాతృభాష మాధుర్యాన్ని నాలుకమీద ఎప్పుడూ రుచి చూస్తూ ఉంటాడు. ఆ గౌరవాభిమానాలతో
సరే…అదేమిటో చూద్దామని దుర్ముహూర్తం రాహు కాలంలో వర్జ్యంతో కూడిన యమగండం ఉన్న వేళ ఆఫీసులో కిటికీ తలుపులు, ద్వారం తలుపులు గట్టిగా వేసుకుని రహస్యంగా ఒళ్లు గగుర్పొడిచే ఆ గొప్ప పాటను విన్నా. చూశా.
నేను చాలా సున్నితంగా పెరిగినవాడిని. కూరలో కారమే నాపాలిట హింస. అలాంటిది ఆ పాటలో గొప్ప హీరో చేసే అరాచకం వర్ణిస్తే అది అక్షరాలా శిక్షార్హమయిన హింస అవుతుంది. ఆ పాట రచయిత భాషకు చేసిన హింసకు ప్రతిహింస తప్పదేమో! మ్యూజిక్ డైరెక్టర్ కర్ణ ధ్వంస హింసకు భారీ మూల్యం తప్పదేమో!
మనలో మన మాట. ఇలాంటి హీరో ఉండేవాడా? ఉంటాడా? ఉండబోతాడా?
ఇది క్రియేటివ్ లిబర్టీనా?
కల్పిత కథలో హీరోను పొగడలేక గేయ రచయిత పదాలను కల్పించి రాశాడా?
హతవిధీ!
హీరోలను పొగడలేక పాటలు మూగబోతున్నాయి. సంగీతం గొంతు కోసుకుంటోంది.
ఎవరెస్టు అతడి ఎడమకాలి కింది ధూళి.
ఆకాశం అతని చొక్కా జేబులో కర్చీఫ్.
సునామి అతని శ్వాస.
భూకంపం అతని నిశ్వాస.
సప్త సముద్రాల ఉప్పు జలం అతని చెమట చుక్క.
మేరు పర్వతం అతని చెప్పుకింద నల్లి.
జూలు విదిల్చిన సింహం అతని ఇంటి గోడపై బల్లి.
హిరోషిమా అతని సిగరెట్టు లైటర్.
నాగసాకి అతని వంట పొయ్యి.
అతని చూపు యమధర్మరాజుకు చుక్కాని.
అతని అడుగు బ్రహ్మాండాలకు గొడుగు.
అతని పిడికిలి పిడుగులకు గండం.
అతని పిలుపు ముల్లోకాలకు వణుకు.
అతని కోపం మానవజాతికి శాపం.
ఇంకా ఎంతో చెప్పాల్సిన వీర రౌద్ర బీభత్స భయానక ప్రళయ భీకర మహోగ్ర దంష్ట్రా కఠిన కర్కశ కరాళ పాషాణ పదబంధాలు ఉన్నా…అవేవీ ఈ హీరో కాలి ధూళికి కూడా సమానం కావు అని తమకు తాము సిగ్గుతో తలవంచుకుని, భయపడి, బాధపడి పారిపోవడం వల్ల గేయ రచయిత కొత్త పదాలను సృష్టించి రాయాల్సి వచ్చిందని గుండె బలహీనంగా ఉన్నవారు, మెదడుందని అనుకునేవారు అర్థం చేసుకోగలరు.
పాపం క్షయం కావడానికి కొన్ని అనుభవించక తప్పదు- అంటుంది సనాతన ధర్మం. అలా గడచిన జన్మలతో పాటు, ఈ జన్మలో తెలిసీ తెలియక చేసి…మూటగట్టుకున్న పాపాలు ఇలాంటివి వింటూ అనుభవించే నరకయాతన వల్ల ఎంతో కొంత క్షయమవుతాయనుకుంటే వైరాగ్యానికి వైరాగ్యం. ఆరోగ్యానికి ఆరోగ్యం.
ఇంతకూ-
ఆ పాట పల్లవి అయినా చెప్పలేదు కదూ?
గొంగట్లో కూర్చుని వెంట్రుకలను ఏరుతున్నట్లు…ఏ హీరో పాటయినా…ఏ టైటిల్ సాంగయినా… ఒకటే. ఇది మొదటిదీ కాదు. చివరిదీ కాదు.
అది నరమానవులు పలకలేని పల్లవి.
పాడలేని చరణం.
రాయలేని గేయం!
మోయలేని గాయం!
-పమిడికాల్వ మధుసూదన్
Also Read: భజన చేసే విధము తెలియండి!
Also Read: అప్పుడు మేకకొక తోక – ఇప్పుడు తోకకొక మేక