Monday, January 20, 2025
HomeTrending Newsరాజకీయ ధర్నా కాదు.. రైతుల కోసం ధర్నా

రాజకీయ ధర్నా కాదు.. రైతుల కోసం ధర్నా

 A Dharna Made For The Farmers :

ఏడేండ్లలో తెలంగాణ బీజేపీ నేతలు రాష్ట్రానికి ఏం సాధించారని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ కోసం బీజేపీ మంత్రి, ఎంపీలు ఒక్కటంటే ఒక్కటయినా ప్రాజెక్టు తీసుకువచ్చారా అన్నారు. హైదరాబాద్ తెలంగాణభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రం ఒకలా, రాష్ట్ర నేతలు మరోలా తలా తోకా లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.  రాష్ట్ర బీజేపీ నేతలను అదుపు చేసుకోవాలి.. వారివి దివాళాకోరు రాజకీయాలన్నారు. యాసంగి వడ్ల కొనుగోలుపై కేంద్రం స్పష్టమైన వైఖరి ప్రకటించాలని మంత్రి డిమాండ్ చేశారు.

ఉత్తర భారతదేశం రైతుల ఆందోళనలతో అట్టుడుకుతోందని, దక్షిణ భారత రైతుల సంఘీభావం ఉత్తరభారత రైతుల పోరాటానికి ఉందని మంత్రి భరోసా ఇచ్చారు. సుప్రీంకోర్టు జోక్యంతో కేంద్రం తాత్కాలికంగా నూతన వ్యవసాయ చట్టాలు పక్కనపెట్టిందని, అయినా మూడు నల్లచట్టాల కత్తి రైతుల మెడ మీద వేలాడుతూనే ఉందన్నారు. ఇప్పటికైనా కేంద్రం వడ్ల కొనుగోలు విషయంలో పునంసమీక్షించుకోవాలని, దేశంలో దాదాపు 22 కోట్ల ప్రజలకు ఆహార భద్రత లేదన్నారు. దేశంలోని పేదలకు కేంద్ర ప్రభుత్వం పేరుకుపోయిన ఆహార నిల్వలను పంచిపెట్టాలని మంత్రి కోరారు.

కార్పోరేట్ల రుణాలు మాఫీ చేసే కేంద్రానికి రైతుల కష్టాలు పట్టవా అన్న వ్యవసాయశాఖ మంత్రి తెలంగాణలో  పంటమార్పిడికి రైతులను చైతన్యపరుస్తున్నామన్నారు. తెలంగాణలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నాం .. 8.15 లక్షల ఎకరాలలో సాగుకు కేంద్రం నుండి అనుమతి సాధించామన్నారు. వ్యవస్థలని కేంద్రం గుప్పిట్లో పెట్టుకున్నప్పుడు రాష్ట్రాలు ఏం చేయగలవని, తెలంగాణలో 62 లక్షల ఎకరాలు వరి సాగవుతుంది అంటే కేంద్రం అనుమానించింది .. రాష్ట్ర బీజేపీ నేత ఎద్దేవా చేశాడు .. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే వరి సాగు నిజమేనని చెప్పిందన్నారు.

సాగుయోగ్యమైన భూమి, సాగునీటి సదుపాయం, జాతీయ , అంతర్జాతీయ మార్కెట్ ను కేంద్రం పరిశీలించాలని, దేశవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, నిపుణులతో చర్చించి కేంద్రమే పంటమార్పిడికి ఒక విధానం ప్రకటించాలన్నారు. తాత్కాలిక లబ్దికోసం చిల్లర రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతల చిల్లర చేష్టలతో నష్టపోయేది కేంద్రప్రభుత్వమేనని, యాసంగి వడ్లు కొంటరా ? కొనరా కేంద్రం స్పష్టంచేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం తన కఠినవైఖరి విడనాడాలని, వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి చేసే వారిని గతంలో ప్రోత్సాహకాలు ఇచ్చేది, బీజేపీ అధికారంలోకి వచ్చాక దానిని తొలగించి రైతులను నిరుత్సాహ పరుస్తున్నదన్నారు. ఎగుమతులు, దిగుమతులు కేంద్రం తన గుప్పిట్లో పెట్టుకుంది .. పంటల కొనుగోలుకు కొత్త మార్గాలు ఎందుకు అన్వేషించడం లేదని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధులపై కనీస అవగాహన లేని వాళ్లు బీజేపీ నేతలుగా ఉన్నారని, తెలంగాణ ప్రభుత్వ వివరాల ఆధారంగానే కేంద్ర ప్రభుత్వ ప్రధాని సమ్మాన్ యోజన ఖచ్చితంగా అమలుకాగలిగిందన్నారు.

దేశంలో ఖచ్చితమైన క్రాప్ బుకింగ్ చేపట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నిన్న రాష్ట్రవ్యాప్తంగా ధర్నాకు హాజరైన తెలంగాణ రైతాంగానికి వ్యవసాయమంత్రిగా ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. వరికి ప్రత్యామ్నాయంగా మినుములు, నువ్వులు వంటి ఇతర పంటల సాగుపై రైతులు దృష్టిసారించారని, వానాకాలం ధాన్యం కొనుగోలుకు అవసరమైన కొనుగోలుకేంద్రాల ఏర్పాటుకు రాష్ట్రం సిద్ధంగా ఉందన్నారు. బీజేపీ నేతలు చిల్లరమాటలు మాని యాసంగి కొనుగోళ్లపై కేంద్రం నుండి ఉత్తర్వులు తేవాలన్నారు. కృష్ణాజలాలు వాటా తేల్చలేదని, మెడికల్ కళాశాలలు, రైల్వే కోచ్ లు ఏమీ ఇవ్వకున్నా తెలంగాణ తనకు తాను ఎదుగుతుందన్నారు. ట్రిబ్యునల్ ఏర్పాటులో అలసత్వం, ట్రిబ్యునల్ పై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు అర్థరహితమన్నారు.

భట్టి విక్రమార్క రాజ్యాంగం ఒకసారి చదువుకోవాలని, నల్ల చట్టాలకు పునాదులు వేసిందే కాంగ్రేస్ పార్టీ అన్నారు. కాంగ్రేస్ తెచ్చిన చట్టాలను మోడీ అమలు చేశారని, గత ఎన్నికలకు రూపొందించిన కాంగ్రేస్ మ్యానిఫెస్టో ఒకసారి భట్టి చదువుతే బాగుంటుందన్నారు. మోడీ గుజరాత్ సీఎంగా ఉండి 51 గంటల దీక్ష చేసింది బీజేపీ నాయకులు తెలుసుకోవాలని మంత్రి చెప్పారు. మాది రాజకీయ ధర్నా కాదు- రైతుల కోసం చేసిన ధర్నా అని ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే ఎమ్మెల్యేలు- ఎంపీలతో రైతు సమస్యల పై చర్చిస్తారని, కేంద్రం విధానాలపై మా వైఖరి మాకుంది .. ఏం చేయాలో అది చేస్తామని, కేంద్ర వైఖరి, ప్రస్తుత పరిస్థితిపై క్యాబినెట్ లో చర్చిస్తామన్నారు.

ఇవి కూడా చదవండి: ఎన్నికలపై ఉన్న దృష్టి రైతుల మీద లేదు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్