Tuesday, January 28, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఇప్పుడు కావాలి హీ టీమ్స్

ఇప్పుడు కావాలి హీ టీమ్స్

బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అతుల్‌ సుభాష్ ఆత్మహత్య తర్వాత 24 పేజీల సూసైడ్‌ నోట్‌ పోలీసులకు దొరికింది. ఆయన భార్య క్రూరత్వాన్ని ఆ లేఖ బయటపెట్టింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అతుల్‌ 2019లో నిఖితను పెళ్లి చేసుకున్నారు. ఆమె ఢిల్లీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. మనస్పర్థలు రావడంతో భార్య నిఖిత, అత్త నిశా, బావమరిది అనురాగ్‌, భార్య మేనమామ సుశీల్‌ తనను వేధించారని అతుల్‌ సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నారు. తనపై హత్యాయత్నం, వరకట్న వేధింపులు, అసహజ లైంగిక వేధింపుల ఆరోపణతో యూపీలో 9 కేసులు నమోదు చేశారని, ఆ కేసుల్లో రాజీ కోసం రూ.3 కోట్లు డిమాండ్‌ చేశారని వివరించారు. ప్రతి కేసులోనూ బెంగళూరు నుంచి యూపీ కోర్టుకు వెళ్లాల్సి వచ్చేదని, ఏడాదిలో 40 సార్లు నోటీసులు వచ్చాయని లేఖలో పేర్కొన్నారు.

తన నాలుగేళ్ల కుమారుడిని చూసేందుకూ రెండేళ్లుగా అనుమతించడంలేదని తెలిపారు. తెలంగాణ హైకోర్టులో దాఖలైన ఓ వరకట్న వేధింపుల కేసును కొట్టివేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా అతుల్‌ ఆత్మహత్య అంశాన్ని తాజాగా సుప్రీంకోర్టు ప్రస్తావించింది. వరకట్న వేధింపుల చట్టాన్ని మహిళలు దుర్వినియోగం చేసే ప్రవృత్తి దేశంలో పెరుగుతోందని జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ ఎన్‌.కోటీశ్వర్‌ సింగ్‌ల ధర్మాసనం అభిప్రాయపడింది. వరకట్నం కేసులను నిర్ధారించే ముందు అనవసరమైన వేధింపులను నియంత్రించాలని దిగువ కోర్టులకు సూచించింది. ఆత్మహత్యకు ముందు అతుల్‌ చేసిన 80 నిమిషాల వీడియో, 40 పేజీల సూసైడ్‌ నోట్‌లోని అంశాలను ధర్మాసనం ప్రస్తావించింది”.

ఆమధ్య దేశవ్యాప్తంగా సంచలనమైన ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయిన భర్త ఆత్మహత్య వార్త ఇది.

“ఢిల్లీలో ఒక జంట సహజీవనం చేస్తోంది. ఆమెకు ఉద్యోగం ఉంది. అతడికి ఉద్యోగం లేదు. ఎంత ప్రయత్నించినా దొరకడం లేదు. రోజంతా ఇంట్లో కూర్చోకపోతే ఏదో ఒక కూలి పని అయినా చేసుకోవచ్చు కదా! అని ఆమె సూటిపోటి మాటలు అంటోంది. ఉద్యోగం లేనివాడికి తిండి కూడా దండగే! అని అసహ్యించుకోవడం మొదలుపెట్టింది. అవమానించింది. చివరకు అవమానాలు భరించలేక అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ నోట్ లో తన అశక్తతను తానే నిందించుకున్నాడు కానీ…ఆమెను పల్లెత్తు మాట అనలేదు. సహజీవనంలో నాలుగేళ్ళు భరించింది. ఇంకెంతకాలం భరిస్తుంది? నేనామెకు బరువు కాకూడదు కాబట్టి శాశ్వతంగా తనువు చాలిస్తున్నాను– అని చివరి మాటల్లో సుదీర్ఘ వివరణ ఇచ్చుకున్నాడు.

వరుసగా వెంట వెంటనే జరిగిన రెండు దుర్ఘటనలివి. వార్తలుగా లోకానికి తెలియనివి ఇలాంటివి ఇంకా చాలా ఉండి ఉంటాయి.

చదువు, ఉపాధి అవకాశాలు, ఆర్థిక స్వావలంబన, నగరజీవనం…ఇలా అనేక కారణాలతో మహిళల దృక్పథంలో మార్పు వచ్చింది. భర్త కొడితే పడి ఉండే భార్యలు ఇప్పటికీ ఉండవచ్చు కానీ…భార్య కొడితే నోరుమూసుకుని పడి ఉండే భర్తలు, భార్య కొట్టిన దెబ్బలకు మానసికంగా కుంగి ఆత్మహత్యలు చేసుకుంటున్న భర్తలు కూడా క్రమంగా పెరుగుతున్నారనడానికి ఈ రెండూ ఉదాహరణలు.

బెంగళూరు అతుల్ కు భార్య, భార్య బంధువులు పెట్టిన శారీరక, మానసిక హింసకు సర్వోన్నత న్యాయస్థానమే గుండెలు బాదుకుని…కన్నీరు కార్చింది.

ఆకతాయి అబ్బాయిలు/మగవారి నుండి మహిళలను రక్షించడానికి “షీ టీమ్స్” ఏర్పాటయ్యాయి. ఇప్పుడు కనీసం నగరాల్లో అమ్మాయిలు/స్త్రీలనుండి పురుషులను రక్షించడానికి “హీ టీమ్స్” ఏర్పాటు కావాలేమో!

గృహ హింసలో సమానత్వం సాధించేసిన రోజులు మరి! అని ఎగతాళిగా అనేవారిమాట ఎలా ఉన్నా...భర్తల వేధింపులతో పోలిస్తే భార్యల వేధింపులు చాలా తక్కువే ఉంటాయి. కానీ క్రమంగా పెరుగుతున్నాయి. సమాజానికి అదీ మంచిది కాదు. ఇదీ మంచిది కాదు.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్