ఒడిశాలోని మూడు జిల్లాల్లో బంగారు గనులు బయటపడ్డాయి. రాష్ట్రంలోని జాజ్ పూర్ కియోంఝర్ జిల్లా, మయూర్‌భంజ్, దేవ్ గఢ్ జిల్లాల్లో గనులను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI), డైరెక్టరేట్ ఆఫ్ మైన్‌కు చెందిన సర్వేయర్లు గుర్తించారని మంత్రి ప్రఫుల్లా మల్లిక్ అసెంబ్లీలో వెల్లడించారు. కియోంజఝర్ జిల్లాలో నాలుగు చోట్ల గనులు బయటపడగా, మయూర్‌భంజ్‌లో నాలుగు, డియోగఢ్ జిల్లాలో ఒక చోట బంగారు గనులను గుర్తించారని తెలిపారు. వెనుకబడిన ప్రాంతాలుగా పేరున్న ఈ జిల్లాల్లో బంగారం గనులు బయట పడటం స్థానికులను కలవర పరుస్తోంది. భూమాఫియాలు రంగంలోకి దిగి చౌకగా భూములు కొనుగోలు చేస్తారు. వీరు స్థానిక రాజకీయ నాయకుల అండతోనే ఈ వ్యవహారం చక్క పెడతారని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
ఒడిశాలో బంగారు గనులు…రంగంలోకి భూమాఫియా
దేశంలో మొట్టమొదటిసారిగా లిథియం నిల్వలను జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్‌ఐ) గుర్తించిందని కేంద్ర గనుల శాఖ ఫిబ్రవరి 10న ప్రకటించిన విషయం తెలిసిందే. జమ్ముకశ్మీర్‌లోని రియాసి జిల్లాలో గల సలాల్-హైమనా ప్రాంతంలో 5.9 మిలియన్ టన్నుల లిథియం నిక్షేపాలను గుర్తించినట్టు పేర్కొంది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని ప్రభుత్వాలు భావిస్తున్న నేపథ్యంలో లిథియం నిల్వలు లభించడం మేలు చేయనుంది. కాగా, బంగారం, లిథియం సహా మొత్తం 51 గనులను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించినట్టు గనుల శాఖ వెల్లడించింది.