Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకందసరా ప్రత్యేకం-5

దసరా ప్రత్యేకం-5

“తల్లీ! నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్ నీవు నా
యుల్లంబందున నిల్చి జృంభణముగానుక్తుల్ సుశబ్దంబు శో
భిల్లంబల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ
ఫుల్లాబ్జాక్షీ! సరస్వతీ! భగవతీ! పూర్ణేందుబింబాననా!”

చదువుల తల్లీ! సరస్వతీ! నిన్ను మదిలో ధ్యానించి…పుస్తకం చేతపట్టుకున్నాను. పుస్తకంలో ఉన్న విషయాన్నంతా నా మెదడులోకి చక్కగా బట్వాడా చేయి తల్లీ! నా లోపలినుండి మంచి మాటలను వెలికి వచ్చేలా చేయి తల్లీ! నా మాటలు సుశబ్దాలై ఇతరులకు ఆనందాన్ని కలిగించేలా చేయి తల్లీ! యావత్ ప్రపంచ విద్యార్థులకు ప్రార్థనా గీతం కావాల్సిన పద్యమిది. (ఇది పోతన పద్యంగా ప్రచారంలో ఉంది. కానీ పోతన కావ్యారంభ దేవతాస్తుతుల్లో ఎక్కడా ఈ పద్యం లేదు. పోతన స్థాయిలో ఉన్న అజ్ఞాతకవి పద్యమిది)

మెదడులో ఒక ఆలోచన మాటగా బయటికి రావాలంటే
1. పరా;
2. పశ్యంతి,
3. మాధ్యమ;
4. వైఖరి – అని నాలుగు దశలు దాటాలి. ఈ నాలుగు రూపాలకు సరస్వతి దేవత. పెదవి దాటిన మాట వైఖరి-ఎదుటివారికి వినపడుతుంది. మిగతా మూడు దశల వాక్కు గొంతులో, మనసులో, నాభిస్థానంలో బయలుదేరినప్పుడు ఎదుటి వారికి వినపడదు.

మనతో మనమే స్వగతంలో మౌనంగా మాట్లాడుకుంటున్నప్పుడు కూడా లోపల పదాలు, వాక్యాలు, భావాల భాష పరా పశ్యంతి మధ్యమ దాకా ప్రవహిస్తూనే ఉంటుంది. మనిషి శరీర అవయవాల్లో భాష లేదా ధ్వనులు పుట్టి…మారి…బయటికి వినిపించడాన్ని ఇంత శాస్త్రీయంగా దర్శించిన పురాతన సమాజం ప్రపంచంలో బహుశా మనది తప్ప ఇంకేదీ ఉండకపోవచ్చు.

మెదడులో ఇదివరకే రికార్డ్ అయి ఉన్న మాటలను భావానికి అనుగుణంగా శబ్దం లేదా మాటగా తీసుకురావడం సెకనులో వెయ్యో వంతు సమయంలో ఆటోమేటిగ్గా జరిగినట్లు అనిపిస్తుంది కానీ- ఆటోమేటిగ్గా జరగదు. మన ప్రయత్నంతోనే శబ్దం బయటికి వస్తుంది. ఆలోచన మెదడుది. మాటలు అందించేది మెదడు. శబ్దం వినపడేలా చేసేది మన ఊపిరితిత్తుల్లోని గాలి. నాభి దగ్గర పైకి ప్రయాణించే గాలి గొంతులో స్వర పేటికలో తంత్రుల దగ్గర మూర్ఛనలు పోతుంది. ఆపై నోట్లో అనేక భాగాల కదలికలతో ఒక్కో అక్షరం పలుకుతుంది. ఇంతకంటే లోతయిన వివరణ ఇక్కడ అనవసరం.

మౌఖికంగా ఉన్న భాషకు శాశ్వతత్వం కల్పించేది లిపి. అక్షరం అంటే నశించనిది. పలికినా అక్షరమే. రాసినా అక్షరమే. చదివినా అక్షరమే. క్షయం కాకుండా ఉండాలంటే శబ్దానికి రూపం తప్పనిసరిగా ఉండాలి. అలా ఏర్పడిందే లిపి.

లిపిలో ఉన్న శబ్దాలను చదువుతున్నప్పుడు ముందు కన్ను చదువుతుంది. తరువాత మెదడు చదువుతుంది. ఆపై నోరు పలుకుతుంది. బాగా నచ్చితే మెదడు రికార్డు చేసుకుంటుంది. పుస్తకం సరిగ్గా చదివితే ఏకకాలంలో కన్ను, మెదడు, నోరు, మనసు పనిచేస్తాయి. ఒట్టి శబ్దం చెవిన పడితే ఇంత సాంద్రంగా రికార్డు కాదు. అందుకే చదవాలి. మళ్లీ మళ్లీ చదవాలి. చదువుతూనే ఉండాలి. చచ్చినా చదువు ఆపకూడదు.

“కదా కాలే మాతః కథయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థీ తవ చరణనిర్ణేజనజలమ్,
ప్రకృత్యా మూకానామపి చ కవితాకారణతయా
కదా ధత్తే వాణీముఖకమల తాంబూలరసతామ్”
-శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకం

“అంబ! లాక్షారసోపేతమగు భవత్ప-
దాబ్జ నిర్ణేజనోదక మానుటయును, మూఁగలకునైన కవితయొప్పుగ ఘటించు శారదాముఖతాంబూల సద్రసత్వ మమరుటయు నెప్డు?విద్యార్థినైన నాకు?”
-పమిడికాల్వ చెంచు నరసింహ శర్మ అనువాద పద్యం

అర్థం:-
తల్లీ! సరస్వతీ! ఎర్రని లత్తుక అంటిన నీ పాదాలు కడిగిన తీర్థం పుచ్చుకోగానే మూగవారికి కూడా మాటవచ్చి…కవితలల్లారు. నిరంతర విద్యార్థినైన నాకు ఆ భాగ్యం ఎప్పుడు ప్రసాదిస్తావు తల్లీ?

రేపు:-
“అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ”

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్