-1.4 C
New York
Wednesday, November 29, 2023

Buy now

HomeTrending NewsSikkim: సిక్కింకు పర్యాటకమే శాపం అయిందా?

Sikkim: సిక్కింకు పర్యాటకమే శాపం అయిందా?

హిమాలయాల్లో కుండపోత వర్షాలు రాష్ట్రాల ముఖ చిత్రాన్నే మార్చేస్తున్నాయి. వర్షం కాలం మొదలు కాగానే అస్సాంలోని 16 జిల్లాలు ముంపు బారిన పడ్డాయి.తర్వాత హిమాచల్ ప్రదేశ్ లో కులు, మనాలి నుండి మండి, షిమ్లా వరకు ఊహకందని నష్టం వాటిల్లింది. ఉత్తరాఖండ్ ఉత్తర కాశీ జిల్లాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. తదనంతరం కాశ్మీర్ ఇప్పుడు సిక్కిం వంతు వచ్చింది. అభివృద్ధి పేరుతో నదీ తీర ప్రాంతాల్లో నిర్మాణాలు, జల విద్యుత్ ప్రాజెక్టులు పెను ముప్పుగా పరిణమిస్తున్నాయి. పర్యాటకం పేరుతో బహుళ అంతస్తుల నిర్మాణాలు, కొండలు తవ్వి కొత్త రహదారులు వేయటం… వీటన్నింటి కోసం చెట్ల నరికివేత యదేచ్చగా సాగుతోంది. వృక్ష క్షయంతో వర్షాలు పడినపుడు భూమి కోత వేగంగా జరుగుతుందని నిపుణులు ఇప్పటికే హెచ్చరించారు.

సిక్కిం రాష్ట్రంలో ఉన్నవే నాలుగు జిల్లాలు. ఒకప్పుడు పచ్చదనానికి కేరాఫ్ గా ఉన్న సిక్కింలో ఇప్పుడు ఎక్కడ చూసినా జనసంచారమే. వాహనాల రణగొణ ద్వనులే. 1995 ప్రాంతంలో సాయంత్రం ఆరు దాటితే రాజధాని గాంగ్టక్(Gangtok) వైపు వాహనాల రాకపోకలు సాగేవి కాదు. పర్యాటక రంగంపైనే ఆధార పడ్డ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయం కోసం ఇబ్బడి ముబ్బడిగా నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేశాయి.

సిక్కింతో ఉన్న ఏకైక జాతీయ రహదారి NH-10 చాలా చోట్ల దెబ్బతిన్నది. జాతీయ రహదారి తీస్తా నదిని అనుకునే ఎక్కువగా వెళుతుంది. ఈ రహదారి మూసివేశారు. దీంతో సిక్కిం రాష్ట్రానికి అత్యవసర సరుకులు కేవలం విమానాల ద్వారా పంపుతున్నారు. ఈ రాష్ట్రంలోని ఏకైక విమానాశ్రయం 2018లో అందుబాటులోకి వచ్చింది.

సిక్కింతో పశ్చిమ బెంగాల్ లోని సిలిగురి నగరం ద్వారా అధికంగా వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లోని మెల్లి , తీస్తా బజార్, ఏడో మైలు ప్రాంతాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. మంగళవారం రాత్రి ఉత్తర సిక్కింలోని లోనాక్‌ సరస్సు వెంబడి కురిసిన కుంభవృష్టికి లాచెన్‌ లోయలో తీస్తా నది ఒక్కసారిగా ఉప్పొంగింది. దీంతో తీస్తా నదిపై పది చోట్ల వంతెనలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

చుంగ్ తాంగ్ డ్యాం నుంచి.. ముందస్తు సమాచారం లేకుండా నీటిని విడుదల చేయటమే ఈ ప్రమాదానికి కారణమని స్థానిక అధికారులు అంటున్నారు. సింగ్టమ్ సమీపంలోని బర్దాంగ్ వద్ద ఆర్మీ క్యాంపు పూర్తిగా జలమయం అయింది. వాహనాలతో పాటు 23 మంది సిబ్బంది తప్పిపోయారు.

ఇటీవల నేపాల్లో వరుస భూకంపాలు సిక్కిం వరదలకు కారణం కావొచ్చని కేంద్ర జలసంఘం ప్రాథమిక అంచనాకు వచ్చింది. హైదరాబాద్‌ నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌(NRSC), ఇస్రో విడుదల చేసిన ఫోటోల ప్రకారం సరస్సు విస్తీర్ణం గత వారం వ్యవధిలో వంద హెక్టార్లకుపైగా తగ్గిపోయింది. కుంభవృష్టి కారణంగా దిగువ ప్రాంతంలో మెరుపు వరదలకు ఇదే కారణమై ఉంటుందని ఇస్రో శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

లోనాక్ సరస్సు మొత్తం విస్తీర్ణం 168 హెక్టార్లు కాగా.. ఒక్కసారిగా 60 హెక్టార్లకు తగ్గిపోయింది.. దాదాపు 100 హెక్టార్ల నీటి పరిమాణం తట్టుకోలేక ఉప్పొంగిందని కేంద్ర జల సంఘం ప్రకటించింది.

దశాబ్దకాలంగా హిమాలయ పర్వత సానువుల్లోని రాష్ట్రాల్లో జనాభా ఉహించనంత పెరిగింది. గతంలో అక్కడి నుంచి మైదాన ప్రాంతాలకు ఉపాధికి వచ్చేవారు. ఇప్పుడు పర్యాటకం పేరుతో వ్యాపార నిర్వహణకు మైదాన ప్రాంతాల వారు ఈ ప్రాంతాలకు లెక్కకు మించి చేరుకున్నారు.

జనాభా నియంత్రణ, నిర్మాణాలపై అదుపు లేకపోవటంతో మౌలిక సదుపాయాల నిర్వహణ ప్రభుత్వాలకు పెనుభారం అయింది. దీంతో భూగర్భ మురుగు, వాన కాలం వరదలు…ఈ విధంగా నీరు పల్లం ఎరుగును అన్న రీతిలో వెళుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా పర్వత ప్రాంత రాష్ట్రాలకు ప్రత్యేక ప్రణాళిక అందుకు అనుగుణంగా చట్టాలు చేయకపోతే రాబోయే కాలంలో మరిన్ని విపత్తులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్