Saturday, January 18, 2025
HomeTrending Newsమణిపూర్ మంటలకు ఏడాది

మణిపూర్ మంటలకు ఏడాది

ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ లో లోక్ సభ ఎన్నికల్లో చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా పూర్తి అయింది. మైతీ, కుకీ వర్గాల మధ్య ఘర్షణతో చెలరేగిన హింసాకాండకు శుక్రవారంతో ఏడాది గడిచింది. ఒకప్పుడు ఈ తెగల మధ్య స్పష్టమైన శత్రుత్వం, విభజన లేదు. అలాంటిది ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా భద్రతా బలగాల పహారా, చెక్‌ పాయింట్లు, బారికేడ్లు దర్శనమిస్తున్నాయి. రెండు జిల్లాల సరిహద్దును దాటాలంటే దేశ సరిహద్దునే దాటే విధంగా తనిఖీలు ఉంటున్నాయి.

కుకీలు అధికంగా ఉండే బిష్ణుపూర్‌, చురాచంద్‌పూర్‌ జిల్లాలు, మైతీలు అధికంగా ఉండే ఇంఫాల్‌ వెస్టు, కుకీల ఏరియా అయిన కాంగ్‌పోక్సి జిల్లాల మధ్య సరిహద్దుల్లో చెక్‌ పాయింట్లు ఉన్నాయి. చాలా మంది ‘విలేజ్‌ వాలంటీర్లు’గా రక్షణ పేరుతో సాయుధులుగా మారి గ్రామాలకు పహారా కాస్తున్నారు.

గత ఏడాది మే 3న ప్రారంభమైన ఈ హింసతో రాష్ట్రప్రజలు రెండుగా చీలిపోయారు. ఏడాది గడిచినా, మణిపూర్‌లో పరిస్థితులు ఇంకా సద్దుమణగలేదు. నేటికీ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకొంటున్నాయి. హింసాకాండలో ఇప్పటికి 200 మందికి పైగా మరణించగా, 1,500 మందికి పైగా గాయపడ్డారు. వేలాది ఇండ్లు ధ్వంసం కావడంతో 60 వేల మందికి పైగా ప్రజలు శరణార్థి శిబిరాల్లో, ఇతర ప్రాంతాల్లో తలదాచుకొంటున్నారు. 28 మంది ఆచూకీ లేకుండా పోయారు. రాష్ట్రంలో హింస నియంత్రించడంలో, శాంతి నెలకొల్పడంలో కేంద్రం, రాష్ట్రంలోని ప్రభుత్వాలు విఫలమయ్యాయనే విమర్శలు ఉన్నాయి.

లోయ జిల్లాల్లో మైతీలు, పర్వత ప్రాంతాల్లో కుకీలు అధికంగా ఉంటారు. మైతీలకు ఎస్టీ హోదా ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ పర్వత ప్రాంత జిల్లాల్లో 2023 మే 3న కుకీలు చేపట్టిన ‘ట్రైబల్‌ సంఘీభావ ర్యాలీ’ హింసకు దారితీసింది. మైతీలు, కుకీ మధ్య రేగిన ఘర్షణ పౌర సమాజాన్నే కాదు.. పొలీసులు, ప్రభుత్వ అధికారులను కూడా రెండుగా విభజించింది.ఏడాదిగా కొనసాగుతున్న ఘర్షణల్లో 16 మంది కేంద్ర భద్రతా సిబ్బంది, రాష్ట్ర పోలీసులు విధి నిర్వహణలో మరణించారు.

మణిపూర్ హింస ఈశాన్య రాష్ట్రాలలో ఎన్నికల ముఖ చిత్రాన్నే మార్చిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పౌర సంఘాలు ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించాయి. నాగాలాండ్, మిజోరం రాష్ట్రాల్లో ప్రజలు కుకిలకు మద్దతుగా నిలువగా త్రిపురలో మైతీలకు అండగా నిలిచారు. మేఘాలయ తటస్థంగా ఉన్నా కుకిలకు కొంత సానుభూతి దక్కింది.

అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో అస్సాం రైఫిల్స్ భద్రతా విధులు నిర్వహించింది. సహజంగా కుకీలు అస్సాం రైఫిల్స్ మీద ఆరోపణలు చేయగా అస్సాం రాష్ట్రంలో వాటికి వ్యతిరేకంగా ప్రతిస్పందన కనిపించింది. కుకి మైతీల అల్లర్ల వెనుక డ్రగ్స్ మాఫియా హస్తం ఉందని నిఘా వర్గాలకు సమాచారం ఉంది.

నివురుగప్పిన నిప్పులా ఉన్న మణిపూర్ అల్లర్లపై కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరాక కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ఈశాన్య రాష్ట్రాలలో స్థానిక మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్