Friday, November 22, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఆన్ లైన్ జూదంపై 28 శాతం జిఎస్టి

ఆన్ లైన్ జూదంపై 28 శాతం జిఎస్టి

Super Smart: ధర్మరాజు జూదవ్యసనం గురించి యుగం మారినా చర్చ జరుగుతూనే ఉంది. సప్త మహా వ్యసనాల్లో జూదం ఒకటి. తానోడి నన్నోడెనా? నన్నోడి తానోడెనా? అని ద్రౌపది అడిగిన ప్రశ్న ప్రశ్నగానే ఉండిపోయింది.

“కులము నీరుజేసె గురువును జంపించె పొసగ యేనుగంత బొంకు బొంకె పేరు ధర్మరాజు పెను వేప విత్తయా విశ్వదాభిరామ… వినుర వేమ!”  అని మన వేమన అందుకే తెగ విసుక్కున్నాడు.

రాతి అరుగుల మీద సుద్ద ముక్క, బొగ్గు ముక్కలతో గళ్లు గీసుకుని చింత పిక్కలు, గవ్వలతో జూదం ఆడిన పాతరాతి యుగం కాదిది. నలుచదరపు చెక్క ముక్కను ముందు పెట్టుకుని చేతిలో పాచికలను కలియదిప్పి దాయాలు వేసిన ద్వాపర జూదాల రోజులు కావివి. చేతిలో ముక్కలు పెట్టుకుని నానా లెక్కలు వేసుకుంటూ ఆచి తూచి ఆడిన రమ్మీలు, అందర్ బాహర్ లు, మూడు ముక్కలాటల ప్లేయింగ్ కార్డ్స్ రోజులు కావివి. క్లబ్బులకెళ్లి సిగరెట్లు తాగుతూ, మందు తాగుతూ జూదమాడే రోజులు కూడా కావివి.

డెస్టినేషన్ వెడ్డింగుల్లా ఇప్పుడంతా డెస్టినేషన్ గ్యాంబ్లింగ్. క్యాసినో విహారం. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ఆన్ లైన్ గ్యాంబ్లింగ్.
ఒక నేరాన్ని నియంత్రించలేనప్పుడు దాన్ని నేరంగా చూడకుండా అధికారిక ఆమోద ముద్ర వేయడం అన్న దిక్కుమాలిన సిద్ధాంతమేదో ఉండి చచ్చింది. దీని ప్రకారం మద్యం తాగడం తప్పొప్పుల చర్చకు ఆస్కారం ఉండదు. మద్యం మీద ఎంత పన్నులు వేయాలి? ఎంత ఎక్కువ అమ్మాలి? అన్నదే ప్రభుత్వాలకు తక్షణ సమస్య, బాధ్యత, కర్తవ్యం, ధర్మం అవుతుంది. ఈకోణంలో మందు తాగి ఎవరైనా పాడైపోతే లేదా శాశ్వతంగా పొతే అది ఆ తాగిన వాడి ఖర్మ అవుతుంది కానీ…దానికి ప్రభుత్వాల తప్పేమీ ఉండదు.

అలా ఆన్ లైన్ జూదాన్ని నియంత్రించలేనప్పుడు ఆ జూదానికి ఆమోదముద్ర వేసి దాని మీద పన్నులు వసూలు చేయడమే ఉత్తమం అని కేంద్ర ప్రభుత్వం ఒక శుభ ముహూర్తాన నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్లో జూదానికి లెక్కలేనన్ని యాప్ లు. ఆ విజ్ఞానం ఇక్కడ అనవసరం. కేంద్రప్రభుత్వం ఈమధ్య ఆన్ లైన్ బెట్టింగులు, జూదాల మీద 28 శాతం జి ఎస్ టీ విధిస్తూ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. అక్టోబర్ ఒకటో తేదీ నుండి దేశవ్యాప్తంగా ఇది అమలులోకి వస్తుందని తెలుసుకున్న జూద శిఖామణులు నెలా, రెండు నెలలుగా రోజూ కొంత మొత్తాన్ని జూదం ఆన్ లైన్ యాపుల్లో వేసుకుంటూ వచ్చారట. దాంతో ఒక్క సెప్టెంబర్ నెలలోనే ఆన్ లైన్ బెట్టింగ్ యాపులకు వెళ్లిన మొత్తం గతంతో పోలిస్తే 300 రెట్లు ఎక్కువుందట.

ఎందుకిలా అని కేంద్ర పన్నుల విభాగం వారు ఆరా తీస్తే…విస్తుబోయే విషయాలు తెలిశాయట. అక్టోబర్ ఒకటి తరువాత ఆన్ లైన్ లేదా వైట్ లో జూదమాడే క్యాసినోలు, క్లబ్బులకు డబ్బు పంపితేనే 28 శాతం జి ఎస్ టీ వర్తిస్తుంది. ముందు పంపిన డబ్బుకు జి ఎస్ టీ వర్తించదు. ఇప్పుడయితే లక్ష జూదమాడాలంటే ముందు లక్షా ఇరవై ఎనిమిది వేలు కట్టాలి. ఆ లక్ష ఎలాగూ బూడిదే. దానిమీద పన్ను 28,000 మనమెన్నుకున్న కేంద్రప్రభుత్వ ప్రత్యక్ష పన్నుల ఖాతాలో వెంటనే పడుతుంది. రోజుకు లక్షలు, కోట్లల్లో  ఆన్ లైన్ లో జూదమాడే రెగ్యులర్ కస్టమర్లను ఆకర్షించడానికి ఆగస్ట్, సెప్టెంబర్ రెండు నెలల్లో అనేక ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లు అధికారికంగా ప్రకటనలు కూడా ఇచ్చాయి. “అక్టోబర్ 1వ తేదీకి ముందు కావలసినంత బెట్టింగ్ ఖాతాల్లో డిపాజిట్ చేసుకోండి. 28 శాతం జీఎస్టీ కట్టాల్సిన పనిలేకుండా చూసుకోండి” అన్న ఈ డిజిటల్ ప్రకటనల ఉధృతికి జీఎస్టీ వారి తల తిరిగిందట.

ఎంత మద్యం తాగితే ప్రభుత్వాలు ఆర్థికంగా అంత బలపడుతున్నట్లు…రేప్పొద్దున దేశ ప్రజలు ఎంతగా ఆన్ లైన్ బెట్టింగుల్లో మునిగితేలితే కేంద్ర ప్రభుత్వ ఖజానా అంతగా లావవుతూ ఉంటుంది. మన బెట్టింగ్ మీద జి ఎస్ టీ వారి బడా బెట్టింగ్ లా ఉందిది.

జి ఎస్ టీ వర్తించకముందు నగదును జూదానికి మళ్లించుకోవచ్చన్న చావు తెలివితేటలు గ్యాంబ్లర్లకు ఉంటుందని జి ఎస్ టీ వారు ఊహించినట్లు లేరు.

సమాజ గతిలో కొన్ని విలువలు మారిపోతూ ఉంటాయి. నేనింత ఆదాయపుపన్ను కట్టాను అని గర్వంగా చెప్పుకునే రోజులు పోయి…ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ కోసం నేనింత జి ఎస్ టీ కట్టాను అని గర్వంగా చెప్పుకునే రోజులు వచ్చినట్లున్నాయి. కలికాలం!

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

RELATED ARTICLES

Most Popular

న్యూస్