Operation Parivarthan Is Going On Dgp Stated :
విశాఖ మన్యంలో గంజాయి సాగును ధ్వంసం చేసేందుకు పోలీసు శాఖ చేపట్టిన ఆపరేషన్ పరివర్తన్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని డిజిపి గౌతమ్ సావాంగ్ వెల్లడించారు. రాష్ట్రంలో 400 ఎకరాల్లో హై గ్రేడ్ గంజాయి సాగవుతోందని, 800 మంది పోలీసులు 10 బృందాలుగా ఏర్పడి ఈ ఆపరేషన్ చేపడుతున్నారని చెప్పారు. ఓడిషా సరిహద్దు ప్రాంతంలో కూడా ఆ రాష్ట్ర పోలీసుల సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టామని వివరించారు. ఇప్పటివరకు 270 ఎకరాల్లో పంటను ధ్వంసం చేశామని, ప్రజల నుంచి సహకారం లభిస్తుందని డిజిపి పేర్కొన్నారు.
మన్యం ప్రాంతంలో గంజాయి పెద్దఎత్తున సాగవుతోందని, రాష్ట్రం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు కొందరు గంజాయి సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో పోలీసు శాఖ, ముఖ్యంగా డిజిపి ఈ విషయమై ప్రత్యేక దృష్టిసారించారు. గంజాయి సాగు చేస్తున్న ప్రాంతాలను గుర్తించి, వాటిని ధ్వంసం చేసేందుకు ఆపరేషన్ పరివర్తన్ పేరుతో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. మత్తు పదార్ధాల అక్రమ రవాణా అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలు, రూపొందించాల్సిన వ్యూహాలపై మొన్న విశాఖలో ఓ సమావేశం రాష్ట్ర పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. దీనిలో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పోలీసు అధికారులతో పాటు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, డైరెక్టరేట్ అఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా పాల్గొన్నారు. వివిధ శాఖల మధ్య సమన్వయంతో గంజాయి సాగు, మత్తు పదార్ధాల అక్రమ రవాణా అరికట్టేందుకు ఎలా కలిసి పని చేయాలనేదానిపై చర్చించారు.
Must Read :ఆపరేషన్ పరివర్తన్ కు ప్రజల సహకారం