Tuesday, January 28, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంహిందూపురం కథలు- 4

హిందూపురం కథలు- 4

లేపాక్షిలో భాషా సాహిత్యాలను బోధించడానికి ఒక కళాశాల పుట్టింది. కొంతకాలం ఒక వెలుగు వెలిగింది. భాషా సాహిత్యాలకు విలువలేని కాలం రాగానే విద్యార్థులు లేక అంపశయ్యమీద ఉండి…చివరకు తుది శ్వాస వదిలింది. తెలుగు విద్వాన్; సంస్కృత విద్వాన్ కోర్సులతో భాషాసరస్వతులను తీర్చిదిద్దిన కళాశాల సాధారణ ప్రాథమిక పాఠశాల, ఉర్దూ మీడియం పాఠశాల, జూనియర్ కళాశాల అయి తనను తాను మరచిపోయింది. ఆ కళాశాల విషాదగాథ లేపాక్షి శిల్పాల్లో మౌనరోదనగా మిగిలిపోయింది.

1969లో మహాత్మా గాంధీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రముఖ గాంధేయవాది, మహాదాత చింతలపాటి వరప్రసాద మూర్తి రాజు పాదయాత్ర చేస్తూ హిందూపురం మీదుగా లేపాక్షికి వచ్చారు. (పశ్చిమ గోదావరి జిల్లా చిననిండ్రకొలనులో 1919లో పుట్టిన మూర్తిరాజుగారి దాతృత్వం; సమాజసేవ గురించి ఎంత చెప్పినా ఇంకా చెప్పాల్సింది ఎంతో మిగిలి ఉంటుంది. మరో సందర్భంలో ఆయన గురించి మాట్లాడుకుందాం) లేపాక్షి ఆలయ వైభవానికి పొంగిపోయిన మూర్తిరాజు ఇక్కడ తెలుగు- సంస్కృత భాషలను బోధించడానికి విద్యా సంస్థలు ఉండాలని లేపాక్షి పంచాయతీ ప్రెసిడెంట్ వెంకటనారాయణప్పకు సూచించారు. అప్పటికే ఇతర ప్రాంతాల్లో అనేక విద్యాసంస్థలను నెలకొల్పిన మూర్తిరాజు తనే పూనుకుని అప్పటికప్పుడు నీలం సంజీవరెడ్డి పేరిట ఒక ఉన్నతపాఠశాలను, తన తండ్రి బాపిరాజు పేరిట ఒక కాలేజీని లేపాక్షిలో ప్రారంభించారు. అలా ఏర్పడిన “చింతలపాటి బాపిరాజు ఓరియంటల్ కళాశాల” పాతికేళ్ళపాటు ఒక మెరుపులా మెరిసి మాయమైపోయింది.

కళాశాల తొలి ప్రిన్సిపాల్ నారాయణరావు. తుది ప్రిన్సిపాల్ నాగేశ్వరశాస్త్రి. సంస్కృతాంధ్రాల్లో పండితులు, అష్టావధానులు పమిడికాల్వ చెంచుసుబ్బయ్య, మేడవరం మల్లికార్జున శర్మ, వ్యాకరణ సాహిత్యాలంకార పండితుడు వింజమూరి విశ్వనాథం లాంటి అధ్యాపకులు.

లేపాక్షిలో విద్యార్థులను అష్టావధానులుగా తీర్చి దిద్దిన అధ్యాపకులు; గురువులను మించిన శిష్యులు ఇద్దరూ గొప్పవారే. గ్రామీణ ప్రాంతాలనుండి వచ్చిన నిరుపేద విద్యార్థులు లేపాక్షిలో వారాలబ్బాయిలై (వారంలో ఒక్కో రోజు ఒక ఇంట్లో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం చేసేవారు) బుద్ధిగా చదువుకునేవారు. చదువుకునే నిరుపేద పిల్లలకు పట్టెడన్నం పెట్టడం సమాజం బాధ్యతగా భావించిన కాలమది. వ్యాకరణం, ఛందస్సు, అలంకారాల పాఠాలతో లేపాక్షి అరుగులు ప్రతిధ్వనించిన కాలమది. నెలకు కనీసం రెండు, మూడు అష్టావధానాలతో లేపాక్షి గుడి మంటపాల్లో పద్యసరస్వతి కాలికి గజ్జెకట్టి ఆడిన కాలమది. రాయలసీమ, నెల్లూరు ప్రాంతాల్లో తిరుపతి తరువాత తెలుగు, సంస్కృతం ఉపాధ్యాయులను అత్యధికంగా అందిస్తూ లేపాక్షి పొంగిపోయిన కాలమది. గురువులు, లఘువుల ఛందస్సును పద్యాల్లో నేర్చుకున్న కాలమది. వ్యాకరణ సూత్రాలను పద్యాలు, శ్లోకాల్లో నోటికి నేర్చుకున్న కాలమది. భాషను ఒక శాస్త్రంగా అధ్యయనం చేసిన విద్యార్థులు గొంతెత్తి పద్యమో, శ్లోకమో పాడితే లేపాక్షి నంది లేచి నాట్యం చేసిన రోజులవి. గురువులతోపాటు శిష్యులు కూడా కావ్యాలు రాసి “శిష్యాదిచ్చేత్ పరాజయం” అన్న ఆదర్శానికి అర్థం చెప్పిన కాలమది.

1980ల నాటికి “విద్వాన్”ల భాషావిద్వత్తు సమాజానికి అవసరం లేనిదయ్యింది. సాహిత్యశిరోమణిమాణిక్యాలు 1990 నాటికి పనికిరాని రాళ్లయ్యాయి. భాషాశాస్త్రాలు, భాషోత్పత్తి శాస్త్రాలు, ప్రబంధాలు అంటరానివి అయ్యాయి. లేపాక్షి ఓరియంటల్ కాలేజీలో విద్యార్థులు చేరలేదు. అధ్యాపకులు తప్ప విద్యార్థులు లేని కాలేజీని కొనసాగించడానికి యు జి సి ఒప్పుకోదు. ఒప్పుకోవాలని కోరుకోకూడదు కూడా. లేపాక్షి ఓరియంటల్ కాలేజీకి శాశ్వతంగా తెరపడింది.

హంపీ దసరా దిబ్బ మీద కూర్చుని…
“అష్టదిగ్గజములేమైరి రారు?
విలుచుచున్నది నెమ్మి విసిగి వన్నెలరాళ్ల
తళుకమ్మదేల వర్తకుల గుంపు?
ఆంధ్ర సామ్రాజ్య నాటకాభ్యంతరమున
చివరతెర జారిపోయిన చిన్నె లరసి
మంగళంబున పాడినమాడ్కినేమొ
తీరి గొంతెత్తుచున్న దీ ద్విజకులంబు”-అని కొడాలి వెంకటసుబ్బారావు గుండెలు బాదుకున్నాడు. అలా…
“అష్టావధానులేమైరి రారు?”  అని లేపాక్షి వేలాడే స్తంభాలు కూడా గుండెలు బాదుకుంటున్నాయి.

రేపు:-
హిందూపురం కథలు- 5
“హిందూపురం చిరుతిళ్ళు”

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్