Friday, November 22, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఓటిటి పొట్ట విప్పి చూడ...

ఓటిటి పొట్ట విప్పి చూడ…

Adults’ Only:  తిట్లు, అభ్యంతరకరమయిన ఊత పదాలు, బూతులు, పచ్చి బూతులు లేకుండా ఓటిటి కంటెంట్ తయారు చేయడం సాధ్యం కాదని వినోద పరిశ్రమ నమ్మకం. భారతీయ వినోద పరిశ్రమలో సినిమాలో ఉన్నవారే ఓ టీ టీ లో కూడా ఉంటారు. సినిమాల్లో సెన్సార్షిప్ ఉండబట్టి కొన్ని సందర్భాల్లో నగ్నత్వం గోచీ గుడ్డలయినా అడుగుతూ ఉంటుంది. ఓటిటి కంటెంట్ మీద ప్రస్తుతానికి సెన్సార్షిప్ లేదు. దాంతో శృంగారం సిగ్గుపడే పచ్చితనానికి, చెవులు మూసుకోవాల్సిన పచ్చి బూతు మాటలకు ఓ టీ టీ ఒక అవకాశంగా దొరికింది.

ఆమధ్య తెలుగు హీరోలు వెంకటేష్, రానా ఏదో వెబ్ సీరీస్ లో నటించారు. ఆ బూతు దృశ్యాలు బూతుకే కొత్త పాఠాలు చెప్పాయని లోకం విమర్శించింది. ఓహో! అలాగా! నేనందులో అలా చేయకుండా ఉండాల్సిందేమో కదా? అని రానా కూడా జనం ప్రశ్నకు ఒక ప్రశ్ననే సమాధానంగా వదిలి చేతులు దులుపుకున్నాడు.

ఈమధ్య బేబీ సినిమా ఆహా ఓటిటిలో వచ్చాక అందులో డ్రగ్స్ వాడే దృశ్యాలు యువత డ్రగ్స్ వైపు ఆకర్షితులయ్యేలా ఉన్నాయని, డ్రగ్స్ వాడకాన్ని ప్రోత్సహించేలా ఉన్నాయని పోలీసులు ఆ సినిమా వారిని పిలిచి క్లాసు తీసుకున్నారు.

హిందీలో మీర్జాపూర్, ది ఫ్యామిలీ మ్యాన్, సిటీ ఆఫ్ డ్రీమ్స్, క్రిమినల్ జస్టిస్, అసుర్ లాంటి  వెబ్ సీరీస్ లో ఒక్కో ఎపిసోడ్ లో ఎన్నెన్ని బూతు మాటలను ఉద్దేశపూర్వకంగా రచయితలు వాడారో విమర్శకులు లెక్కగట్టి ప్రపంచానికి తెలిపారు. ఇంగ్లీషులో సాధారణంగా అలవోకగా వాడే పచ్చి బూతు మాటలను వెబ్ సీరీస్ వారు అలాగే ఇంగ్లీషు మాటల మధ్య వాడుతూ…దానికి అదనంగా ప్రాంతీయ భాషలో బూతులు కూడా వాడుతున్నారు.

ఓటిటిలకు గే, లెస్బెనిజం గొప్ప కథాంశాలు. ఓటిటి కామెడీ షోల్లో బూతుకు ఆకాశమే హద్దు.

సినిమా నిర్మాణ వ్యయాన్ని మించిపోయిన వెబ్ సీరీస్ కంటెంట్ ను సెన్సార్షిప్ పరిధిలోకి తేవాలని ఒక డిమాండు ఉంది. దీని మీద కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దృష్టి పెట్టింది కానీ…నియంత్రణ మీద స్పష్టత రాలేదు. ఎప్పుడో ఒకప్పుడు వెబ్ కంటెంట్ మీద సెన్సార్షిప్ రాక తప్పదు. ఈలోపు వెబ్ ప్లాట్ ఫార్మ్స్ ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించాలని కొందరు సలహా ఇస్తున్నారు. ఓటిటిలు తమ ఊపిరి సెక్స్, క్రైమ్ అని బహిరంగంగా చెప్పుకుంటూ ఉంటాయి. అలాంటి ఓటిటిలు స్వీయ నియంత్రణ పాటిస్తాయని అనుకోవడం అమాయకత్వమే అవుతుంది.

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

RELATED ARTICLES

Most Popular

న్యూస్