Wednesday, December 4, 2024
HomeTrending Newsరాష్ట్రంలో పరిస్థితిపై పార్లమెంట్ లో గళమెత్తండి: ఎంపీలతో జగన్

రాష్ట్రంలో పరిస్థితిపై పార్లమెంట్ లో గళమెత్తండి: ఎంపీలతో జగన్

రాష్ట్రంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై  కొనసాగుతున్న దారుణకాండను యావత్‌ దేశం దృష్టికి తీసుకెళ్తామని అందుకే ఢిల్లీ ధర్నా కార్యక్రమానికి అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నామని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పష్తం చేశారు.  రాష్ట్రంలో గత 45 రోజులుగా ఏం జరుగుతుందో వివరిస్తామని, ఈ పోరాటంలో మాతో వచ్చే అన్ని పార్టీలను కలుపుకుపోతామని అన్నారు. తాడేపల్లిలోని క్యాంప్‌ ఆఫీస్‌లో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం జగన్ అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ  బుధవారం  24వ తేదీన ఢిల్లీలో నిర్వహించే ధర్నా కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నాయకులంతా పాల్గొంటారని చెప్పారు. ఢిల్లీలో ధర్నా తర్వాత, పార్టీ ఎంపీలు తమ సభలకు హాజరవ్వాలని, రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, దాడులు, ఆస్తుల విధ్వంసంపై గట్టిగా మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ కూటమి ప్రభుత్వం కక్షతో చేస్తున్న దురాగతాలను పార్టీ ఎంపీలంతా సభ్యులందరి దృష్టికి తీసుకెళ్లాలని ఆదేశించారు.

ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోం మంత్రి అపాయింట్‌మెంట్లు కోరామని, అవి ఖరారైతే వారికి కూడా ఇక్కడి పరిస్థితిని వివరిస్తామన్నారు.  ఢిల్లీలో ధర్నా, నిరసన కార్యక్రమానికి సంబంధించి ఒక్కో ఎంపీకి, ఒక్కో బాధ్యత అప్పగిస్తున్నామని వారంతా వెంటనే ఢిల్లీ వెళ్లి, ధర్నా కార్యక్రమ ఏర్పాట్లలో నిమగ్నం కావాలన్నారు.  ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలు ప్రజల్లో మరింత ఆగ్రహానికి దారి తీస్తున్నాయని, అందుకే రాష్ట్రపతి పాలనకు డిమాండ్‌ చేయాలని సూచించారు. చంద్రబాబుకు గట్టిగా హెచ్చరికలు పంఫై పోరాటం చేయకపోతే దారుణాలకు అడ్డుకట్ట పడదని అభిప్రాయపడ్డారు.

హత్యా రాజకీయాలపి అసెంబ్లీ సమావేశాల్లోనూ నిరసన వ్యక్తం చేస్తామని, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించే సమయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. రాష్ట్రంలో దారుణాలు, అరాచకాలు, ఇక్కడ జరుగుతున్న ఘటనలపై అందరూ గళమెత్తాల్సిన అవసరం ఉందన్నారు.

“గత ఎన్నికల్లో మనం 86 శాతం సీట్లను గెలిచాం. అయినా ఇలాంటి ఘటనలు జరగలేదు. వైయస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, ఓటు వేయని వారికి కూడా ఇంటింటికీ వెళ్లి పథకాలు ఇచ్చాం. దాడులను ఎప్పుడూ ప్రోత్సహించలేదు. ప్రజలందరినీ సమానంగా చూశాం, అందరికీ పారదర్శకంగా సేవలు అందించాం. పార్టీకి కార్యకర్తలు చాలా ముఖ్యం. ఎక్కడ కార్యకర్తలకు నష్టం జరిగినా వెంటనే స్పందించడం, వారిని కాపాడుకోవడం మన బాధ్యత. ఆయా కుటుంబాలకు తోడుగా నిలవాలి. కార్యకర్తలందరి తరఫున గట్టిగా నిలబడాలి. రాష్ట్రంలో వైయస్సార్‌సీపీకి లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉంది” అంటూ నేతలకు ఉద్భోదించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్