Saturday, January 18, 2025
HomeTrending Newsఆర్బీకేలపై విదేశాల ఆసక్తి: పెద్దిరెడ్డి

ఆర్బీకేలపై విదేశాల ఆసక్తి: పెద్దిరెడ్డి

రాష్ట్రంలో వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ ను ఎటువంటి అంతరాయం లేకుండా అందించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ, సైన్స్ & టెక్నాలజీ, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. సిఎం జగన్ గారు రైతుపక్షపాతిగా ఈ దేశంలో ఎవరూ చేయని విధంగా రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని అన్నారు. గురువారం సచివాలయంలోని మూడో బ్లాక్ లో ఇంధన శాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఇప్పటి వరకు తమ ప్రభుత్వం  41 వేల కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ లను మంజూరు చేసిందని వెల్లడించారు. మరో 77వేల కొత్త కనెక్షన్ లను త్వరలోనే రైతులకు ఇవ్వబోతున్నామని చెప్పారు. రైతులకు అందిస్తున్న ఉచిత విద్యుత్ భారాన్ని ప్రభుత్వమే పూర్తిగా భరిస్తోందని, స్మార్ట్ మీటర్ల ఏర్పాటు తరువాత కూడా ఈ భారం ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా వ్యవసాయ కనెక్షన్ లకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేసి, రైతులు ఏ మేరకు విద్యుత్ ను వినియోగిస్తున్నారో అధికారులు అధ్యయనం చేశారని తెలిపారు.  2023 మార్చి నాటికి రాష్ట్ర మొత్తంలోని 18 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ లకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని సూచించారు.

స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై విపక్షాలు రైతుల్లో అపోహలు సృష్టిస్తున్నారని పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  స్మార్ట్ మీటర్ల వల్ల రైతులకు నష్టం జరుగుతుందని ఎలా చెబుతారని ప్రశ్నించారు. విపక్ష నేతలు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించి, అక్కడి రైతులతో మాట్లాడిన తరువాత దీనిపై స్పందిస్తే బాగుంటుందని హితవు పలికారు.  రైతు సంక్షేమానికే సిఎం పెద్దపీట వేస్తున్నారని అన్నారు. ఇథోపియా దేశం మన రాష్ట్రంలో రైతుభరోసా కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను తెలుసుకుని, ఇక్కడ పర్యటించి ఒక సర్వే కూడా చేసిందని తెలిపారు. ప్రపంచబ్యాంక్ సహకారంతో ఇటువంటి వ్యవస్థను తమ దేశాల్లో ఏర్పాటు చేసుకునేందుకు ఆఫ్రికన్ దేశాలు ఆలోచిస్తున్నాయని అన్నారు.

సమీక్షలో ఇంధన శాఖ కార్యదర్శి విజయానంద్, ట్రాన్స్ కో సిఎండి బి.శ్రీధర్, జెఎండి పృథ్వితేజ్, డిప్యూటీ సెక్రటరీ కుమార్ రెడ్డి, డిస్కం సిఎండిలు కె. సంతోష్ రావు, జె.పద్మాజనార్థన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Also Read : సదరన్ కౌన్సిల్ సమావేశంలో బుగ్గన, పెద్దిరెడ్డి

RELATED ARTICLES

Most Popular

న్యూస్