Sunday, September 8, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపెనుగొండలక్ష్మి-4

పెనుగొండలక్ష్మి-4

ఏమిటిది? ఇలా శిథిలమై వికటరూపంతో పెనుగొండ ఇలా కనిపిస్తోంది? పడిపోయిన గోపురాల్లో, పగిలిన రాతి గోడల్లో, దుమ్ము కప్పుకున్న గుళ్లల్లో ఎంతెంత చరిత్ర దాగి ఉందో కనుక్కోమని దీనంగా, మౌనంగా పెనుగొండ అడుగుతున్నట్లుంది.

విధి ఎంత క్రూరమైనదో! తన చేతులతో పెంచిన తీగను తనే తెంచివేసింది. కాలపిశాచి మహా కఠినమైనది. ఆ కాలం కడుపు చీల్చి అందులో దాగి ఉన్న పెనుగొండ సంగతులను పట్టుకుంటే కడుపులో తిప్పినట్లవుతుంది. గుండె బరువెక్కుతుంది.

అదిగో! గబ్బిలాలు తిరిగే నిశ్శబ్ద పెనుగొండ సౌధాల్లో మా కన్నడ రాజ్యలక్ష్మి కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తోంది. ఒకనాటి భాగ్యాన్ని తలచుకుని; ఇప్పటి దీనస్థితిని చూసి గుండెలు బాదుకుంటోంది.

పెనుగొండ కోట బురుజులు తలలు వాల్చి దీర్ఘకాలంగా నిద్రపోతుండడంతో…గుడ్లగూబలు, గబ్బిలాలు సింహాసనమెక్కాయి.

గండపెండేరం ఘల్లు ఘల్లుమంటుండగా నీవు పెదవి విప్పి పలికినప్పుడు;
సులతానులు తలలు వంచి నిన్ను పూజ చేసినప్పుడు;
ఆదివారాహస్వామి జెండా నీడలో నీ కీర్తి సుఖాలను పండించినప్పుడు;
గుహల్లో దాక్కొన్న గజపతి నెత్తి మీద నీ కత్తి కదిలినప్పుడు;
నీ చల్లని చూపుల్లో చీమ కూడా హాయిగా నిద్రపోయినప్పుడు-
కలిగిందే కదా ఆంధ్రులకు భాగ్యం! ఆ భాగ్యం బూడిదలో కలిసి…నీతోనే పోయిందికదా తల్లీ! కన్నడ రాజ్యలక్ష్మి!

ఉలితో రాళ్లకు చక్కిలిగింతలు పెట్టి…ఆయుస్సు, ప్రాణం పోసే శిల్పుల మాధుర్య కళాప్రపంచం లయమైపోయింది. పూర్వ కవిత్వ వాసనలన్నీ పాతాళంలో కలసిపోయాయి. ఆంధ్రుల నైపుణ్యం నుగ్గయిపోయింది. ఆంధ్రుల రక్తంలో ఆనాటి మాహాత్మ్యం ఏది తల్లీ! ఏమైపోయింది?

నీ కంటి కొనల్లో విషాదచారికను చూస్తుంటే వెయ్యి కత్తులు ఒక్కసారే గుండెలో గుచ్చుకున్నట్లుంది. దుఃఖం పొంగుకొస్తోంది. ఎంతటి మహౌన్నత్యాన్ని ఈ లోకం కోల్పోయిందో! మాకే ఇంత దిగులుగా ఉంటే…నీకెలా ఉందో పాపం!

ఎన్నెన్ని విజయాలు! ఎన్నెన్ని ఉత్సవాలు! ఎన్నెన్ని జాతరలు! ఎన్నెన్ని వైభవాలు! ఎన్నెన్ని పండిన వెన్నెలలు!
ఏవీ? ఇప్పుడెక్కడ?
అంతా శూన్యం. నిశ్శబ్దం. వైరాగ్యం.

నీ పిల్లలు ఈ పెనుగొండ మట్టిలో మట్టిగా కలసిపోయారు. భారమైన హృదయంతో శిథిల పెనుగొండలో నువ్విప్పుడు ఎంతగా గుక్కపట్టి ఏడ్చి పిలిచినా ఒక్కడు కూడా తిరిగిరాడు. ఆ కొండలే నిన్ను ఓదార్చాలి.

ఒక కల కరిగిపోయింది. ఒక కళ చెదిరిపోయింది. ఇప్పుడు ఎంత చింతించినా ప్రయోజనం లేదు. కాలపురుషుడిని దాటి ఎవరూ వెళ్ళలేరు.

అమృతరేఖలలో హాలాహలముంది. వలపుల లోగిలిలో విషపు పాములున్నాయి. సుఖదుఃఖాలు పక్కపక్కనే ఉండడం ప్రకృతిలో ఒక రహస్యం. భిన్న వైరుధ్యాలు కలిసి ఉండడం సహజం. కారు చీకట్లు లేకపోతే పండు వెన్నెలలకు విలువేముంటుంది?

ఎంతటి ఔన్నత్యంతో, విజయపరంపరలతో సాగే కాలప్రవాహమైనా…శాశ్వతంగా ఉంటుందా? ఈ శిథిల సమయాలు పోయి…మళ్లీ మహోజ్వల సందర్భాలు వస్తాయా?

పంపా నది నీ లీలలను మైమరచి పాడుతుందేమో!
హజార రామస్వామి కలలో నీ కథలను తలచుకుంటాడేమో!
భద్రాప్రవాహ నిర్ణిద్ర గతిలో నీ చిరు గజ్జెల సవ్వడులు ప్రతిధ్వనిస్తాయేమో!
నీ కీర్తి నలుదిక్కుల్లో నిండి…వెలుగుతుందేమో!

ప్రకృతి రోజూ పాడే ప్రబంధాల్లో నువ్వెక్కడున్నావో?
రాళ్లు కూడా కరిగే నీ దుఃఖపు కథ దానికదిగా ఒక అధ్యాయం.

తెలుగురాయల పలుకులకు దానిమ్మరసం ఉగ్గుపాలు పోసి;
ముసలివయస్సులో మీసము దువ్వే మా రామరాయల గుండెకు అండగా ఉండి;
తిరుమలరాయలు లేనవ్వు వెన్నెలలకు రంగులద్ది;
రామరాజభూషణ కవిరాజు కోకిల చేత పలికించే హిందోళానికి వంతపాడి-
అలసి…సొలసిన మా ఇంటి ఆడబిడ్డ పెనుగొండ వాసినీ! కన్నడ రాజ్యలక్ష్మీ! నీకు నమస్కారమమ్మా!

(సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యుల వారి “పెనుగొండలక్ష్మి” కావ్యంలో ఉన్న పద్యాల వరుసప్రకారమే ఈ కథనాలుంటాయి. ఆ పద్యాలకు ఇది ప్రతిపదార్థం కాదు. స్థూలంగా భావం)

రేపు – పెనుగొండలక్ష్మి-5
“పౌరుషాల కొండ
పెనుకొండ”

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్