The Sculptors: తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీల పేర్ల ప్రస్తావన లేకపోవడం మీద శ్రీ శ్రీ చాలా బాధ పడితే…అది తెలుగు కవితలో తాజ్ మహల్ ను మించి నిలిచి, వెలిగే కవిత అయ్యింది.
“మొగలాయి రాజు తెలి కన్నుల రాల్చిన బాష్ప ధారలే పొదలి ఘనీభవించినవి ముంతాజు మహాలు పోలికన్…” షాజహాను కన్నీరు ఘనీభవిస్తే తాజ్ మహల్ అయ్యిందన్నాడు జాషువా.
పాతకాలంలో ఏ నిర్మాణానికయినా కట్టించిన రాజు పేరు, మహా అయితే ఆ శిల్పి పేరు శిలా శాసనాల్లో ఉండేది. అదే ఇప్పుడు శిలా ఫలకం అయ్యింది. పాత రాతియుగం గుహల్లో మొదలయిన మన నాగరికత రాళ్ల చుట్టూనే తిరగాలి. శిలా ఫలకం మీద ఒక విశిష్ట పేరు జారి పోవడంతో ముచ్చింతల్లో నామ చింత ఎంత ఎడమొగం పెడమొగం అయ్యిందో చూస్తూనే ఉన్నాం
వీధి కొళాయి ఏర్పాటు ఖర్చు పది వేలు ఉంటుంది. కానీ…దాని ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేసిన శిలా ఫలకం ఖర్చు పాతిక వేలు ఉండాలి. ఆ కొళాయిలో చుక్క నీరు రాకపోయినా శిలా ఫలకం మీద స్థానిక ఎం పి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రి, మేయర్, డెప్యూటీ మేయర్, వార్డు మెంబరు…ఇలా శిలా ఫలకంలో పట్టనన్ని పేర్లు ఉండాల్సిందే. అందులో పేర్లు మిస్సయితే కొట్టుకుని చావాల్సిందే. ఇదొక బండ రాతి ప్రేమ. నాగరికత.
నిర్మించిన వారి పేరు పెట్టుకోవడం అందరికీ తెలిసిందే. నిర్మాణ కూలీల పేర్లు శిలా ఫలకం మీద చెక్కించడం మాత్రం వైవిధ్యంగా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు వాసి కొత్తపల్లి మురళీ మోహనరావు తన ఇంటి ముందు శిలా ఫలకంలో-
బిల్డర్, ఇంజనీర్, తాపీ మేస్త్రి, కార్పెంటర్, ఎలెక్ట్రిషియన్, ప్లంబర్, పెయింటర్, టైల్స్ మేస్త్రి, వాచ్ మ్యాన్ పేర్లు, ఫోన్ నంబర్లు, వారి ఊరి పేర్లతో పాటు చెక్కించారు. ఎంతో శ్రమతో నా ఇంటి నిర్మాణంలో పాలుపంచుకున్న అందరినీ శాశ్వతంగా గుర్తుంచుకోవడం నా ధర్మం…అందుకే శిలా ఫలకంలో వారందరి పేర్లు చెక్కించి, ఇంటి ముందు పెట్టుకున్నాను అంటున్న మురళీ మోహనరావును అందరూ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు.
ఈ ఐడియా బాగుంది. నేను కూడా ఇలాగే ఒక శిలా ఫలకం పెట్టిద్దామనుకుంటున్నాను. కాకపోతే నా బాధకు ప్రతిరూపంగా. ఎంతో వ్యయప్రయాసలతో, బ్యాంకు లోన్ ఈ ఎం ఐ లు కడుతూ నేను కొన్న ఇంటికి శిలా ఫలకం పెడితే ఇలా చెక్కించాల్సి ఉంటుంది.
బిల్డర్:-
చివరి పది రూపాయలకు కూడా పదిసార్లు నిర్దయగా అడిగి వసూలు చేసుకున్న దయామయుడు.
కాంట్రాక్టర్:-
ఏదడిగినా ఎక్స్ ట్రా పడుతుందని భయపెట్టి నాసిరకాన్ని అంటగట్టిన పొదుపరి.
ఇంజనీర్:-
వర్షం వస్తే కిటికీల్లో నుండి ఇంటిలోపలికి నీళ్లు పడకుండా పైన ఎంత సైజ్ లింటెల్ వేయాలో కూడా తెలియని ఆర్కిటెక్ట్.
మేస్త్రి:-
ఏమి చెప్పినా అయోమయంగా దిక్కులు చూసే జ్ఞాని.
ప్లంబర్:-
గృహప్రవేశం తరువాత మళ్లీ అన్నీ కొత్తవి ఫిట్ చేయించుకునేంతగా డమ్మీలు బిగించిన నేర్పరి.
ఎలెక్ట్రిషియన్:-
ఎక్కడ అత్యవసరమో అక్కడ మాత్రమే ప్లగ్గులు లేకుండా డిజైన్ చేసిన విద్యుత్ మేధావి.
టైల్స్ మేస్త్రి:-
టైల్స్ మధ్య కావాల్సినంత స్పేస్ ఇచ్చిన ఉదారుడు.
పి వి సి విండో మేస్త్రి:-
దోమలు రాకుండా పెట్టిన మెష్ డోర్ గుండా ఐదడుగుల నాగు పాము మాత్రమే ప్రవేశించేలా చేసిన అధునాతన డిజైనర్.
ఇంకా ఎన్నో ఉన్నాయి కానీ…పేరు మోసిన బిల్డర్ గొడుగు కింద పేరు మోసిన కూలీల ఆత్మాభిమానాన్ని, వారి అమేయ, అతులిత, మరపురాని పనితనాన్ని గౌరవించాల్సిన గురుతరమయిన బాధ్యత నా మీద ఉండడం వల్ల, శిలా ఫలకం సైజు చిన్నది కావడం వల్ల…మిగిలిన అన్ని పేర్లు నా మనో ఫలకం మీదే!
-పమిడికాల్వ మధుసూదన్
Also Read : ఉక్రెయిన్ విషాదం