Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంగ్యాస్ సిలిండర్లలా ఇక ఇళ్లకు ఆక్సిజన్ సిలిండర్లు!

గ్యాస్ సిలిండర్లలా ఇక ఇళ్లకు ఆక్సిజన్ సిలిండర్లు!

పెదవికి చిరునవ్వు అందం. ఆ చిరు నవ్వు దూరమవుతోంది. హాస్యం పేరుతో ఇప్పుడు చలామణిలో ఉన్నది ఎలాంటిదో ఇక్కడ చర్చ అనవసరం. కన్నడలో ప్రాణేష్ గొప్ప స్టాండప్ కమెడియన్. నిజానికి ఆయన్ను హాస్యానికి పరిమితం చేస్తే- సమాజానికే నష్టం.

గంగావతి గ్రామీణ ప్రాంతం మధ్యతరగతి నుండి అంచెలంచెలుగా ఎదిగిన ప్రాణేష్ తెలియని కన్నడ వారుండరు. కన్నడిగులున్న దేశాలన్నీ తిరిగి వచ్చిన హాస్యకళాకారుడు. పెద్ద సెలెబ్రిటీ. మంచి చదువరి. కన్నడ భాష, సంప్రదాయాలు, ఆచారాలను అపరిమితంగా ప్రేమించి, గౌరవించే వ్యక్తి. పురాణాలు, ఆధ్యాత్మిక గ్రంథాల కథలను నేటి పరిస్థితులకు అన్వయించి కడుపుబ్బా నవ్వించడంలో అందె వేసిన చేయి. ఏకబిగిన రెండు, మూడు గంటలు హాస్యం చిప్పిల్లేలా మాట్లాడగల నేర్పు ఉన్నవాడు.

అయిదేళ్ల కిందట ప్రాణేష్ ఒక హాస్య కార్యక్రమంలో మాట్లాడిన ప్రాణవాయువు కష్టాల వీడియో ఇప్పుడు కర్ణాటకలో వైరల్ అయ్యింది. అందులో ఆయన ఏమన్నారంటే-

“మనమంతా ఊపిరి పీల్చుకోవడానికి కారణం మన చుట్టూ ఉన్న చెట్లు. చెట్లే లేకుంటే.. మీరంతా ఆక్సిజన్ సిలిండర్లు తీసుకోవాల్సి వుంటుంది. ఒక ఆక్సిజన్ సిలిండర్ ధర ఏడు వందల రూపాయలు. ఓ మనిషికి రోజుకి మూడు సిలిండర్లు కావాలి. అంటే రోజుకి 2100 రూపాయలు.. 

 

ఈ లెక్కన సంవత్సరానికి ఎంతో లెక్కేసుకోండి. హలో వంటకి ఓ సిలిండర్.. అలాగే, పీల్చేందుకు మూడు ఆక్సిజన్ సిలిండర్లు పంపండీ! అని అడుక్కునే రోజులు మీ పిల్లల కాలానికి వస్తాయి. భవిష్యత్తులో మీ వీపుకి ఆక్సిజన్ సిలిండర్లు కట్టుకుని వెళ్లే రోజులొస్తాయి. ఇంటికి గ్యాస్ సిలిండర్ ఎలా వస్తుందో.. ఆక్సిజన్ సిలిండర్లూ తెప్పించుకోవాల్సిన రోజులు ఇంకెంతో దూరం లేవు మిత్రులారా. ఆ పరిస్థితిని రూపుమాపాలంటే.. మొక్కలు పెంచే బాధ్యతను మనందరం తీసుకోవాలి”

ప్రాణేష్ చెప్పినది అక్షరాలా జరుగుతోంది. కాకపొతే సందర్భం సాంకేతికంగా వేరు కావచ్చు. ఆయన హాస్యానికి చెప్పలేదు. హాస్యం పూత పూసి సీరియస్ గా జరగబోయేది చెప్పాడు. మనకు సీరియస్ విషయాలు హాస్యంగా తోస్తాయి. అపహాస్యం హాస్యంగా రచిస్తూ ఉంటుంది. కన్నడ తెలిసినవారు ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

 

https://youtu.be/E4Ai9i-PawE

ప్రాణేష్ మాటల్లో ఎంత ఆవేదన ఉందో? ఆయన హాస్యంలో ఎంత హెచ్చరిక ఉందో అర్థమవుతుంది.

-పమిడికాల్వ మధుసూదన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్