పాకిస్తాన్ సైన్యం ఆఫ్ఘనిస్తాన్ లోని వివిధ ప్రాంతాల్లో చేస్తున్న భీకర దాడులతో ఇప్పటివరకు 44 మంది చనిపోయారు. అఫ్ఘన్లోని ఖోస్త్, కునర్ రాష్ట్రాల నుంచి వేర్పాటువాదులు పాకిస్తాన్లో అలజడి సృస్తిస్తున్నారనే ఆరోపణలతో పాక్ ఎయిర్ ఫోర్సు ఈ రెండు రాష్ట్రాలపై దాడులకు దిగింది. ఈ దాడుల్లో మహిళలు, చిన్నారులు కూడా మృతి చెందారని.. అనేక మంది గాయపడ్డారని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. పాక్ దాడులకు నిరసనగా ఆఫ్ఘనిస్తాన్లోని వివిధ నగరాల్లో నిరసనలు వెల్లువెత్తాయి.
పాకిస్తాన్ ప్రభుత్వం ఆఫ్ఘన్ల సహనాన్ని పరీక్షిస్తోందని ఆ దేశ సాంస్కృతిక, సమాచార శాఖ ప్రతినిధి జబిహుల్లః ముజాహిద్ విమర్శించారు. పాక్ దాడులు ఆగకపోతే వాటిని ఎలా ఎదుర్కోవాలో ఆఫ్ఘన్ ప్రజలకు తెలుసనీ హెచ్చరించారు. దౌత్య మార్గాల సరిహద్దుల్లో ఉద్రిక్తతల నివారణకు కృషి చేస్తున్నామని, పాక్ ఎయిర్ ఫోర్సు దాడులు కొనసాగించటంతో శాంతి స్థాపన సాధ్యం కాదని తాలిబాన్ ప్రభుత్వం ప్రకటించింది. పరస్పర దాడులతో రెండు దేశాలకు నష్టం జరుగుతుందని, ఎవరికీ మేలు చేయదని తాలిబన్లు స్పష్టం చేశారు.
తెహ్రీక్ ఏ తాలిబాన్ కు చెందిన కొన్ని ముష్కర మూకలు ఆఫ్ఘన్లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళ నుంచే రెచ్చిపోతున్నారు. వీరు పాకిస్తాన్లోని ఖైభర్ పఖ్తుంక్వ, పంజాబ్ రాష్ట్రాల్లో మతోన్మాద కార్యక్రమాలు నిర్వహించటం, ఎదురు చెప్పే వారిపై దాడులు చేయటం, హతమార్చటం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మరింత పెరిగాయి. లాహోర్, పెషావర్ నగరాల్లో పోలీసుల మీద కూడా దాడి చేయటం పాక్ ప్రభుత్వాన్ని కలవరపరిచింది. తెహ్రీక్ ఏ తాలిబాన్ దుశ్చర్యలపై ఇమ్రాన్ ఖాన్ హయంలో పాక్ ప్రభుత్వం.. తాలిబాన్ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళింది. దీనిపై తాలిబన్లు స్పందించక పోగా పాక్ లో దాడులకు దిగివచ్చిన ముష్కరమూకలకు ఆశ్రయం ఇవ్వటం పాక్ ను రెచ్చగొట్టేలా చేసింది. తాజాగా ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పడిపోవటం.. షేహబాజ్ కొత్త ప్రధాని కావటంతో తాలిబాన్లను దారిలోకి తెచ్చేందుకు పాక్ సైన్యం ఏకంగా దాడులకే దిగింది.
Also Read : ఆఫ్ఘన్లో తాలిబాన్ల అరాచకాలు