Friday, March 29, 2024
HomeTrending Newsఆఫ్ఘన్లో తాలిబాన్ల అరాచకాలు

ఆఫ్ఘన్లో తాలిబాన్ల అరాచకాలు

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు అధికారంలోకి వచ్చాక అరాచకాలు పెరిగాయని వివిధ అంతర్జాతీయ సంస్థల నివేదికల్లో వెల్లడైంది. గత ప్రభుత్వంలో పనిచేసిన అనేక మంది ప్రభుత్వ ఉద్యోగుల్ని కిడ్నాప్ చేసి హతమార్చారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కోవలో ఇప్పటికే ఐదు వందల మంది అధికారుల జాడ తెలియటంలేదని న్యూ యార్క్ టైమ్స్ పత్రిక తన పరిశోధనాత్మక కధనంలో ప్రకటించింది. గత ఏడు నెలలుగా జరుగుతున్నా పరిణామాలు, తాలిబన్లు అనుసరిస్తున్న విధానాలు పరిశీలిస్తున్నామని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. తాలిబాన్ల అరాచకాలకు సంబంధించి తమ వద్ద DNA రిపోర్ట్ లతో కూడిన ఆధారాలు ఉన్నాయని తన కథనంలో పేర్కొంది.
అమెరికా సైన్యం అఫ్ఘన్ లో ఉన్నపుడు వారికి చేదోడు వాదోడుగా పనిచేసిన అనేక మంది అధికారుల్ని తాలిబన్లు చంపేశారని తేలింది. భాగ్లన్ రాష్ట్రంలోనే వందమందికి పైగా అధికారులు తాలిబాన్ల చేతిలో చనిపోయారని ఆమ్నెస్టీ ఇంటర్ నేషనల్ ప్రకటించింది. కందహార్ లో ఎక్కువగా యుఎస్ మిలిటరీ కోసం పనిచేసిన వారిని టార్గెట్ చేశారని, గతంలో ఆఫ్ఘన్ సైన్యంలో పనిచేసిన ఒక వ్యక్తిని కూడా వదలడం లేదని ఆమ్నెస్టీ నివేదికలో వెల్లడైంది. గత ప్రభుత్వంలో మిలిటరీలో పనిచేసిన వారిని అందరిని తీసుకొచ్చి కందహార్ లోని ఓ బావిలోకి తోసేశారని ప్రత్యక్ష సాక్షులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆఫ్ఘన్లో తమ ప్రభుత్వ గుర్తింపు కోసం అంతర్జాతీయంగా ప్రయత్నాలు చేస్తున్న తాలిబన్లు మరోవైపు స్వదేశంలో తమకు నచ్చని వారిని అంతమొందించేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు. న్యూయార్క్ టైమ్స్ తాజా కథనంతో అంతర్జాతీయంగా తాలిబన్లకు గడ్డు పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. నాటో, అమెరికా మిత్ర దేశాలు తాలిబన్లకు ఇప్పట్లో సహకరించే సూచనలు లేవు.

Also Read : తాలిబాన్ల పాలనతో ప్రజల ఇక్కట్లు

RELATED ARTICLES

Most Popular

న్యూస్